- ఎస్‌బీఐ కోహినూర్‌లో స్థిరంగా ఖాతాలు
- హైదరాబాద్ శాఖలో 220 వరకూ అకౌంట్లు
- ఈ శాఖలో కనీస డిపాజిట్ కోటి రూపాయలు
- విశాఖలో మాత్రం రూ.50 లక్షలకు తగ్గింపు
- ద్వితీయశ్రేణి నగరాల్లో స్పందన తక్కువే
- వసుంధర, యువ శాఖలపై బ్యాంకు దృష్టి
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఆర్థిక మందగమన ప్రభావం సామాన్యులపై బాగానే పడుతోంది. భారీగా తగ్గుతున్న మధ్యతరగతి కొనుగోళ్లే దీన్ని కళ్లకు కట్టినట్లు చూపిస్తున్నాయి. కానీ... కోటీశ్వరులపై మాత్రం ఇలాంటి మందగమనాలు ఎలాంటి ప్రభావమూ చూపించటం లేదు. కోటి రూపాయల ‘మినిమమ్ బ్యాలెన్స్‌ను’ మెయిన్‌టెయిన్ చేస్తూ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కోహినూర్ శాఖలో ఖాతాలు నిర్వహిస్తున్న వారు గడిచిన రెండేళ్లుగా ఒక్కరూ తగ్గకపోవటమే దీనికి ప్రత్యక్ష నిదర్శనం. కోటి రూపాయలు డిపాజిట్ చేస్తే ఖాతాదారుల ఇంటి ముంగిట్లోకే బ్యాంకింగ్ సేవలను అందించేలా రూపొందించిన ఈ కోహినూర్ శాఖల్లో లావాదేవీలు కూడా ఏమాత్రం తగ్గటం లేదు. కాకపోతే... ఈ కోటీశ్వరులు హైదరాబాద్ వంటి పెద్ద నగరాలకు మాత్రమే పరిమితమవుతున్నారన్నది గమనార్హం.
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌లో మూడేళ్ల కిందట ఈ కోహినూర్ శాఖను ఆరంభించింది. మొదటి నుంచీ దాదాపు 200-220 మధ్య ఉండే ఖాతాలు... ఇప్పటికీ అదే సంఖ్యలో కొనసాగుతున్నాయి. వీరి డిపాజిట్ల విలువ రూ.230 కోట్ల నుంచి 250 కోట్ల మధ్య ఉంది. మాంధ్యం ప్రభావం తమ బ్యాంకు ఖాతాలపై పెద్దగా లేదని ఎస్‌బీఐ ఉన్నతాధికారి ఒకరు తనను సంప్రతించిన సాక్షి బిజినెస్ బ్యూరో ప్రతినిధితో చెప్పారు. ‘‘మొదటి రెండు సంవత్సరాల్లో లావాదేవీల్లో వృద్ధి బాగా కనిపించింది. అలాగని ఇప్పుడేమీ తగ్గలేదు. స్థిరంగా ఉందంతే’’ అన్నారాయన. గతేడాది విశాఖపట్నంలో కూడా కోహినూర్ బ్రాంచి ఏర్పాటు చేశారు. అయితే అది ద్వితీయ శ్రేణి నగరం కనక అక్కడ కనీస డిపాజిట్ మొత్తాన్ని రూ.కోటి నుంచి రూ.50 లక్షలకు తగ్గించారు. హైదరాబాద్‌తో పోల్చి చూస్తే అక్కడ ఆదరణ తక్కువగానే ఉన్నట్లు సమాచారం. అయితే అక్కడ కూడా మొదట్లో ఎన్ని ఖాతాలున్నాయో ఇప్పటికీ అవే ఖాతాలు కొనసాగుతున్నాయి. ఉన్న కోటీశ్వరులంతా హైదరాబాద్‌లోనే ఉన్నారని చెబుతున్న బ్యాంకు అధికారులు... ఈ కారణం వల్లే విజయవాడ వంటి ద్వితీయ శ్రేణి నగరాల్లో కోహినూర్ శాఖలు ఏర్పాటు చేయాలనుకున్న ఆలోచనలను తాత్కాలికంగా వాయిదా వేసుకున్నట్లు చెప్పారు.
అద్వితీయ సేవలు...
ప్రీమియం సేవల్లో ప్రయివేటు బ్యాంకులతో పోటీపడేందుకు ఎస్‌బీఐ కోహినూర్ శాఖలకు శ్రీకారం చుట్టింది. హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌లో సంపన్నుల కోసమే దీన్ని ఏర్పాటు చేసింది. ఖాతాదారులను ఇంటి దగ్గర నుంచి తీసుకొచ్చి మళ్లీ ఇంట్లో దింపటమే కాకుండా అవసరమైతే ఇంటివద్దనే వారికి కావల్సిన బ్యాంకింగ్ సేవలను అందించటం ఈ శాఖ ప్రత్యేకత. బ్యాంకుకి కాకుండా ఒక రెస్టారెంట్‌కు వెళ్ళిన అనుభూతిని కల్పించే విధంగా లాంజ్, కాఫీ క్లబ్, కాన్ఫెరెన్స్ రూమ్, ైవైఫై కనెక్టివిటీ వంటి అధునాతన సౌకర్యాలు ఈ శాఖ ప్రత్యేకతలు. ఈ ప్రయోగం విజయవంతమవడంతో ఎస్‌బీఐ దేశవ్యాప్తంగా పలు పట్టణాల్లో ఇలాంటి శాఖలను ఏర్పాటు చేస్తోంది. అంతేకాక మధ్యతరగతి యువతీ యువకుల కోసం ఇలాంటి సౌకర్యాలతో వసుంధర పేరుతో మహిళల కోసం, ‘యువ’ పేరిట యువత కోసం ప్రత్యేక శాఖలను ఏర్పాటు చేసింది.