‘కేబినెట్’ హోదా ఎలా ఇచ్చారు?
- రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ప్రశ్న
- కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు, హోదా పొందిన వారికి నోటీసులు
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ సలహాదారులు, ప్రభుత్వరంగ సంస్థలకు నామినేట్ సభ్యులుగా నియమించే వారికి ఏ నిబంధన ప్రకారం కేబినెట్ హోదా కల్పించారని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది. అడ్వకేట్ జనరల్ రామకృష్ణారెడ్డి సమాధానమిస్తూ దీనికి సంబంధించిన నిబంధనల్లో స్పష్టత లేదని కోర్టుకు నివేదించారు. అయితే హోదా కల్పించడం సంప్రదాయంగా వస్తోందన్నారు. పలువురికి రాష్ట్ర æప్రభు త్వం కేబినెట్ హోదా కల్పించడాన్ని సవాలు చేస్తూ టీడీపీ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌ను తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రమేశ్ రంగనాథన్, జస్టిస్ షమీమ్ అక్తర్‌లతో కూడిన ధర్మాస నం మంగళ వారం విచారించింది.
కేబినెట్ హోదాలో రకాలు, కలిగే ప్రయోజనాలు సహా అన్ని వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ధర్మాసనం ఆదేశించింది. హోదా పొందిన ప్రభుత్వ సలహాదారులు విద్యాసాగర్ రావు, ఏకే గోయల్, రామలక్ష్మణ్, బీవీ పాపారావు, కేవీ రమణాచారి, జీఆర్ రెడ్డి, అధికార భాషా సంఘం చైర్మన్ దేవులపల్లి ప్రభాకర్, పర్యాటక శాఖ చైర్మన్ పేర్వారం రాములు, ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధు లు కేఎం సహానీ, వేణుగోపాలాచారి, రామచంద్రు తేజావత్, రాష్ట్ర ప్రణాళిక బోర్డు వైస్ చైర్మన్ సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి, ఆర్టీసీ చైర్మన్ ఎస్.సత్యనారాయణ, ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ పిడమర్తి రవి, జి.వివేకానంద, వి.ప్రశాంత్‌రెడ్డి, కొప్పుల ఈశ్వర్‌లకూ నోటీసులు జారీ చేసింది.