go 166
-
ఆక్రమిత ప్రభుత్వ స్థలాల క్రమబద్ధీకరణకు ఓకే!
సాక్షి, హైదరాబాద్: సుదీర్ఘ నిరీక్షణకు తెరపడింది. 2013 నుంచి పెండింగ్‌లో ఉన్న జీవో నం.166 ప్రకారం వచ్చిన దరఖాస్తుల క్లియరెన్స్‌కు ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. దీంతో ఆరేళ్లుగా స్థలాల క్రమబద్ధీకరణ కోసం ఎదురుచూస్తున్న దరఖాస్తుదారులకు ఊరట కలగనుంది. కోర్టు కేసు నేపథ్యంలో పక్కనపెట్టిన ఈ దరఖాస్తులను పరిశీలించేందుకు రాష్ట్ర ప్రభుత్వం గతేడాది 179 జీవోను జారీ చేసిన సంగతి తెలిసిందే. కాగా, వరుస ఎన్నికలతో రెవెన్యూ యంత్రాంగం బిజీగా ఉండటంతో ఇన్నాళ్లు పెండింగ్‌లో పెట్టిన దరఖాస్తులను తక్షణమే పరిష్కరించాలని ఆదేశిస్తూ రాష్ట్ర ప్రభుత్వం తాజాగా సర్క్యులర్ జారీ చేసింది. ఆక్రమిత ప్రభుత్వ స్థలాలను క్రమబద్ధీకరించుకునేందుకు 2008లో అప్పటి ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి 166 జీవోను విడుదల చేశారు. అయితే, క్రమబద్ధీకరణ ముసుగులో అక్రమార్కులకు స్థలాలను కారుచౌకగా కట్టబెడుతున్నారని పౌరసంఘాలు కొన్ని న్యాయస్థానాన్ని ఆశ్రయించడంతో 2013లో జీవో అమలుపై ‘స్టే’విధించింది. అప్పటి నుంచి యథాతథా స్థితిని కొనసాగించిన న్యాయస్థానం.. నిర్దేశిత రుసుం చెల్లించినవారికి/అర్హమైనవిగా తేల్చిన వాటిని క్రమబద్ధీకరించుకునేందుకు వెసులుబాటు కల్పించింది. పెండింగ్.. పెండింగ్! ఇటు 166 జీవో వ్యవహారం కోర్టులో నడుస్తుండగానే రాష్ట్ర ప్రభుత్వం స్థలాల క్రమబద్ధీకరణకు మరో జీవోను విడుదల చేసింది. 2014లో కొలువుదీరిన కేసీఆర్ సర్కార్.. నివాసాలున్న ప్రభుత్వ స్థలాలను రెగ్యులరైజ్ చేయించుకునేందుకు అవకాశం కల్పిస్తూ జీవో 58, 59లు జారీ చేసింది. మార్గదర్శకాలకు అనుగుణంగా ఉన్న దరఖాస్తులను ప్రభుత్వం పరిష్కరించింది. ఈ క్రమంలోనే 166 కింద పెండింగ్‌లో ఉన్నవాటికి కూడా మోక్షం కలిగించాలని దరఖాస్తుదారులు చేసిన విజ్ఞప్తికి సానుకూలంగా స్పందించిన సర్కార్ 179 జీవోను విడుదల చేసింది. జీవో 59 నిబంధనలకు లోబడి పెండింగ్‌లో ఉన్న 166 జీవో దరఖాస్తులను పరిశీలించాలని నిర్దేశించింది. అయితే, ఎన్నికల విధుల్లో బిజీగా ఉన్న నేపథ్యంలో రెవెన్యూ యంత్రాంగం వీటికి జోలికి వెళ్లలేదు. ఈ జీవో కింద రాష్ట్రవ్యాప్తంగా 2,584 దరఖాస్తులు పెండింగ్‌లో ఉండగా.. ఇందులో ఇప్పటివరకు కేవలం 45 దరఖాస్తులు మాత్రమే అప్లోడ్ చేసి చేతులు దులుపుకున్నారు. ఇందులో 40 రంగారెడ్డి జిల్లావే కావడం విశేషం. వీటిలోను కేవలం 19 దరఖాస్తులను మాత్రమే అప్డేట్ చేయడం గమనార్హం. వాస్తవానికి దరఖాస్తుదారులు.. స్థలాల క్రమబద్ధీకరణకు కీలకమైన ధ్రువపత్రాలను పోర్టల్‌లో నమోదు చేయాల్సి ఉంటుంది. ఇప్పటివరకు పోర్టల్ సమాచారం కూడా జిల్లాల అధికారులకు పంపకపోవడంతో వీటి పరిస్థితేంటో తెలియకుండా పోయింది. కాగా, తాజాగా భూ పరిపాలన ప్రధాన కమిషనర్.. జీవో 166 దరఖాస్తులను 179 జీవో మార్గదర్శకాలకు అనుగుణంగా క్లియర్ చేయమని ఆదేశిస్తూ కలెక్టర్లకు లేఖ రాశారు. అయితే, ల్యాండ్ రెవెన్యూ మేనేజ్మెంట్ సిస్టమ్ (ఎల్ఆర్ఎంస్) పోర్టల్‌లో అప్డేట్ చేసినవి కేవలం 19 దరఖాస్తులే కావడంతో.. వీటికే మోక్షం లభిస్తుందా? తహసీల్దార్లు, ఆర్డీవో, కలెక్టరేట్లలో పెండింగ్‌లో ఉన్నవాటిని కూడా పరిగణనలోకి తీసుకుంటారా అనేది తేలాల్సి ఉంది. -
జీవో 166ను అమలు చేయడం లేదు
