అమెరికా కమ్యూనికేషన్ల చట్టంలో సవరణలు | electronic communications privacy act - summary of federal laws | Sakshi
Sakshi News home page

అమెరికా కమ్యూనికేషన్ల చట్టంలో సవరణలు

Published Tue, Jul 19 2016 3:49 PM | Last Updated on Fri, Aug 24 2018 8:18 PM

అమెరికా కమ్యూనికేషన్ల చట్టంలో సవరణలు - Sakshi

అమెరికా కమ్యూనికేషన్ల చట్టంలో సవరణలు

వాషింగ్టన్: టెర్రరిజమ్, ఇతర క్రిమినల్ కేసులకు సంబంధించిన దర్యాప్తులో భాగంగా ఐటీ కంపెనీలు, ముఖ్యంగా విదేశాల్లో నెలకొల్పిన అమెరికా ఐటీ కంపెనీల సర్వర్లలో నిక్షిప్తమైన వినియోగదారుల ఎలక్ట్రానిక్ సమాచారాన్ని సేకరించేందుకు అమెరికాకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. వీటిని అధిగమించేందుకు దశాబ్దాల నాటి ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్ చట్టంలో మార్పులు తీసుకరావాలని అమెరికా నిర్ణయించింది. అందులో భాగంగా బరాక్ ఒబామా యంత్రాంగం తాజా ప్రతిపాదనలను తీసుకొచ్చింది.

 అమెరికా వెలుపలనున్న మైక్రోసాఫ్ట్ కంపెనీ వినియోగదారుడి ఈ-మెయిళ్లను ఇవ్వాల్సిందిగా ఆ కంపెనీపై ఒత్తిడి చేసే అధికారం అమెరికా ప్రభుత్వానికి లేదంటూ ఓ కేసులో అమెరికా ఫెడరల్ అప్పీళ్ల కోర్టు తీర్పు చెప్పడంతో ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్ల చట్టాన్ని సవరించాలని ఒబామా యంత్రాంగం నిర్ణయించింది. విదేశాల్లో ఉన్న అమెరికా ఐటీ కంపెనీలకు ఆయా దేశాల చట్టాలు వర్తిస్తాయి గనుక ఆ మేరకు ఆయా దేశాలతో ఒప్పందం చేసుకునేందుకు వీలుగా ఈ సవరణలను ప్రతిపాదిస్తున్నారు. ఈ ప్రతిపాదనలను అమెరికా పార్లమెంట్ ఆమోదించిన తర్వాత వివిధ దేశాలతో పరస్పర సహకార ఒప్పందాలను చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పటికీ ఇలాంటి ఒప్పందం అమెరికాతో చేసుకోవడానికి బ్రిటన్ ముందుకొచ్చింది.

ప్రస్తుతం క్రిమినల్ కేసులకు సంబంధించి విదేశాల నుంచి అవసరమైన ఎలక్ట్రానిక్ సమాచారాన్ని ‘పరస్పర న్యాయ సహకార ఒప్పందాల (ఎంఎల్‌ఏటీ)’ కింద అమెరికా సేకరిస్తోంది. కావాల్సిన సమాచారం గురించి సంబంధిత దేశానికి ముందుగా దౌత్యపరమైన విజ్ఞప్తులు పంపించాలి. ఆ తర్వాత వారంట్ జారీ చేసి పంపించాలి. సదరు దేశం చట్టాల ప్రకారం అక్కడి వారు సమాచార సహకారాన్ని అందిస్తారు. ఈ ప్రక్రియ పూర్తయ్యేందుకు కాలహరణం జరుగుతోంది.

అలా జరగకుండా చూసేందుకే ఈ కొత్త సవరణ ప్రతిపాదనలు. ఈ విషయంలో అమెరికాతో ఒప్పందం చేసుకున్న దేశాలు కూడా అవసరమైతే తమ దేశాల్లో సమాచార చట్టాలను మార్చుకోవాల్సి ఉంటుంది. మానవ హక్కులకు, వ్యక్తి ప్రైవసీకి ఎలాంటి భంగం వాటిల్లకుండా చట్టంలో సవరణలు ఉండాలని ఐటీ కంపెనీల సంఘం డిమాండ్ చేసింది. వ్యక్తిగత ప్రైవసీవాదులు మాత్రం ఈ చట్టం సవరణలపై సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement