బిజెపి-టీడీపీ రాజకీయశోభనం ఉండదా?
టీడీపీ, బిజెపిలకు ఢిల్లీ పెద్దలు పెళ్లైతే చేశారు కానీ, రాజకీయ శోభనం జరిగేట్టు కనిపించడం లేదు. పొసగని పొత్తుతో ఇరు పార్టీలూ చేతులు కలపమంటే పిడికిళ్లు బిగిస్తున్నాయి.
విజయవాడలో టీడీపీ కేశినేని నానికి టికెట్ ఇవ్వడం, బిజెపికి మద్దతు ప్రకటిస్తున్న పవన్ కల్యాణ్ సన్నిహతుడు పొట్లూరి వరప్రసాద్ పోటీగా నామినేషన్ వేసే అవకాశం ఉండటంతో చంద్రబాబు కోపంగా ఉన్నారు. తానేం తక్కువ తినలేదన్నట్టు బిజెపి నర్సాపూర్ అభ్యర్థి రఘురామకృష్ణం రాజును టీడీపీ అభ్యర్థిగా ప్రకటించారు. ఈ ఎత్తుకు పై ఎత్తుగా బిజెపి కడప జిల్లా రాజం పేట నుంచి దగ్గుబాటి పురంధ్రేశ్వరిని అభ్యర్థిగా ప్రకటించింది. మళ్లీ బాబు గారికి కోపం వచ్చింది. దీంతో పొత్తు చిత్తయిపోయే పరిస్థితి వచ్చింది.
అసలు పొత్తు విషయంలో సీమాంధ్రలో ఎంతో కొంత సానుకూలత ఉన్నా, తెలంగాణ బిజెపి మాత్రం పొత్తును గట్టిగా వ్యతిరేకించింది. టీడీపీతో కలిస్తే బిజెపిపి నష్టం అని తెలంగాణ బిజెపి గట్టిగా నమ్ముతోంది. ఈ విషయంపై ఇప్పటికే బిజెపిలో చాలా అసంతృప్తి ఉంది. ఆదిలాబాద్ వంటి ప్రాంతాల్లో పలువురు బిజెపి నేతలు పార్టీ పదవులకు రాజీనామా చేశారు కూడా
ఇటు సీమాంధ్రలోనూ బిజెపి వర్గాల్లో చంద్రబాబు ధోరణి పట్ల కోపం పెల్లుబుకుతోంది. సీమాంధ్ర బిజెపి కూడా ఒంటరి పోరే మంచిదన్న అభిప్రాయానికి వస్తోంది.'పొత్తు ఇద్దరికీ మంచిది. ఒక్క బిజెపికే కాదు. టీడీపీకి కూడా పొత్తు అవసరమేనన్నది గుర్తుంచుకోవాలి' అని బిజెపి సీనియర్ నేత వెంకయ్య నాయుడు హెచ్చరించారు. టీడీపీ అధినేత చంద్రబాబు బిజెపి అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడం సరైనది కాదని కూడా బిజెపి భావిస్తోంది. అయితే నేనుగా నరేంద్ర మోడీతోనే మాట్లాడి 'మేటర్ సెటిల్ చేసుకోవాల'ని చంద్రబాబు ప్రయత్నిస్తున్నారు.
మరో వైపు బిజెపి సీమాంధ్రలో జగన్ దే పైచేయిగా ఉన్నప్పుడు టీడీపీని దేబిరించాల్సిన అవసరం ఏమిటి అని అనుకుంటున్నారట. ఇప్పుడు తన మాట చెల్లుబాటు చేయించుకునేందుకు చంద్రబాబు నేరుగా నరేంద్ర మోడీతో మాట్లాడేందుకు ప్రయత్నిస్తున్నారు.