బీహార్లో మావోయిస్టులు రెచ్చిపోయారు. ముంగేర్ జిల్లాలో ఎన్నికల విధులు నిర్వహించేందుకు వెళ్తున్న భద్రత సిబ్బంది లక్ష్యంగా మందుపాతర పేల్చారు. ఆ ఘటనలో ఇద్దరు సీఆర్పీఎఫ్ జవాన్లు మృతి చెందారు. మరో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఆ సంఘటనపై సమాచారం అందుకున్న భద్రత దళాలు వెంటనే రంగంలో దూకాయి. మావోయిస్టుల కోసం భద్రత సిబ్బంది గాలింపు చర్యలు తీవ్ర తరం చేశారు. అయితే బీహార్ రాష్ట్రంలోని మావోయిస్టుల ప్రాబల్యం అధికంగా ఉన్న ఆరు లోక్సభ నియోజకవర్గాలలో నేడు ఎన్నికలు జరగునున్నాయి.
ఆరు నియోజకవర్గాలలో మొత్తం 80 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. వారిలో 10 మంది మహిళలు కూడా ఉన్నారు. లోక్సభ స్పీకర్ మీరాకుమార్, బీహార్ అసెంబ్లీ స్పీకర్ ఉదయ్ నారాయణ్ చౌదరి, కేరళ మాజీ గవర్నర్, న్యూఢిల్లీ మాజీ పోలీసు కమినర్ నిఖిల్ కుమార్, లోక్ జన శక్తి అధ్యక్షుడు రామ్ విలాస్ పాశ్వాన్ కుమారుడు చిరాగ్ పాశ్వాన్తో పాటు మాజీ కేంద్ర మంత్రి కాంతీ సింగ్లు నేడు పోలింగ్ జరిగే నియోజకవర్గాలలో అభ్యర్థులుగా ఉన్నారు.