వాటికోసం జయ పట్టువిడవని పోరాటం
వాటికోసం జయ పట్టువిడవని పోరాటం
Published Tue, Dec 6 2016 4:37 PM | Last Updated on Thu, Sep 27 2018 8:27 PM
కర్ణాటక, తమిళనాడులకు రావణకాష్టలా ఉన్న కావేరి నీళ్ల వివాదంపై జయలలిత అలుపెరగని పోరాటం చేశారు. ఆమె అధికారంలో ఉన్నా, లేకపోయినా ఈ సమస్యపై పోరాడుతూనే ఉన్నారు. కావేరీ నది నుంచి కర్ణాటక నీళ్లను విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ జయలలిత రెండు సార్లు నిరాహార దీక్షకు దిగారు. గత 35 ఏళ్లుగా కావేరీ నదీ జలాలపై ఆమె ఏన్నాడూ తన పట్టువిడవలేదు. వందేళ్లుగా సాగుతున్న ఈ వివాదంపై తమిళనాడుకు దక్కాల్సిన వాటా రాష్ట్రానికి దక్కాల్సిందేనని డిమాండ్ చేస్తూనే ఉన్నారు. 1993లో అయితే హఠాత్తుగా ఆమె నాలుగురోజులు నిరాహార దీక్షను ప్రారంభిస్తున్నట్టు ప్రకటించారు. దీంతో ఆ రాష్ట్రంలో అల్లర్లు చెలరేగాయి. ఫలితంగా 1998లో కావేరీ రివర్ అథారిటీ కూడా ఏర్పాటైంది. ప్రధానమంత్రి చైర్పర్సన్గా, కావేరీ బేసిన స్టేట్ ముఖ్యమంత్రులు సభ్యులుగా ఈ అథారిటీని ఏర్పాటుచేశారు. ఈ అథారిటీ 2002 ఆగస్టులో ఏర్పాటుచేసిన మీటింగ్లో తమిళనాడుకు అన్యాయంగా నిర్ణయం వస్తుందని తెలిసి ఆమె ఆ మీటింగ్ నుంచే వాకౌట్ చేశారు.
1991 కాలంలో కూడా ఈ వివాదంపై కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలు యుద్ధానికే దిగే ఛాయలు నెలకొన్నాయి. ఆ సమయంలో తమిళనాడు సీఎంగా జయలలిత పదవిలో ఉన్నారు. కర్ణాటక ఏటా 205 టీఎంసీల నీటిని తమిళనాడుకు విడుదలచేయాలని ట్రైబ్యూనల్ ఆదేశించింది, కానీ ట్రైబ్యునల్ ఉత్తర్వుల్ని రద్దు చేస్తూ కర్ణాటక ప్రభుత్వం ఆర్డినెన్స్ను జారీచేసింది. ఫలితంగా హింసాత్మక ఘటనలే చోటుచేసుకున్నాయి. పదవిలో ఉన్న జయలలిత ప్రభుత్వం ఈ విషయంపై న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. కర్ణాటక నిర్ణయాన్ని తీవ్రంగా పరిగణించిన సుప్రీం ఆ ఆర్డినెన్స్ను రద్దుచేసింది. కోర్టు నిర్ణయాన్ని పాటించాలని ఆదేశించింది. కానీ ఆ నిర్ణయాన్ని కూడా కర్ణాటక బేఖారతు చేసింది. ఇటు కేంద్రం, అటు కర్ణాటక ప్రభుత్వాలు నదీ జలాలపై నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో జయలలిత ఇరు ప్రభుత్వాలకు గట్టి వార్నింగ్ ఇచ్చారు. రాష్ట్రంలో హోంమంత్రి హాజరుకాబోయే పలు కార్యక్రమాల నుంచి తన పార్టీ సభ్యులు బాయ్ కాట్ చేయాలని ఆదేశించారు. కేంద్రం తమకు సపోర్టు ఇచ్చే వరకు తాము తగ్గేది లేదని పేర్కొన్నారు.
1993లో ఆమె చేసిన దీక్షకు దిగొచ్చిన కేంద్రం 1998లో కావేరి వాటర్ అథారిటీని నియమించనున్నట్టు హామీ ఇచ్చింది. దీంతో ఆమె దీక్ష విరమించారు. సుదీర్ఘ విచారణ అనంతరం 2007లో ట్రైబ్యునల్ మళ్లీ తుది తీర్పును వెలువరించింది. అయితే ఈ ఉత్తర్వుల్ని గెజిట్ లో పొందుపరచలేదు. దీంతో గెజిట్లో ఈ ఆర్డర్ను పబ్లిష్ చేసేలా చూడటమే తనకు ముఖ్యమైన విషయమని 2011 ఎన్నికల్లో గెలిచిన జయలలిత రైతులకు వాగ్దానం చేశారు. చివరకు 2013లో కేంద్రం ట్రైబ్యునల్ తుది తీర్పును నోటిఫై చేసింది. జయ జన్మదినానికినాలుగు రోజుల ముందే ట్రైబ్యునల్ తీర్పును నోటిఫై చేస్తున్నట్టు సుప్రీం ప్రకటించడంతో తన బర్త్డే గిప్ట్గా దీన్ని ప్రకటించారు. అయినా రెండు రాష్ట్రాల మధ్య జల వివాదం కొలిక్కిరాలేదు. ట్రైబ్యునల్ ఉత్తర్వుల మేరకు కర్ణాటక తమిళనాడుకు నీటిని విడుదల చేయకపోవడం, కర్ణాటక విడుదల చేసిన నీరు చాలవని తమిళనాడు కోర్టు మెట్లెక్కడం పరిపాటిగా మారింది.
Advertisement
Advertisement