సాక్షి, అమరావతి: సలహాదారుల నియామకాల విషయంలో నిర్దిష్ట విధానాన్ని రూపొందించాలని నిర్ణయించినట్లు రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు నివేదించింది. ఇకపై సలహాదారులుగా, ప్రత్యేక సలహాదారులుగా నియమితులయ్యే వారు ఆయా మంత్రిత్వ శాఖలకు సలహాదారులుగా వ్యవహరిస్తారని తెలిపింది. ఆయా సబ్జెక్టుల్లో వారి నైపుణ్యాలను బట్టి నియామకాలు ఉంటాయని పేర్కొంది.
తమకు సలహాదారు కావాలని ఎవరైనా మంత్రి భావిస్తే అదే అంశాన్ని లిఖితపూర్వకంగా ముఖ్యమంత్రికి తెలియచేసి ఆమోదం పొందనున్నట్లు హైకోర్టుకు వెల్లడించింది. సలహాదారుల కాల వ్యవధి రెండేళ్ల వరకు ఉంటుంది. తరువాత అవసరాన్ని బట్టి పొడిగింపు మరో రెండేళ్లు ఉంటుంది. నిర్దిష్ట విధానాన్ని మంత్రిమండలి ఆమోదం కోసం పంపి త్వరలోనే దీనికి సంబంధించిన జీవో జారీ కానుందని హైకోర్టు దృష్టికి తెచ్చింది.
నియామకాలపై వ్యాజ్యాలు...
దేవదాయశాఖ సలహాదారుగా జ్వాలాపురపు శ్రీకాంత్, ఉద్యోగ వ్యవహారాల సలహాదారుగా చంద్రశేఖర్‌రెడ్డి నియామకాన్ని సవాలు చేస్తూ హైకోర్టులో వేర్వేరుగా ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు దాఖలైన విషయం తెలిసిందే.
వీటిపై విచారణ జరుపుతున్న ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ ప్రశాంత్‌కుమార్ మిశ్రా ధర్మాసనం పలు ప్రశ్నలు లేవనెత్తిన నేపథ్యంలో సలహాదారుల నియామకాలపై రాష్ట్ర ప్రభుత్వం మార్గదర్శకాలను రూపొందించింది.
సాధారణ పరిపాలన శాఖ (జీఏడీ) ముఖ్య కార్యదర్శి రేవు ముత్యాలరాజు వీటిని అదనపు అఫిడవిట్ రూపంలో హైకోర్టు ముందుంచారు. దీన్ని పరిగణలోకి తీసుకుని తగిన ఉత్తర్వులు జారీ చేయాలని ధర్మాసనాన్ని అభ్యర్థించారు.
అదనపు అఫిడవిట్‌లో ముఖ్యాంశాలు..
► సలహాదారుల వివరాలను సమగ్రంగా పరిశీలించిన తరువాతే నియామకం.
► సలహాదారు పాత్ర, బాధ్యతలను స్పష్టంగా నిర్దేశించాలి.
► ఆయా మంత్రిత్వ శాఖల అవసరాన్ని బట్టి సలహాదారుల నియామకం ఉంటుంది. నిర్దిష్ట అవసరాలకే నియామకం ఉండేలా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.
► అవసరం, ఆవశ్యకతతో పాటు సలహాదారుగా నియమించే వ్యక్తి అర్హతలపై నిర్దిష్ట కాల పరిమితితో సమీక్ష చేయాలి.
► సలహాదారు అన్నది పోస్టు కాదు. దానిని ఓ కార్యాలయంగా భావిస్తారు. సలహాదారు నిర్వర్తించేది పబ్లిక్ డ్యూటీ. అందువల్ల అవినీతి నిరోధక చట్టం కింద సలహాదారు పబ్లిక్ సర్వెంట్ నిర్వచన పరిధిలోకి వస్తారు.
► సలహాదారుగా నియమితులయ్యే ప్రతి వ్యక్తి ఓ అఫిడవిట్‌పై సంతకం చేయాల్సి ఉంటుంది.
► గోప్యతను పాటిస్తూ ప్రభుత్వ రహస్యాలను వెల్లడించబోనని అందులో సంతకం చేయాలి.
► గోప్యత పాటించే విషయంలో సలహాదారు బాధ్యతలు ఏమిటో ఆ అఫిడవిట్‌లో స్పష్టంగా పేర్కొనాలి.
► రహస్య సమాచారం అంటే ఏమిటి? ఏ సమాచారం దీని కిందకు వస్తుంది? దానిని గోప్యంగా ఉంచడంలో సలహాదారు బాధ్యత ఏమిటి? ఏ సమాచారం రహస్య సమాచారం కిందకు రాదు.. తదితర వివరాలు అందులో పొందుపరచాలి.
► మంత్రులు తీసుకునే విధానపరమైన నిర్ణయాల వరకే సలహాదారు పాత్ర పరిమితం అవుతుంది. రోజూవారీ నిర్ణయాల్లో వారికి ఎలాంటి పాత్ర ఉండరాదు.
► కన్సల్టెంట్ల విషయానికొస్తే గతంలో మాదిరిగా కాంట్రాక్ట్ పద్ధతిలో కన్సల్టెంట్స్, కన్సల్టింగ్ ఏజెన్సీల ద్వారా నియమించుకోవచ్చు.
► ప్రస్తుతం సలహాదారులుగా ఉన్న వారిని సబ్జెక్టుల వారీగా ఆయా మంత్రిత్వ శాఖలకు సలహాదారులుగా, ప్రత్యేక సలహాదారులుగా మారుస్తారు.
► ఇప్పటివరకు తమ పాత్ర, బాధ్యతలు స్పష్టంగా నిర్దేశించని సలహాదారులకు సంబంధించి ప్రభుత్వం వాటిని రూపొందిస్తుంది.
► ముఖ్యమంత్రికి సలహాదారులుగా వ్యవహరించే వారికి సైతం పైన పేర్కొన్న నియమ, నిబంధనలే వర్తిస్తాయి.
Comments
Please login to add a commentAdd a comment