
న్యూఢిల్లీ: దేశంలో ఆరోగ్య సంరక్షణ సదుపాయాలు (హెల్త్‌కర్ ఇన్‌ఫ్రా) మెరుగుపడేందుకు టెక్నాలజీ, ఆవిష్కరణలు కీలకమని నీతి ఆయోగ్ సీఈవో పరమేశ్వరన్ అయ్యర్ అభిప్రాయపడ్డారు. అపోలో హాస్పిటల్ నిర్వహించిన 9వ ఎడిషన్ ఇంటర్నేషనల్ పేషెంట్ సేఫ్టీ సదస్సులో భాగంగా పరమేశ్వరన్ మాట్లాడారు. వ్యాధి నిర్ధారణ నుంచి చికిత్స అందించే వరకు ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ అనేది దేశ హెల్త్‌కేర్ వ్యవస్థను మార్చే కీలక టెక్నాలజీగా పేర్కొన్నారు.
రాబోయే సంవత్సరాల్లో డిజిటల్ హెల్త్‌కేర్ పరిష్కారాలు మరిన్ని అందుబాటులోకి వస్తాయన్నారు. దేశ ఆరోగ్య సంరక్షణ వ్యవస్థలో గుణాత్మక మార్పు కోసం ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యాన్ని మరింత పెంచాల్సిన అవసరం ఉందన్నారు. సార్వత్రిక హెల్త్ కవరేజీకి భారత్ చేరువ అయిందని ఇదే కార్యక్రమంలో పాల్గొన్న అపోలో హాస్పిటల్ జేఎండీ సంగీతా రెడ్డి అన్నారు. ఈ క్రమంలో రోగుల భద్రత, డిజిటల్ హెల్త్‌కు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు.