1+1+1 ఎంతవుతుంది?
మామూలుగా1+1+1 ఎంతవుతుంది? ఎవరైనా చెప్పే జవాబు ఒకటే. మూడు అవుతుంది. కానీ నరేంద్ర మోడీది వింత లెక్క. ఆయన లెక్క ప్రకారం 1+1+1 కలిపితే 111 అవుతుంది. అదేమిటంటే రాజకీయాలకు ఒక లెక్కుంది. దానికి ఒక తిక్కుంది. రాజకీయాలు మ్యాథ్స్ కావు. రాజకీయాలు కెమిస్ట్రీ అంటారు మోడీ గారు. ఆయన లెక్క ప్రకారం బిజెపి, టీడీపీ, పవన్ కళ్యాణ్ కలిస్తే బలం మూడు రెట్లు కాదు, వంద రెట్లు పెరుగుతుంది. ఇదే మాటను ఆయన ఈ మధ్య హైదరాబాద్ లో జరిగిన బహిరంగ సభలో చెప్పారు.
అయితే మోడీ లెక్క నిజమౌతుందా? క్షేత్ర స్థాయిలో వాస్తవాలను చూస్తే 1+1+1 కలిపితే 0 అయ్యే సూచనలే ఎక్కువగా కనిపిస్తున్నాయన్నది రాజకీయ పరిశీలకుల మాట. ఇదే మోడీ హైదరాబాద్ బహిరంగ సభలో కనిపించింది. బిజెపి జనాన్ని సమీకరిస్తుందని టీడీపీ భావించింది. టీడీపీ జనాన్ని తెస్తుందని బిజెపి అనుకుంది. ఆఖరికి ప్రజల్ని తలా ఒక చెంబుడు పాలు పోయమన్న రాజు గారి కథలో లాగా ఎవరూఐ పాలు పోయలేదు. ఎవరూ జనాల్ని పోగుచేయలేదు. ఫలితంగా మోడీ సభ హైదరాబాద్ లో తుస్.....
తెలంగాణలో, సీమాంధ్రలో చాలా చోట్ల ఇప్పటి వరకూ టీడీపీ, బీజేపీల మధ్య సమన్వయం కుదరలేదు. రెండు పార్టీల పరిస్థితి ఒకే రైలుకి ఉన్న రెండు డబ్బాలు రెండు వైపులా వెళ్తున్నట్టు ఉంది. ఇక పవన్చా రైలు డబ్బా తానే ఇంజన్ అనుకుంటుంది. చోట్ల బిజెపి అభ్యర్థులకు టీడీపీ నుంచి సహకారం అందడం లేదు. టీడీపీ అభ్యర్థులున్న చోట బిజెపి కార్యకర్తలు వెంట కనిపిస్తే పడే మూడు నాలుగు మైనారిటీ ఓట్లూ ఆవిరైపోతాయన్న భయం ఉంది. కొన్ని చోట్ల బిజెపి అభ్యర్థులకు పోటీగా టీడీపీ రెబెల్స్ రంగంలో ఉన్నారు. ఇంకొన్ని చోట టీడీపీ ఏకంగా బీ ఫారాలే ఇచ్చేసింది.
తెలంగాణలో అయితే రెండు పార్టీలు కాపురం మొదలుపెట్టకుండానే ఎన్నికలు వచ్చేస్తున్నాయి. ఇంకా రెండురోజులే ప్రచారం చేయొచ్చు. ఏప్రిల్ 30 న ఎన్నికలే. సీమాంధ్రలోనూ పరిస్థితి అంతంతమాత్రంగానే ఉంది. మోడీ గారి లెక్క తప్పినట్టేనా మరి?