ముంబై పేలుళ్ల దోషులకు ఉరిశిక్ష | Five of 12 convicts in the 7/11 train blasts case sentenced to death | Sakshi
Sakshi News home page

ముంబై పేలుళ్ల దోషులకు ఉరిశిక్ష

Published Wed, Sep 30 2015 12:26 PM | Last Updated on Sun, Sep 3 2017 10:15 AM

ముంబై పేలుళ్ల దోషులకు ఉరిశిక్ష

ముంబై పేలుళ్ల దోషులకు ఉరిశిక్ష

ఐదుగురికి మరణశిక్ష, ఏడుగురికి జీవిత ఖైదు విధించిన మోకా కోర్టు
2006లో లోకల్ రైళ్లలో వరుస పేలుళ్లతో
189 మందిని బలితీసుకున్న ‘సిమి’ఉగ్రవాదులు
పేలుళ్లలో పాకిస్తానీల హస్తం; పరారీలో 13 మంది పాక్ నిందితులు

 
 ముంబై : తొమ్మిదేళ్ల క్రితం ముంబైను వణికించిన వరుస పేలుళ్ల కేసులో ఐదుగురు దోషులకు మరణ శిక్ష విధిస్తూ ప్రత్యేక మోకా(ఎంసీఓసీఏ) కోర్టు బుధవారం తీర్పు వెలువరించింది. మరో ఏడుగురికి జీవిత ఖైదు విధించింది. ఒక్కొక్కరికి దాదాపు రూ. 11 లక్షల చొప్పున రూ. 1.51 కోట్ల జరిమానా విధించింది. 2006, జూలై 11న ముంబైలోని ఏడు లోకల్ రైళ్లలో పదినిమిషాల వ్యవధిలో జరిగిన వరుస బాంబు పేలుళ్ల ఘటనలో 189 మంది చనిపోగా, 829 మంది గాయపడ్డారు.

ఆ ఘటనకు సంబంధించిన కేసును విచారించిన ముంబైలోని స్పెషల్ మోకా కోర్టు న్యాయమూర్తి యతిన్ డీ షిండే.. కమల్ అహ్మద్ అన్సారీ(37), మొహమ్మద్ ఫైజల్ షేక్(36), ఎహ్తెషామ్ సిద్దిఖీ(30), నవీద్ హుస్సేన్ ఖాన్(30), ఆసిఫ్ ఖాన్(38)లకు ఉరిశిక్ష విధించారు. వీరు లోకల్ ట్రైన్స్‌లో బాంబులను అమర్చినవారు. ఈ కుట్రలో పాలుపంచుకున్న తన్వీర్ అహ్మద్ అన్సారీ(37), మొహమ్మద్ మాజిద్ షఫీ(32), షేక్ అలామ్ షేక్(41), మొహమ్మద్ సాజిద్ అన్సారీ(34), ముజామిల్ షేక్(27), సొహైల్ మొహమ్మద్ షేక్(43), జమీర్ అహ్మద్ షేక్(36)లకు న్యాయమూర్తి షిండే జీవిత ఖైదు విధించారు.

దోషులందరికీ నిషేధిత సంస్థ ‘సిమి’తో సంబంధాలున్నట్లు తేలింది. తీర్పుపై బాధితుల బంధువులు, ప్రాసిక్యూషన్ లాయర్లు హర్షం వ్యక్తం చేయగా, దోషుల తరఫున హైకోర్టుకు అప్పీల్ చేయనున్నట్లు వారి బంధువులు, డిఫెన్స్ న్యాయవాదులు తెలిపారు. తమ క్లయింట్లు అమాయకులని, ఈ తీర్పు అన్యాయమని డిఫెన్స్ లాయర్ యుగ్ మోహిత్ చౌధరి వ్యాఖ్యానించారు. ఆలస్యంగానైనా సరైన తీర్పు వచ్చిందని బాధితుల తరఫువారు పేర్కొన్నారు. తీర్పు సమయంలో దోషులంతా ఎలాంటి భావోద్వేగాలు వ్యక్తం చేయకుండా, మౌనంగా నిల్చున్నారు.

