గృహ రుణం ఉందా? టాప్ అప్ తీసుకోండి..! | home loan? Top-up Home Loan | Sakshi
Sakshi News home page

గృహ రుణం ఉందా? టాప్ అప్ తీసుకోండి..!

Published Sun, May 3 2015 12:46 AM | Last Updated on Sun, Sep 3 2017 1:18 AM

గృహ రుణం ఉందా? టాప్ అప్ తీసుకోండి..!

గృహ రుణం ఉందా? టాప్ అప్ తీసుకోండి..!

వ్యక్తిగత రుణానికిదే చక్కని ప్రత్యామ్నాయం
 మీకు ఇప్పటికే ఒక గృహ రుణం ఉంది. నెలవారీ వాయిదాలు సకాలంలో చక్కగా చెల్లించేస్తున్నారు. అనుకోకుండా కొంత డబ్బు కావాల్సి వచ్చింది. మరేం చేస్తారు? నిజానికి ఇలాంటి సందర్భాల్లో చాలామంది పర్సనల్ లోన్‌పై ఆధారపడతారు. కానీ దానికన్నా గృహ రుణంపై ‘టాప్ అప్’ తీసుకోవటమే ఉత్తమం. దీన్ని నేరుగా మీకు గృహ రుణం ఇచ్చిన  బ్యాంకు నుంచే తీసుకోవచ్చు. మీరు నెలవారీ రుణ బకాయిలు చక్కగా చెల్లిస్తుంటే... అదే ఖాతాకు అనుబంధంగా మీరు మీ రుణ అర్హత మేరకు మరికొంత డబ్బును రుణంగా పొందే వీలుంటుంది. మీరు గృహం రుణం తీసుకున్నప్పటి సమయానికి, ఇప్పటికీ మీ వేతనం మరికొంత పెరిగితే... తాజా ‘టాప్ అప్ రుణానికి’ ఈ అర్హతను సైతం జోడించి మరింత ఎక్కువ రుణాన్ని మంజూరు చేస్తారు కూడా.
 
 అర్హత...

 మొదటి రుణం తీసుకున్న తరువాత 6 నుంచి 12 నెలల వ్యవధి ఉండాలి. దాదాపు అన్ని బ్యాంకులూ ఇదే నిబంధన పాటిస్తున్నాయి. ఇక ‘టాప్ అప్ రుణం’ విషయంలో డాక్యుమెంటేషన్, ప్రాసెసింగ్ ప్రక్రియ అంతా ‘మిగిలిన రుణ మంజూరు’ ప్రక్రియతో పోలిస్తే వేగంగా జరుగుతాయి. అప్పటికే బ్యాంకుతో కస్టమర్‌కు సంబంధాలుండటమే దీనికి ప్రధాన కారణం.
 
 రుణం ఎందుకు..?
 బ్యాంకింగ్ నిబంధనలకు లోబడి  ‘టాప్ అప్ రుణం’ ఎందుకన్న విషయాన్ని సంబంధిత బ్యాంక్ పరిశీలిస్తుంది. మీరు నివసిస్తున్న గృహాన్ని ఆధునీకీకరించుకోవడం, ప్లాట్ లేదా ల్యాండ్ వంటి మరో ఆస్తి కొనుగోలు. వినియోగ వస్తువుల కొనుగోళ్లు, పిల్లల పెళ్లిళ్లు, విద్యా అవసరాలు, వ్యాపార అవసరాలు, వైద్య ఖర్చులు ఇలా దేనికైనా ‘టాప్ అప్ రుణం’ తీసుకునే వీలుంది.
 
 ఐదు ముఖ్యాంశాలు...
 పన్ను ప్రయోజనాలు: గృహ కొనుగోలుకు వినియోగిస్తే, ప్రిన్సిపల్, వడ్డీ రెండూ పన్ను ప్రయోజనం పరిధిలోకి వస్తాయి. అలాకాక ఇంటి సదుపాయాల మెరుగుదలకు వినియోగిస్తే మాత్రం వడ్డీపై మాత్రమే మినహాయింపు లభిస్తుంది. ఇతర అవసరాలకు వాడితే ఎలాంటి పన్ను మినహాయింపులూ ఉండవు.
 
 టాప్ అప్ లోన్ వడ్డీరేటు: గృహ రుణ వడ్డీరేటుకన్నా 1.5% నుంచి 2% అధికంగా ఉంటుంది. అంటే ఈ మొత్తమ్మీద 11.5% నుంచి 14% వరకూ ఉండే అవకాశం ఉంది. వ్యక్తిగత రుణ వడ్డీరేటు 18-24% వరకూ ఉన్న ప్రస్తుత తరుణంలో టాప్ అప్ రుణ రేటు తక్కువగా ఉండడం కలిసొచ్చే అంశం.తనఖా అవసరం లేదు: ఎటువంటి ప్రత్యేక తనఖా అవసరం లేదు. మరో అంశం... మీ తొలి గృహ రుణం తీర్చేసినంతమాత్రాన బ్యాంకు వద్ద ఉన్న ఒరిజినల్ గృహ పత్రాలు మీకు లభించవు. ‘టాప్ అప్ రుణం’ బకాయి కూడా పూర్తిగా చెల్లిస్తేనే పత్రాలు వెనక్కిస్తారు.
 
 రుణ పరిమాణం: తొలి గృహ రుణ పరిమాణం కన్నా మించి టాప్ అప్ రుణం రాదు.  ఉదాహరణకు మీ తొలి గృహ రుణం రూ. 30 లక్షలు అయితే ‘టాప్ అప్ రుణం’ అంతకన్నా ఎక్కువ ఉండే అవకాశం లేదు. అర్హతను బట్టి రూ.15 నుంచి రూ.40 లక్షల వరకూ ఈ ‘టాప్ అప్ రుణ’ పరిమాణం ఉంటుంది. ప్రాసెసింగ్ ఫీజు: దాదాపు అన్ని బ్యాంకులూ ప్రాసెసింగ్ ఫీజును అమలు చేస్తున్నాయి. వాటి హోమ్ లోన్ ప్రాసెసింగ్ ఫీజు స్థాయిలోనే  టాప్ అప్ రుణం ప్రాసెసింగ్ ఫీజూ ఉంటుంది.

Advertisement
Advertisement