'అబ్దుల్ కలాం సాధారణ సైంటిస్ట్ మాత్రమే'
న్యూఢిల్లీ: ప్రఖ్యాత శాస్త్రవేత్త, భారత మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం సేవలను యావత్ ప్రపంచం ప్రస్తుతిస్తుంటే ఒక్కరు మాత్రం ఆయనను తూలనాడారు. కలాం సాధించిన విజయాలను అందరూ స్మరించుకుంటుంటే పాకిస్థాన్ అణు పితామహుడు అబ్దుల్ ఖదీర్ ఖాన్ మాత్రం భిన్నంగా స్పందించారు.
నిరాడంబర జీవితం గడిపిన అబ్దుల్ కలాం సాధారణ శాస్త్రవేత్త మాత్రమేనని బీబీసీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఖాన్ పేర్కొన్నారు. కలాం చెప్పుకోదగ్గ విజయాలేవి సాధించలేదని, భారత అణు క్షిపణి కార్యక్రమం అంతా రష్యా సహకారంతోనే కొనసాగిందని చెప్పుకొచ్చారు. కలాం రాష్ట్రపతి కావడం వెనుక రాజకీయాలున్నాయని ఆరోపించారు. ముస్లిం ఓట్లకు గాలం వేసేందుకే 2002లో ఎన్డీఏ ప్రభుత్వం కలాంను రాష్టప్రతిని చేసిందని పేర్కొన్నారు.
అణ్వాయుధాలకు సంబంధించిన రహస్యాలు విదేశాలకు చేరవేశారన్న ఆరోపణలతో పాకిస్థాన్ ప్రభుత్వం 2004లో ఏక్యూ ఖాన్ ను పదవి నుంచి తప్పించి, గృహంలో నిర్బంధించింది. ఇస్లామాబాద్ హైకోర్టు ఆదేశాలతో 2009లో ఆయనకు విముక్తి లభించింది.