భారత్ ఆరోగ్య రంగం భారీ వృద్ధి! | ‘India’s healthcare sector may grow to $158.2 bn in 2017’ | Sakshi
Sakshi News home page

భారత్ ఆరోగ్య రంగం భారీ వృద్ధి!

Published Wed, Dec 4 2013 2:21 AM | Last Updated on Sat, Sep 2 2017 1:13 AM

భారత్ ఆరోగ్య రంగం భారీ వృద్ధి!

భారత్ ఆరోగ్య రంగం భారీ వృద్ధి!

ముంబై: భారత ఆరోగ్య సంరక్షణా రంగం భారీ వృద్ధి బాటన పయనిస్తోంది. ప్రస్తుతం 79 బిలియన్ డాలర్లు (దాదాపు రూ.4,90,000 కోట్లు)గా ఉన్న ఈ రంగం విలువ, 2017 నాటికి దాదాపు రెట్టింపై 158 బిలియన్ డాలర్లకు చేరనుంది. బ్రిటన్ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న వెల్త్ మేనేజ్‌మెంట్  సంస్థ ఈక్వెంటీస్ క్యాపిటల్ తన తాజా నివేదికలో ఈ అంశాలను పేర్కొంది. మరిన్ని ముఖ్యాంశాలు...
 
 ఆరోగ్యంపై పెరుగుతున్న తలసరి వ్యయం
 నివేదిక ప్రకారం 2008లో భారత ఆరోగ్య సంరక్షణా విభాగం విలువ 45 బిలియన్ డాలర్లు. అప్పటి నుంచీ 2012 వరకూ ఈ రంగం వార్షికంగా 15 శాతం వృద్ధిని నమోదుచేసుకుని, 79 బిలియన్ డాలర్లకు చేరింది.  భారత తలసరి ఆరోగ్య సంరక్షణా వ్యయం 2008లో 43 డాలర్లు. అటు తర్వాత ఈ వ్యయం వార్షికంగా 10 శాతం వృద్ధితో 2011  నాటికి 60 డాలర్లకు చేరింది. 2015 నాటికి ఈ వ్యయం 89 డాలర్లకు చేరుతుందని అంచనా. పెరుగుతున్న ఆదాయాలు, అధిక నాణ్యత ఆరోగ్య సంరక్షణా సౌకర్యాల పురోభివృద్ధి, ప్రజలకు ఆయా సౌకర్యాల సులభ లభ్యత, ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో సేవల లభ్యత ఇందుకు కారణాలు.
 
 ప్రైవేటు రంగం విస్తరణ
  ఆరోగ్య సేవలను అందజేయడంలో ప్రైవేటు రంగం వాటా 2005లో 66శాతం కాగా, 2015 నాటికి ఈ రేటు 81 శాతానికి విస్తరించనుంది. హాస్పిటల్స్ విషయంలో ప్రైవేటు రంగం వాటా ప్రస్తుతం 74 శాతంగా ఉండగా,  హాస్పిటల్ బెడ్స్ విషయంలో ఈ వాటా 40 శాతంగా ఉంది. . నాణ్యమైన ఆరోగ్యం, స్పెషాలటీ హెల్త్‌కేర్ సేవల డిమాండ్ ద్వితీయ, తృతీ య పట్టణాల నుంచి అధికంగా ఉండడంతో ఆయా పట్టణాలకు ఆరోగ్య సంరక్షణా విభాగం వేగంగా విస్తరిస్తోంది.
 
 ఆరోగ్య బీమాకు ఆదరణ
 భారత్‌లో ఆరోగ్యబీమా రంగం కూడా మంచి పురోగతి సాధిస్తోంది. హెల్త్‌కేర్ బీమా ప్రీమియంలలో 2006-10 మధ్య వార్షికంగా 39 శాతం వృద్ధి నమోదయ్యింది. ఈ రంగం మరింత వృద్ధి సాధించి ఆరోగ్య రక్షణ పరిశ్రమకు ప్రయోజనం చేకూర్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.
 
 దోహదపడుతున్న మొబైల్ టెక్నాలజీ
 దేశంలో పటిష్టమైన మొబైల్ టెక్నాలజీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ పరిస్థితులు, 4జీ ఆవిష్కరణ వంటి అంశాలు ఆరోగ్య సంరక్షణా విభాగం అభివృద్ధిలో తమదైన పాత్రను పోషించనున్నాయి. 2017కల్లా మొబైల్ హెల్త్ ఇండస్ట్రీ విలువ 0.6 బిలియన్ డాలర్లకు చేరుకునే అవకాశం ఉంది. టెలీ మెడిసిన్ రంగం కూడా గణనీయంగా విస్తరిస్తోంది. ఈ రంగం విలువ 2012లో 7.5 మిలియన్ డాలర్లు కాగా, ఈ విలువ 2017 నాటికి 20 శాతం వృద్ధితో 18.7 మిలియన్ డాలర్లకు చేరే అవకాశాలు ఉన్నాయి.
 
 ఎఫ్‌డీఐల ఆకర్షణ
 2000 ఏప్రిల్ నుంచి 2013 మార్చి వరకూ  ప్రైవేటు ఆరోగ్య రంగం (డ్రగ్స్ అండ్ ఫార్మా) ఎఫ్‌డీఐల ఆకర్షణ విలువ 10.3 బిలియన్ డాలర్లు. హాస్పిటల్స్, డయాగ్నస్టిక్ సెంటర్ల విషయంలో ఈ విలువ 1.6 బిలియన్ డాలర్లుకాగా, మెడికల్ అప్లికేషన్ల విషయంలో 0.6 బిలియన్ డాలర్లుగా ఉంది.

Advertisement

Related News By Category

Advertisement
 
Advertisement
Advertisement