సాక్షి, హైదరాబాద్: అవిభాజ్య ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2008లో జారీ చేసిన జీవో 166ను అమలు చేయడం లేదని ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు హైకోర్టుకు నివేదించాయి. ఏళ్ల తరబడి ప్రభుత్వ భూముల్లో నివాసం ఉంటున్న పేదల పేరు మీద ఆ భూములను క్రమబద్ధీకరించే ఉద్దేశంతో అప్పట్లో ఈ జీవోను విడుదల చేశారు. జీవో అమలు చేయడం లేదంటూ ఇరు రాష్ట్రాల అడ్వొకేట్ జనరళ్లు చేసిన ఈ ప్రకటనను నమోదు చేసుకున్న హైకోర్టు ధర్మాసనం, జీవో 166కు సంబంధించిన ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని పరిష్కరిస్తున్నట్లు పేర్కొంది. ఈ జీవోను అడ్డం పెట్టుకొని నిబంధనలకు విరుద్ధంగా ఎవరైనా భూములను క్రమబద్ధీకరించుకున్నా, అందులో నిర్మాణాలు చేపట్టినా.. వారి పూర్తి వివరాలను పొందుపరుస్తూ ప్రభుత్వాలకు వినతిపత్రాలు సమర్పించాలని పిటిషనర్లకు హైకోర్టుకు స్పష్టం చేసింది. పిటిషనర్లు ఇచ్చే వినతిపత్రాలను పరిశీలించి, తగిన చర్యలు తీసుకోవాలని ఇరు రాష్ట్రాల ప్రభుత్వాలను ఆదేశించింది. ఈ మేరకు హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దిలీప్ బి.బొసాలే, న్యాయమూర్తి జస్టిస్ఎస్.వి.భట్‌లతో కూడిన ధర్మాసనం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. పేదల భూముల క్రమబద్ధీకరణకు ఉద్దేశించిన జీవో 166ను దుర్వినియోగం చేసి బడా వ్యక్తులు లబ్ధి పొందారని, ఈ జీవోను కేవలం దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న వారికి మాత్రమే వర్తింపజేసేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలంటూ సీపీఎం హైదరాబాద్ జిల్లా కమిటీ ప్రతినిధులు పి.ఎస్.ఎన్.మూర్తి, ఎం.శ్రీనివాస్‌లు 2013లో హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యాన్ని విచారించిన అప్పటి ధర్మాసనం, జీవో 166పై స్టే విధిస్తూ కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. అనంతరం ఈ వ్యాజ్యాన్ని ధర్మాసనం గురువారం మరోసారి విచారించింది. ఈ సందర్భంగా పిటిషనర్ల తరఫు న్యాయవాది పొత్తూరి సురేష్‌కుమార్ వాదనలు వినిపిం చారు. జీవో 166 ప్రకారం ఉచితంగా 80 గజాల స్థలాన్ని, మార్కెట్ విలువ ఆధారంగా గరిష్టంగా 2 వేల చదరపు గజాల స్థలాన్ని క్రమబద్ధీకరిస్తారని తెలిపారు. ఈ జీవోను అడ్డంపెట్టుకుని కొందరు విలువైన భూములను నిబంధనలకు విరుద్ధంగా క్రమబద్దీకరించుకున్నారని, వాటిపై చర్యలకు ఆదేశాలు జారీ చేయాలని కోరారు. ధర్మాసనం ఇరు రాష్ట్ర ప్రభుత్వాల వివరణ కోరింది. జీవో 166ను అమలు చేయడం లేదని ఇరు రాష్ట్రాల ఏజీలు చెప్పారు. ఇదే సమయంలో భూముల క్రమబద్ధీకరణ కోసం హైకోర్టును ఆశ్రయించిన వారు, తెలంగాణ ప్రభుత్వం ఇటీవల జారీ చేసిన జీవోలు 58, 59 ప్రకారం క్రమబద్దీకరణ కోసం ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకోవచ్చంటూ ఆ వ్యాజ్యాలను కూడా పరిష్కరించింది. -
జీవో 166ను సవరించాలి: రాఘవులు
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ భూముల ను క్రమబద్ధీకరించి పేదలకు లబ్ధిచేకూర్చేందుకు ఉద్దేశించిన జీవో166 దుర్వినియోగం అవుతున్నందున రద్దుచేయడం లేదా సవరించాలని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డిని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి బీవీ రాఘవులు కోరారు. దీర్ఘకాలంగా ఆక్రమణలో ఉన ్న స్థలాల్లో బలహీనవర్గాలు, మురికివాడల ప్రజల కోసం ఉద్దేశించిన ఆ జీవో కబ్జాదారులకు తోడ్పడిందని పేర్కొన్నారు. ఈ మేరకు శనివారం సీఎంకు లేఖరాశారు. బలహీనవర్గాలకు మేలు కంటే విలువైన భూముల కబ్జాకే ఆ జీవో సహాయపడుతోందని తెలిపారు. ఈ జీవోలోని కొన్ని నిబంధనలను ఉపయోగించుకొని పలువురు పెద్ద ఎత్తున స్థలాలు క్రమబద్ధీకరించుకున్నారని ఆరోపించారు.