'నాపై 113 మంది అత్యాచారం చేశారు'
పశ్చిమబెంగాల్ నుంచి తీసుకొచ్చి.. ఉద్యోగం ఇప్పిస్తామని చెప్పి, తనపై గత రెండేళ్లుగా దాదాపు 113 మంది అత్యాచారం చేశారంటూ 16 ఏళ్ల బాలిక వాపోతోంది. మహారాష్ట్రలోని పుణె నగరానికి తనను తీసుకొచ్చిన వ్యక్తులు బలవంతంగా వ్యభిచార వృత్తిలోకి దించారని, అక్కడ కొందరు పోలీసులతో సహా 113 మంది తనపై అత్యాచారం చేశారని చెప్పింది. గత నెలలో అక్కడి నుంచి తప్పించుకుని ఢిల్లీ పారిపోయి పోలీసులకు ఫిర్యాదుచేసింది. ఆ కేసును తాజాగా పుణెకు బదిలీ చేసి, 113 మందిపై ఎఫ్ఐఆర్ దాఖలు చేశారు. ఈ కేసులో 26 ఏళ్ల మహిళను పోలీసులు అరెస్టుచేశారు.
ఇటీవలే ఓ మోడల్‌ను ఢిల్లీనుంచి పుణె తీసుకొచ్చి చిత్రహింసలు పెట్టి అత్యాచారయత్నం చేసిన కేసుకు, దీనికి కూడా సంబంధం ఉంది. ఆమె ఈ పాపతోనే కలిసి తప్పించుకుని ఢిల్లీ పారిపోయింది. ఈ కేసులో నలుగురు నిందితులను పోలీసులు అరెస్టుచేశారు. అరెస్టయినవారిలో నేపాల్‌కు చెందిన స్వీకృతి ఖరేల్ (26), రోహిత్ భండారీ (35), హరీష్ షాహా (25), తపేంద్ర సచి (23), రమేష్ ఠకులా (25) ఉన్నారు.
వీళ్లతోపాటు శక్తి, అన్నా, భరత్ తదితరులు కలిసి పుణెలో సెక్స్ రాకెట్ నిర్వహిస్తున్నారు. పశ్చిమబెంగాల్ - నేపాల్ సరిహద్దులోని సిలిగురి ప్రాతానికి చెందిన బాలిక తల్లిని ఆమె తండ్రి వదిలేశాడు. దాంతో ఆమె మతిస్థిమితం కోల్పోయారు. వాళ్ల అమ్మమ్మకు టీ కొట్టు ఉండగా, అక్కడకు భండారీ తరచు వచ్చి సిగరెట్లు కొనుక్కునేవాడు. అప్పుడే ఈ బాలికను చూసి, ఆమెకు ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి 2014 జనవరిలో పుణె తీసుకెళ్లాడు. కొన్నాళ్లు బాగానే ఉన్నా, తర్వాత వ్యభిచారంలోకి దింపాడు. అతడు కూడా ఆమెపై అత్యాచారం చేశాడు. డ్రగ్స్ ఇచ్చి, ఒకేసారి పలువురితో వ్యభిచారం చేయించేవాడు. ఢిల్లీ నుంచి వచ్చిన 24 ఏళ్ల మోడల్‌తో కలిసి తర్వాత ఆమె ఢిల్లీ పారిపోయింది. చివరకు అక్కడ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో మొత్తం విషయం వెలుగులోకి వచ్చింది.