ప్రశ్నార్థకంగా ఆంధ్రప్రదేశ్!
కోయంబత్తూరు: ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంతో అట్టుడుకుతున్న ఆంధ్రప్రదేశ్ పరిస్థితి తమకు ఇంకా ప్రశ్నార్థకంగానే ఉందని స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ (ఎస్‌బీహెచ్) ఎండీ ఎం.భగవంత రావు వెల్లడించారు. తెలంగాణ ఉద్యమ ప్రభావం తమ వ్యాపారంపై తీవ్రంగా పడిందని తెలిపారు. బ్యాంకును వృద్ధి బాట పట్టించేందుకు ఇతర రాష్ట్రాలు, ఎంఎస్‌ఎంఈ విభాగంపై దృష్టి పెట్టామని అన్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ వెలుపల 60కిపైగా శాఖలను తెరిచామన్నారు. ‘2013-14ను ఎంఎస్‌ఎంఈ సంవత్సరంగా పరిగణిస్తున్నాం. ఎస్‌ఎంఈకి రూ.5,500 కోట్ల రుణా లు మంజూరు చేశాం. ఈ రంగానికి మొత్తం రూ.9 వేల కోట్లు జారీ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాం’ అని చెప్పారు. ఎస్‌బీఐలో ఎస్‌బీహెచ్ విలీన ప్రక్రియపైనా ఉద్యమ తాకిడి పడిందన్నారు. కొన్ని శాఖలు కొద్ది రోజుల పాటు మూసివేయాల్సి వచ్చిం దని, తద్వారా వ్యాపారంపై, నిరర్థక ఆస్తులపై ప్రభా వం చూపిందని పేర్కొన్నారు. నిరర్థక ఆస్తులుగా పరిగణిస్తున్న రూ.700 కోట్ల రుణాలను కార్పొరేట్ రుణ పునర్‌వ్యవస్థీకరణకు సిఫార్సు చేశామన్నారు.
ఆంధ్రప్రదేశ్ నుంచే..
ఎస్‌బీహెచ్ ఏటా చేస్తున్న రూ.2.2 లక్షల కోట్ల వ్యాపారంలో ఆంధ్రప్రదేశ్ నుంచి ఏకంగా రూ.1 లక్ష కోట్లకుపైగా సమకూరుతోంది. బ్యాంకుకు తెలంగాణలో 550, రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లో 450 శాఖలున్నాయి. తెలంగాణ నుంచి రూ.65 వేల కోట్ల వ్యాపారం నమోదవుతోంది. శాఖల మూసివే త కొనసాగడంతో వ్యాపారం నష్టపోయాం అని భగవంతరావు వెల్లడించారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో డిపాజిట్లలో 20%, అడ్వాన్సుల్లో 18% వృద్ధి లక్ష్యంగా విధించుకున్నప్పటికీ, ఈ రెండు విభాగాల్లో డిసెం బరు నాటికి 14.5% వృద్ధి మాత్రమే నమోదయ్యేట్టు ఉందని చెప్పారు.