అనంతరం కోర్టు వెలుపల మాట్లాడుతూ, తీర్పు తమను నిరుత్సాహపరచిందని, హైకోర్టులో అపీల్ చేస్తామని తెలిపారు. ఈ వరుస పేలుళ్ల కేసును దర్యాప్తు జరిపిన ఉగ్రవాద వ్యతిరేక బృందం(ఏటీఎస్).. భారతీయ శిక్షాస్మృతి, ఎక్స్‌ప్లోజివ్స్ యాక్ట్, చట్ట వ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం, భారతీయ రైల్వే చట్టం, మోకా.. తదితర చట్టాల్లోని పలు సెక్షన్ల కింద  30 మందిని నిందితులుగా పేర్కొంటూ 2006 నవంబర్‌లో చార్జిషీటును వేసింది. వారిలో 17 మంది ఆచూకీ తెలియరాలేదు. మిగిలిన 13 మందిని(వీరంతా భారతీయులు) ఏటీఎస్ అరెస్ట్ చేసింది. వీరిలో నవీద్ హుస్సేన్ ఖాన్‌ను హైదరాబాద్‌లోని నేరేడ్‌మెట్‌లో అదుపులోకి తీసుకుంది.

ఈ సెప్టెంబర్ 11న వారిలో 12 మందిని మోకా కోర్టు దోషులుగా నిర్ధారించి, ఒకరిని నిర్దోషిగా విడుదల చేసింది. ఆచూకీ లభించని 17 మందిలో లష్కరే తోయిబాకు చెందిన, పేలుళ్ల కీలక సూత్రధారి అజం చీమా సహా 13 మంది పాకిస్తానీయులున్నారు. పేలుళ్లకు వాడిన ఆర్డీఎక్స్ బాంబులను ముంబై శివారు గోవండి లోని ఓ గదిలో తయారు చేసినట్లు దర్యాప్తులో తేలింది. ఈ కేసు విచారణ దాదాపు 8 ఏళ్లు సాగగా, మధ్యలో సుప్రీంకోర్టు స్టే విధించడంతో రెండేళ్ల పాటు ఆగిపోయింది.

 ఉరిశిక్ష పడిన వారిలో.. కమల్ అహ్మద్ అన్సారీ పాకిస్తానీయులను నేపాల్ సరిహద్దు ద్వారా ముంబై తీసుకువచ్చాడు. పేలుడు పదార్థాలను ఇచ్చాడు. పాక్‌లో ఉగ్ర శిక్షణ పొందాడు. మొహమ్మద్ ఫైజల్ షేక్ రెండుసార్లు పాక్‌కు వెళ్లి ఈ శిక్షణ పొందడమే కాకుండా పలువురు యువకులను శిక్షణకు పాక్ పంపాడు. పాక్ జాతీయులకు ముంబైలో బస ఏర్పాటు చేశాడు. పేలుళ్ల కుట్రలో కీలకం గా వ్యవహరించాడు. ఎహ్తెషామ్ సిద్దిఖీ సిమికి మహారాష్ట్రలో సంయుక్త కార్యదర్శిగా వ్యవహరించాడు. బాంబుల తయారీని పర్యవేక్షించి, వాటిని పెట్టాల్సిన రైళ్లను నిర్ణయించాడు.
 
 2006, జూలై 11న..
 ముంబైలో నిత్యం రద్దీగా ఉండే ఏడు లోకల్ రైళ్లలోని ఫస్ట్‌క్లాస్ కోచ్‌ల్లో ముష్కరులు ఆర్డీఎక్స్ బాంబులను అమర్చారు. చర్చ్‌గేట్ స్టేషన్‌కు వేర్వేరు టాక్సీల్లో బాంబులతో వచ్చి, వేర్వేరు రైళ్లలో బాంబులను అమర్చారు. బొరివిలి, ‘ఖార్ రోడ్- శాంతాక్రజ్’, ‘బాంద్రా ఖార్ రోడ్’, ‘జోగేశ్వరి- మాహిమ్ జంక్షన్’, ‘మీరా రోడ్-భయందర్’, ‘మాతుంగ-మాహిం జంక్షన్’ల మధ్య సాయంత్రం సమయంలో 10 నిమిషాల వ్యవధిలో అవి పేలి, విధ్వంసం సృష్టించాయి. ఆ పేలుళ్లలో 189 మంది దుర్మరణం పాలయ్యారు. 189వ మృతుడు గత తొమ్మిదేళ్లుగా చికిత్స పొందుతూ ఈ జూలైలో చనిపోయిన పరాగ్ సావంత్.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement