government Advisors
-
ప్రభుత్వ సలహాదారుల నియామకాలు రద్దు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో గత ప్రభుత్వ హయాంలో నియమితులైన ప్రభుత్వ సలహాదారుల నియామకాలను రద్దు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) శాంతికుమారి ఉత్తర్వులు జారీ చేశారు. గత ప్రభుత్వంలో ఏడుగురు అధికారులను సలహా దారులుగా నియమించగా, నియమితులైన సోమేశ్‌కుమార్, చెన్నమనేని రమేష్, రాజీవ్ శర్మ, అనురాగ్ శర్మ, ఏకే ఖాన్, జీఆర్ రెడ్డి, ఆర్.శోభ నియామకాలను ప్రభుత్వం రద్దు చేసింది. ఇదీ చదవండి: మహాలక్ష్మీ పథకం ప్రారంభం.. మహిళలకు ఉచిత ప్రయాణం -
Andhra Pradesh: సలహాదారులపై నిర్దిష్ట విధానం
సాక్షి, అమరావతి: సలహాదారుల నియామకాల విషయంలో నిర్దిష్ట విధానాన్ని రూపొందించాలని నిర్ణయించినట్లు రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు నివేదించింది. ఇకపై సలహాదారులుగా, ప్రత్యేక సలహాదారులుగా నియమితులయ్యే వారు ఆయా మంత్రిత్వ శాఖలకు సలహాదారులుగా వ్యవహరిస్తారని తెలిపింది. ఆయా సబ్జెక్టుల్లో వారి నైపుణ్యాలను బట్టి నియామకాలు ఉంటాయని పేర్కొంది. తమకు సలహాదారు కావాలని ఎవరైనా మంత్రి భావిస్తే అదే అంశాన్ని లిఖితపూర్వకంగా ముఖ్యమంత్రికి తెలియచేసి ఆమోదం పొందనున్నట్లు హైకోర్టుకు వెల్లడించింది. సలహాదారుల కాల వ్యవధి రెండేళ్ల వరకు ఉంటుంది. తరువాత అవసరాన్ని బట్టి పొడిగింపు మరో రెండేళ్లు ఉంటుంది. నిర్దిష్ట విధానాన్ని మంత్రిమండలి ఆమోదం కోసం పంపి త్వరలోనే దీనికి సంబంధించిన జీవో జారీ కానుందని హైకోర్టు దృష్టికి తెచ్చింది. నియామకాలపై వ్యాజ్యాలు... దేవదాయశాఖ సలహాదారుగా జ్వాలాపురపు శ్రీకాంత్, ఉద్యోగ వ్యవహారాల సలహాదారుగా చంద్రశేఖర్‌రెడ్డి నియామకాన్ని సవాలు చేస్తూ హైకోర్టులో వేర్వేరుగా ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు దాఖలైన విషయం తెలిసిందే. వీటిపై విచారణ జరుపుతున్న ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ ప్రశాంత్‌కుమార్ మిశ్రా ధర్మాసనం పలు ప్రశ్నలు లేవనెత్తిన నేపథ్యంలో సలహాదారుల నియామకాలపై రాష్ట్ర ప్రభుత్వం మార్గదర్శకాలను రూపొందించింది. సాధారణ పరిపాలన శాఖ (జీఏడీ) ముఖ్య కార్యదర్శి రేవు ముత్యాలరాజు వీటిని అదనపు అఫిడవిట్ రూపంలో హైకోర్టు ముందుంచారు. దీన్ని పరిగణలోకి తీసుకుని తగిన ఉత్తర్వులు జారీ చేయాలని ధర్మాసనాన్ని అభ్యర్థించారు. అదనపు అఫిడవిట్లో ముఖ్యాంశాలు.. ► సలహాదారుల వివరాలను సమగ్రంగా పరిశీలించిన తరువాతే నియామకం. ► సలహాదారు పాత్ర, బాధ్యతలను స్పష్టంగా నిర్దేశించాలి. ► ఆయా మంత్రిత్వ శాఖల అవసరాన్ని బట్టి సలహాదారుల నియామకం ఉంటుంది. నిర్దిష్ట అవసరాలకే నియామకం ఉండేలా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ► అవసరం, ఆవశ్యకతతో పాటు సలహాదారుగా నియమించే వ్యక్తి అర్హతలపై నిర్దిష్ట కాల పరిమితితో సమీక్ష చేయాలి. ► సలహాదారు అన్నది పోస్టు కాదు. దానిని ఓ కార్యాలయంగా భావిస్తారు. సలహాదారు నిర్వర్తించేది పబ్లిక్ డ్యూటీ. అందువల్ల అవినీతి నిరోధక చట్టం కింద సలహాదారు పబ్లిక్ సర్వెంట్ నిర్వచన పరిధిలోకి వస్తారు. ► సలహాదారుగా నియమితులయ్యే ప్రతి వ్యక్తి ఓ అఫిడవిట్‌పై సంతకం చేయాల్సి ఉంటుంది. ► గోప్యతను పాటిస్తూ ప్రభుత్వ రహస్యాలను వెల్లడించబోనని అందులో సంతకం చేయాలి. ► గోప్యత పాటించే విషయంలో సలహాదారు బాధ్యతలు ఏమిటో ఆ అఫిడవిట్లో స్పష్టంగా పేర్కొనాలి. ► రహస్య సమాచారం అంటే ఏమిటి? ఏ సమాచారం దీని కిందకు వస్తుంది? దానిని గోప్యంగా ఉంచడంలో సలహాదారు బాధ్యత ఏమిటి? ఏ సమాచారం రహస్య సమాచారం కిందకు రాదు.. తదితర వివరాలు అందులో పొందుపరచాలి. ► మంత్రులు తీసుకునే విధానపరమైన నిర్ణయాల వరకే సలహాదారు పాత్ర పరిమితం అవుతుంది. రోజూవారీ నిర్ణయాల్లో వారికి ఎలాంటి పాత్ర ఉండరాదు. ► కన్సల్టెంట్ల విషయానికొస్తే గతంలో మాదిరిగా కాంట్రాక్ట్ పద్ధతిలో కన్సల్టెంట్స్, కన్సల్టింగ్ ఏజెన్సీల ద్వారా నియమించుకోవచ్చు. ► ప్రస్తుతం సలహాదారులుగా ఉన్న వారిని సబ్జెక్టుల వారీగా ఆయా మంత్రిత్వ శాఖలకు సలహాదారులుగా, ప్రత్యేక సలహాదారులుగా మారుస్తారు. ► ఇప్పటివరకు తమ పాత్ర, బాధ్యతలు స్పష్టంగా నిర్దేశించని సలహాదారులకు సంబంధించి ప్రభుత్వం వాటిని రూపొందిస్తుంది. ► ముఖ్యమంత్రికి సలహాదారులుగా వ్యవహరించే వారికి సైతం పైన పేర్కొన్న నియమ, నిబంధనలే వర్తిస్తాయి. -
సలహాదారులుగా ఎవరిని నియమించాలో ప్రభుత్వ ఇష్టం
సాక్షి, అమరావతి: సలహాదారులుగా ఎవరిని నియమించుకోవాలన్నది పూర్తిగా ప్రభుత్వ ఇష్టమని హైకోర్టు స్పష్టం చేసింది. ఇందులో ఇతరుల జోక్యానికి తావు లేదంది. సలహాదారును మీరు ఎంచుకోలేరని పిటిషనర్‌కు తేల్చి చెప్పింది. ప్రభుత్వ సలహాదారు (ఉద్యోగుల సంక్షేమం)గా ఎన్.చంద్రశేఖర్‌రెడ్డి నియామక ఉత్తర్వుల అమలును నిలిపివేసేందుకు హైకోర్టు నిరాకరించింది. చంద్రశేఖర్‌రెడ్డి నియామకంపై పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. అందులో భాగంగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, సాధారణ పరిపాలన శాఖ (జీఏడీ) ముఖ్య కార్యదర్శితో పాటు చంద్రశేఖర్‌రెడ్డికి నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను జనవరి 23కి వాయిదా వేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా, న్యాయమూర్తి జస్టిస్ డీవీఎస్ఎస్ సోమయాజులు ధర్మాసనం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది.ప్రభుత్వ సలహాదారుగా చంద్రశేఖర్‌రెడ్డిని నియమిస్తూ ప్రభుత్వం గత ఏడాది జారీ చేసిన ఉత్తర్వులను సవాలు చేస్తూ వైఎస్సార్ కడప జిల్లాకు చెందిన విశ్రాంత ఉద్యోగి ఎస్.మునయ్య దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్)పై సీజే ధర్మాసనం మంగళవారం విచారణ జరిపింది. పిటిషనర్ తరఫు న్యాయవాది పీవీజీ ఉమేశ్ వాదనలు వినిపిస్తూ.. ప్రభుత్వ ఉద్యోగిగా పనిచేసిన చంద్రశేఖర్‌రెడ్డిని ఉద్యోగుల సంక్షేమం విషయంలో సలహాదారుగా ప్రభుత్వం నియమించిందని తెలిపారు. ఉద్యోగులతో సమన్వయం చేయడం ఆయన బాధ్యత అని చెప్పారు. వాస్తవానికి ఉద్యోగుల సంక్షేమం కోసం ప్రస్తుతం కొన్ని వ్యవస్థలు పనిచేస్తున్నాయని, సలహాదారును నియమించాల్సిన అవసరం లేదని తెలిపారు. ఈ సమయంలో ధర్మాసనం జోక్యం చేసుకుంటూ.. సలహాదారుగా ఎవరిని నియమించాలన్నది ప్రభుత్వ ఇష్టమని తెలిపింది. ఇందులో జోక్యం చేసుకునే హక్కు ఇతరులకు లేదంది. చంద్రశేఖర్‌రెడ్డి నియామక ఉత్తర్వులపై స్టే ఇవ్వాలన్న ఉమేశ్ అభ్యర్థనను కూడా ధర్మాసనం తిరస్కరించింది. -
‘కేబినెట్’ హోదా ఎలా ఇచ్చారు?
- రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ప్రశ్న - కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు, హోదా పొందిన వారికి నోటీసులు సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ సలహాదారులు, ప్రభుత్వరంగ సంస్థలకు నామినేట్ సభ్యులుగా నియమించే వారికి ఏ నిబంధన ప్రకారం కేబినెట్ హోదా కల్పించారని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది. అడ్వకేట్ జనరల్ రామకృష్ణారెడ్డి సమాధానమిస్తూ దీనికి సంబంధించిన నిబంధనల్లో స్పష్టత లేదని కోర్టుకు నివేదించారు. అయితే హోదా కల్పించడం సంప్రదాయంగా వస్తోందన్నారు. పలువురికి రాష్ట్ర æప్రభు త్వం కేబినెట్ హోదా కల్పించడాన్ని సవాలు చేస్తూ టీడీపీ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌ను తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రమేశ్ రంగనాథన్, జస్టిస్ షమీమ్ అక్తర్‌లతో కూడిన ధర్మాస నం మంగళ వారం విచారించింది. కేబినెట్ హోదాలో రకాలు, కలిగే ప్రయోజనాలు సహా అన్ని వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ధర్మాసనం ఆదేశించింది. హోదా పొందిన ప్రభుత్వ సలహాదారులు విద్యాసాగర్ రావు, ఏకే గోయల్, రామలక్ష్మణ్, బీవీ పాపారావు, కేవీ రమణాచారి, జీఆర్ రెడ్డి, అధికార భాషా సంఘం చైర్మన్ దేవులపల్లి ప్రభాకర్, పర్యాటక శాఖ చైర్మన్ పేర్వారం రాములు, ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధు లు కేఎం సహానీ, వేణుగోపాలాచారి, రామచంద్రు తేజావత్, రాష్ట్ర ప్రణాళిక బోర్డు వైస్ చైర్మన్ సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి, ఆర్టీసీ చైర్మన్ ఎస్.సత్యనారాయణ, ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ పిడమర్తి రవి, జి.వివేకానంద, వి.ప్రశాంత్‌రెడ్డి, కొప్పుల ఈశ్వర్లకూ నోటీసులు జారీ చేసింది.