సాక్షి, హైదరాబాద్: అవిభాజ్య ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2008లో జారీ చేసిన జీవో 166ను అమలు చేయడం లేదని ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు హైకోర్టుకు నివేదించాయి. ఏళ్ల తరబడి ప్రభుత్వ భూముల్లో నివాసం ఉంటున్న పేదల పేరు మీద ఆ భూములను క్రమబద్ధీకరించే ఉద్దేశంతో అప్పట్లో ఈ జీవోను విడుదల చేశారు. జీవో అమలు చేయడం లేదంటూ ఇరు రాష్ట్రాల అడ్వొకేట్ జనరళ్లు చేసిన ఈ ప్రకటనను నమోదు చేసుకున్న హైకోర్టు ధర్మాసనం, జీవో 166కు సంబంధించిన ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని పరిష్కరిస్తున్నట్లు పేర్కొంది.
ఈ జీవోను అడ్డం పెట్టుకొని నిబంధనలకు విరుద్ధంగా ఎవరైనా భూములను క్రమబద్ధీకరించుకున్నా, అందులో నిర్మాణాలు చేపట్టినా.. వారి పూర్తి వివరాలను పొందుపరుస్తూ ప్రభుత్వాలకు వినతిపత్రాలు సమర్పించాలని పిటిషనర్లకు హైకోర్టుకు స్పష్టం చేసింది. పిటిషనర్లు ఇచ్చే వినతిపత్రాలను పరిశీలించి, తగిన చర్యలు తీసుకోవాలని ఇరు రాష్ట్రాల ప్రభుత్వాలను ఆదేశించింది. ఈ మేరకు హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దిలీప్ బి.బొసాలే, న్యాయమూర్తి జస్టిస్‌ఎస్.వి.భట్‌లతో కూడిన ధర్మాసనం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది.
పేదల భూముల క్రమబద్ధీకరణకు ఉద్దేశించిన జీవో 166ను దుర్వినియోగం చేసి బడా వ్యక్తులు లబ్ధి పొందారని, ఈ జీవోను కేవలం దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న వారికి మాత్రమే వర్తింపజేసేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలంటూ సీపీఎం హైదరాబాద్ జిల్లా కమిటీ ప్రతినిధులు పి.ఎస్.ఎన్.మూర్తి, ఎం.శ్రీనివాస్‌లు 2013లో హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యాన్ని విచారించిన అప్పటి ధర్మాసనం, జీవో 166పై స్టే విధిస్తూ కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. అనంతరం ఈ వ్యాజ్యాన్ని ధర్మాసనం గురువారం మరోసారి విచారించింది.
ఈ సందర్భంగా పిటిషనర్ల తరఫు న్యాయవాది పొత్తూరి సురేష్‌కుమార్ వాదనలు వినిపిం చారు. జీవో 166 ప్రకారం ఉచితంగా 80 గజాల స్థలాన్ని, మార్కెట్ విలువ ఆధారంగా గరిష్టంగా 2 వేల చదరపు గజాల స్థలాన్ని క్రమబద్ధీకరిస్తారని తెలిపారు. ఈ జీవోను అడ్డంపెట్టుకుని కొందరు విలువైన భూములను నిబంధనలకు విరుద్ధంగా క్రమబద్దీకరించుకున్నారని, వాటిపై చర్యలకు ఆదేశాలు జారీ చేయాలని కోరారు. ధర్మాసనం ఇరు రాష్ట్ర ప్రభుత్వాల వివరణ కోరింది.
జీవో 166ను అమలు చేయడం లేదని ఇరు రాష్ట్రాల ఏజీలు చెప్పారు. ఇదే సమయంలో భూముల క్రమబద్ధీకరణ కోసం హైకోర్టును ఆశ్రయించిన వారు, తెలంగాణ ప్రభుత్వం ఇటీవల జారీ చేసిన జీవోలు 58, 59 ప్రకారం క్రమబద్దీకరణ కోసం ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకోవచ్చంటూ ఆ వ్యాజ్యాలను కూడా పరిష్కరించింది.
జీవో 166ను అమలు చేయడం లేదు
Published Fri, Sep 11 2015 1:58 AM | Last Updated on Fri, Aug 31 2018 8:24 PM
Advertisement