13 నెలలుగా ఆ శవం అచ్చం అలాగే...
లిమా: పెరు దేశంలోని జూనిన్ ప్రాంతానికి చెంది డాక్టర్ ఎడ్గార్ అరంద తన సోదరుడి మృతదేహాన్ని 13 నెలలపాటు చెక్కు చెదరకుండా భద్రపర్చి వైద్య రంగంలో సరికొత్త రికార్డు సృష్టించారు. కొన్ని వందల ఏళ్ల వరకు మృతదేహాలను భద్రపరిచే ఈజిప్టు మమ్మీల గురించి మనకు తెల్సిందే. మమ్మీల విషయంలో మృతదేహం జుట్టూ, గోళ్లు, చర్మం రాలిపోతుంది. అలా కాకుండా చనిపోయినప్పుడు తన సోదరుడు రామన్ ఎలా ఉన్నాడో ఇప్పుడు అచ్చం అలాగే ఉండేలా చేయడం ద్వారా శాస్త్ర విజ్ఞానంలో సరికొత్త ఆవిష్కరణకు డాక్టర్ ఎడ్గార్ శ్రీకారం చుట్టారు.
తన సోదరుడైన రామన్ మృతదేహం నుంచి రక్తాన్ని పూర్తిగా బయటకుతీసి, దానికి కొన్ని ప్రత్యేక రసాయనాలను మిలితం చేసి తిరిగి శరీరంలోకి ఎక్కిండం ద్వారా మృతదేహాన్ని భద్రంగా ఉంచగలిగానని డాక్టర్ ఎడ్గార్ తెలిపారు. ఆ రసాయనాల ఫార్ములాను మాత్రం ఇప్పుడే వెల్లడించనని, భారీ ఎత్తున మృతదేహాలను భద్రపరిచే ప్రక్రియను పూర్తిచేసిన తర్వాత ఫార్ములాను వెల్లడిస్తానని ఆయన చెప్పారు. ఆయన తాను చేసిన ఈ ప్రయోగాన్ని తన బంధువుల ముందు ప్రదర్శించారు. దాన్ని వీడియోతీసి ఆన్‌లైన్‌లో పోస్ట్ చేశారు.
తన సోదరుడు రామన్ ‘అన్నా, ఏ విధంగాను నీకు సహాయ పడలేక పోతున్నాను’ అంటూ తరచూ బాధపడే వాడని, చివరకు చనిపోయిన తర్వాత ఇలా తన రుణం తీర్చుకున్నాడని డాక్టర్ ఎడ్గార్ తన బంధువులతో వ్యాఖ్యానించారు. కొత్త ఆవిష్కరణకు తెరతీసిన డాక్టర్ ఎడ్గార్‌ను గౌరవించాల్సిందేనని బంధువులు వ్యాఖ్యానించగా, అసలు ఎందుకు ఓ మృతదేహాన్ని భద్రపర్చాలి, అవసరం ఏమిటీ? అంటూ ఫేస్‌బుక్‌లో చాలా మంది యూజర్లు ప్రశ్నించారు.
చనిపోయిన వారి నుంచి వెళ్లిపోయిన ఆత్మ ఎప్పుడో ఒకప్పుడు తిరిగి వస్తుందనే నమ్మకంతో క్రీస్తు పూర్వం ఆరువేల సంవత్సరాల క్రితం ఈజిప్టులు మృతదేహాలను భద్రపరిచేవారు.