ఫోన్ పగలగొట్టిందని.. నాయనమ్మను చంపేశాడు!
వస్తువుల మీద మోజు పెరిగి.. మనుషులను దూరం చేసుకుంటున్నామని చాలా మంది చెబుతున్నారు. బెంగళూరులో సరిగ్గా ఇలాగే జరిగింది. తన కొత్త స్మార్ట్‌ఫోన్‌ను పగలగొట్టిందన్న కోపంతో.. 90 ఏళ్ల నాయనమ్మను ప్లాంకుతో కొట్టి చంపేశాడు ఆమె మనవడు. బెంగళూరులోని కదిరెనహళ్లి ప్రాంతంలో ఉన్న తమ ఇంట్లో శివరాజ్ (22) అనే యువకుడు తన కొత్త స్మార్ట్‌ఫోన్‌ను చార్జింగ్‌లో పెట్టాడు. అతడి నాయనమ్మ లక్ష్మమ్మ (90)కు కంటిచూపు సరిగా ఉండదు. దాంతో ఆమె చూసుకోకుండా ఆ ఫోన్‌కు తగలడంతో అది కాస్తా కింద పడింది. ఆ ఫోను స్క్రీన్ ముక్కలు ముక్కలుగా పగిలిపోయింది.
ఆ శబ్దం విన్న శివరాజ్ లోపలి నుంచి పరుగున అక్కడకు వచ్చాడు. వెంటనే కోపంతో చెక్క ప్లాంకు తీసుకుని నాయనమ్మ మెడమీద కొట్టాడు. దాంతో ఆమె తీవ్రమైన నొప్పితో కుప్పకూలిప ఓయారు. ఎందుకలా కొట్టావని కుటుంబ సభ్యులు అతడిని తిట్టారు. అనంతరం లక్ష్మమ్మను బెడ్రూంలోకి తీసుకెళ్లి, ఆమెను నెమ్మదిగా పడుకోబెట్టారు. మర్నాడు ఉదయం లక్ష్మమ్మను ఎంత లేపినా ఆమె లేవలేదు. వెంటనే సమీపంలోని ఆస్పత్రికి తీసుకెళ్లగా ఆమె అప్పటికే చనిపోయినట్లు వైద్యులు తెలిపారు. పోలీసులు ఆమె మృతదేహాన్ని పోస్టుమార్టంకు పంపి, శివరాజ్‌ను అరెస్టు చేశారు.