హెచ్‌డీఎఫ్‌సీ లాభం 10 శాతం వృద్ధి | HDFC: Flexibility in sourcing funds aids margins | Sakshi
Sakshi News home page

హెచ్‌డీఎఫ్‌సీ లాభం 10 శాతం వృద్ధి

Published Tue, Oct 22 2013 12:17 AM | Last Updated on Fri, Sep 1 2017 11:50 PM

HDFC: Flexibility in sourcing funds aids margins

 ముంబై: దేశీ బ్లూచిప్ కంపెనీల్లో ఒకటైన హెచ్‌డీఎఫ్‌సీ... ఈ ఏడాది సెప్టెంబర్‌తో ముగిసిన రెండో త్రైమాసికం(2013-14, క్యూ2)లో రూ.1,266 కోట్ల నికర లాభాన్ని(స్టాండెలోన్) ఆర్జించింది. క్రితం ఏడాది ఇదే కాలంలో రూ.1,151 కోట్ల లాభంతో పోలిస్తే 10.27 శాతం వృద్ధిని నమోదు చేసింది. మొత్తం ఆదాయం కూడా 12.8 శాతం వృద్ధితో రూ. 5,269 కోట్ల నుంచి రూ.5,946 కోట్లకు పెరిగింది. ఇక క్యూ2లో నికర వడ్డీ ఆదాయం(ఎన్‌ఐఐ) 11 శాతం పెరిగి రూ.1,814 కోట్లకు చేరింది. తమ అనుబంధ కంపెనీ హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ నుంచి డివిడెండ్ రాబడి రెండో త్రైమాసికానికి బదులు తొలి త్రైమాసికంలోనే వస్తుండటంతో సెప్టెంబర్ క్వార్టర్‌లో లాభాల వృద్ధి తగ్గుముఖం పట్టడానికి కారణమైందని హెచ్‌డీఎఫ్‌సీ వైస్ చైర్మన్, సీఈఓ కేకీ మిస్త్రీ వెల్లడించారు.
 
 కంపెనీ మొత్తం రుణాల విలువ సెప్టెంబర్ చివరినాటికి రూ. 2,12,071 కోట్లకు ఎగబాకింది. క్రితం క్యూ2తో పోలిస్తే 19 శాతం వృద్ధి చెందింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 18-20 శాతం రుణ వృద్ధిని సాధించగలమని మిస్త్రీ విశ్వాసం వ్యక్తం చేశారు. కాగా, ఈ క్యూ2లో నికర వడ్డీ మార్జిన్(ఎన్‌ఐఎం) స్వల్పంగా తగ్గి 4.1 శాతంగా నమోదైంది. క్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో ఎన్‌ఐఎం 4.2%. ఇక స్థూల నిరర్ధక ఆస్తులు(మొండిబకాయిలు) క్యూ2లో 0.77 శాతం నుంచి 0.79 శాతానికి పెరిగాయి. కాగా, సంస్థ నాన్ ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మన్ కేశుబ్ మహీంద్రా, స్వతంత్ర డెరైక్టర్ శిరీష్ బి.పాటిల్‌లు తమ పదవులకు రాజీనామా చేశారని, తక్షణం ఇవి అమల్లోకి వచ్చినట్లు హెచ్‌డీఎఫ్‌సీ వెల్లడించింది. వీరిద్దరూ సంస్థ ఆరంభం నుంచీ డెరైక్టర్ల బోర్డులో కొనసాగుతూ వస్తున్నారు.
 

Advertisement
Advertisement