ఆరోగ్యానికి కరచాలనమే కొలమానం
లండన్: దృఢంగా కరచాలనం చేసేవారు మానసికంగా దృఢంగా ఉంటారని ఇంతకాలం మానసిక వైద్యులు భావిస్తూ వచ్చారు. వారు మానసికంగానే కాకుండా ఆరోగ్యంగా కూడా దృఢంగా ఉంటారని వియన్నా యూనివర్శిటీ పరిశోధకులు చేసిన తాజా అధ్యయనంలో తేలింది. వైద్యులు ఇక రోగి తమ వద్దకు రాగానే బీపీ చూసి ఆయన లేక ఆమె ఆరోగ్యం ఎలా ఉందో అంచనా వేయాల్సిన అవసరం లేకుండా రోగితో కరచాలనం చేసి రోగి ఆరోగ్యం ఎలా ఉందో తెలుసుకోవచ్చని పరిశోధనల్లో పొల్గొన్న నడియా స్టీబర్ తెలిపారు.
కొందరు కరచాలనం చేస్తే దూదిని పట్టుకున్నట్టు మెత్తగా ఉండడం, కొందరు చేసి చేయనట్లు మృదువుగా ఉండడం తెల్సిందే. కరచాలనం ద్వారా ఎవరి ఆరోగ్యానైనా అంచనా వేయాలంటే కరచాలనం ద్వారా వారి చేతి గ్రిప్పును పరిశీలించాలి. గ్రిప్పు బలంగా ఉన్నవారు ఎక్కువ కాలం జీవిస్తారు. తక్కువ గ్రిప్పు కలిగిన వారు ఎక్కువ గ్రిప్పు కలిగినవారికన్నా 70 శాతం ముందుగా చనిపోతారని పరిశోధకుల అధ్యయనంలో తేలింది. కరచాలనం చేసే వారి గ్రిప్పుకు వారి వయస్సుకు, ఎత్తుకు కూడా సంబంధం ఉంటుంది.
30 నుంచి 40 ఏళ్ల వయస్సులో కరచాలనం చేసేవారిలో గ్రిప్ప్ పీక్ స్థాయిలో ఉంటుంది. ఆ తర్వాత వయస్సు, ఆరోగ్య పరిస్థితిబట్టి గ్రిప్పు తగ్గుతూ 60 ఏళ్ల తర్వాత ఎక్కువ తగ్గుతుంది. ఎత్తు ఎక్కువ ఉన్నవారికి గ్రిప్పు ఎక్కువగా ఉంటుంది. పురుషులు, మహిళల మధ్య కూడా కరచాలనం గ్రిప్పులో తేడా ఉంటుంది. ఎనిమిది అంగుళాలు ఎత్తు ఎక్కువ ఉన్నవారికి, తక్కువున్న అంతే వయస్సు గల వారిమధ్య కరచాలనం గ్రిప్పులో 20 ఏళ్ల తేడా కనిపిస్తుంది. మొత్తంగా చేతి కండరాల్లో ఉండే బలం ఆ వ్యక్తి ఆరోగ్యం మొత్తంగా ఎలా ఉందనే విషయాన్ని కచ్చితంగా సూచిస్తోందని పరిశోధకులు తేల్చారు.
జర్మనీకి చెందిన వివిధ వయస్సులుగల స్త్రీ, పురుషులను ఎంపిక చేసి వియన్నా యూనివర్శిటీ పరిశోధకులు కరచాలనంకు, వారి ఆరోగ్యంగా పరిస్థితిగల సంబంధాన్ని అధ్యయనం చేశారు. ఈ ప్రయోగానికి జర్మన్లనే ఎంపిక చేసుకోవడానికి కారణం కూడా ఉంది. బ్రిటన్లకంటే జర్మన్ల కరచాలనం బలంగా ఉంటుంది. జపాన్ వారికంటే బ్రిటన్ల కరచాలనం బలంగా ఉంటుందనుకోండి. వయస్సు, ఎత్తు కారణంగా ఎవరి కరచాలనం ఎంత దృడంగా ఉండాలో టేబుళ్లను రూపొందించినట్లు ‘పోస్ వన్ జర్నల్’లో పరిశోధకులు తెలియజేశారు.