Parameswaran Iyer
-
టెక్నాలజీతో హెల్త్‌కేర్ ఇన్ఫ్రా మెరుగు
న్యూఢిల్లీ: దేశంలో ఆరోగ్య సంరక్షణ సదుపాయాలు (హెల్త్‌కర్ ఇన్ఫ్రా) మెరుగుపడేందుకు టెక్నాలజీ, ఆవిష్కరణలు కీలకమని నీతి ఆయోగ్ సీఈవో పరమేశ్వరన్ అయ్యర్ అభిప్రాయపడ్డారు. అపోలో హాస్పిటల్ నిర్వహించిన 9వ ఎడిషన్ ఇంటర్నేషనల్ పేషెంట్ సేఫ్టీ సదస్సులో భాగంగా పరమేశ్వరన్ మాట్లాడారు. వ్యాధి నిర్ధారణ నుంచి చికిత్స అందించే వరకు ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ అనేది దేశ హెల్త్‌కేర్ వ్యవస్థను మార్చే కీలక టెక్నాలజీగా పేర్కొన్నారు. రాబోయే సంవత్సరాల్లో డిజిటల్ హెల్త్‌కేర్ పరిష్కారాలు మరిన్ని అందుబాటులోకి వస్తాయన్నారు. దేశ ఆరోగ్య సంరక్షణ వ్యవస్థలో గుణాత్మక మార్పు కోసం ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యాన్ని మరింత పెంచాల్సిన అవసరం ఉందన్నారు. సార్వత్రిక హెల్త్ కవరేజీకి భారత్ చేరువ అయిందని ఇదే కార్యక్రమంలో పాల్గొన్న అపోలో హాస్పిటల్ జేఎండీ సంగీతా రెడ్డి అన్నారు. ఈ క్రమంలో రోగుల భద్రత, డిజిటల్ హెల్త్‌కు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. -
ఫుడ్ ప్రాసెసింగ్ రంగం కోసం ఎంఎస్ఎంఈని ప్రోత్సహించండి
న్యూఢిల్లీ: ఆహార ప్రాసెసింగ్ రంగం భారత ఆర్థిక వ్యవస్థకు, ఉద్యోగ కల్పనకు కీలకమని నీతి ఆయోగ్ సీఈఓ పరమేశ్వరన్ అయ్యర్ శుక్రవారం పేర్కొన్నారు. ప్రాసెస్ చేసిన వస్తువుల ఉత్పత్తి, ఎగుమతులను పెంచడం అవశ్యమని ఉద్ఘాటించారు. పారిశ్రామిక వేదిక సీఐఐ ఇక్కడ నిర్వహించన ఒక కార్యక్రమాన్ని ఉద్ధేశించి ఆయన మాట్లాడుతూ, ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలోకి ప్రవేశించడానికి సూక్ష్మ లఘు చిన్న మధ్య (ఎంఎస్ఎంఈ) రంగాన్ని ప్రోత్సహించాలని సూచించారు. ఫుడ్ ప్రాసెసింగ్ రైతుల ఆదాయ పురోగతికే కాకుండా, పోషకాహార లక్ష్యాలను సాధించడంలో సహాయపడుతుందని ఆయన అన్నారు. ప్రస్తుత అంతర్జాతీయ పరిస్థితుల్లో ఆహార భద్రతకు ఎంతో ప్రాధాన్యత ఉందని, ఈ దిశలో కేంద్రం పలు చర్యలు తీసుకుంటోందని పేర్కొన్నారు. వ్యవసాయ రంగం దేశంలో క్రమంగా పురోగతి చెందుతోందన్నారు. ఫుడ్ ప్రాసెసింగ్ రంగం పురోగతికి కేంద్రం కీలక చర్యలు తీసుకుంటోందని పేర్కొంటూ, ఈ రంగాన్ని ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక (పీఎల్ఐ) పథకానికి అనుసంధానించిన విషయాన్ని ప్రస్తావించారు. ఇక 2023ను ఐక్యరాజ్యసమితి చిరుధాన్యాల సంవత్సరంగా ప్రకటించిన నేపథ్యంలో ఈ విభాగం నుంచి భారఎగుమతులు లక్ష్యంగా కేంద్రం చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఫుడ్ వేస్టేజ్‌ని అరికట్టాల్సిన అవసరం ఉందని, ఇందుకు ప్రాసెసింగ్ కీలక భూమికను పోషిస్తుందని అన్నారు. -
ఎన్ఎంపీతో కేంద్రానికి రూ.33,422 కోట్లు
న్యూఢిల్లీ: ప్రభుత్వ ఆస్తుల ద్వారా ఆదాయాల (నేషనల్ మోనిటైజేషన్ పైప్‌లైన్– ఎన్ఎంపీ) అన్వేషణ పథకం కింద కేంద్రానికి ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2022–23) ఇప్పటి వరకూ కేంద్రానికి రూ.33,422 కోట్లు ఒనగూడింది. ఇందులో రూ.17,000 కోట్లతో బొగ్గు మంత్రిత్వశాఖ ముందడుగులో ఉండగా, పోర్ట్స్ అండ్ షిప్పింగ్ మంత్రిత్వశాఖ తన ఆర్థిక సంవత్సరం లక్ష్యాలను అధిగమించే స్థాయికి చేరుకుంది. అధికార వర్గాల తాజా సమాచారం ప్రకారం, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నవంబర్ 14న నీతి ఆయోగ్ సీఈవో పరమేశ్వరన్ అయ్యర్‌తో జరిగిన సమావేశంలో ఎన్ఎంపీ అమలు పురోగతిని సమీక్షించారు. ఈ సమీక్ష అంశాలపై అందిన సమాచారం క్లుప్తంగా... ► 2021–22లో ఎన్ఎంపీ ద్వారా ప్రభుత్వ సమీకరణ లక్ష్యం రూ.88,000 కోట్లు. అయితే రూ. 1 లక్ష కోట్ల విలువైన లావాదేవీలను పూర్తి చేయడం ద్వారా లక్ష్యాన్ని అధిగమించింది. ► 2022–23లో లక్ష్యం రూ.1,62,422 కోట్లు. అయితే లక్ష్యాలను చేరకపోవచ్చన్నది ప్రభుత్వ తాజా అంచనా. లక్ష్యానికి రూ.38,243 కోట్ల దూరంలో ఉండవచ్చని భావిస్తున్నారు. రూ.1,24,179 కో ట్ల అసెట్ మోనిటైజేషన్ జరగవచ్చని భావిస్తోంది. ► బొగ్గు మంత్రిత్వ శాఖ, గనుల మంత్రిత్వ శాఖ, ఓడరేవులు–షిప్పింగ్ మంత్రిత్వ శాఖలు అసెట్ మానిటైజేషన్ లక్ష్యాన్ని అధిగమించే అవకాశం ఉంది. రోడ్డు రవాణా– రహదారుల మంత్రిత్వ శాఖ కూడా లక్ష్యాలను చేరుకునే వీలుంది. ► విద్యుత్, రైల్వే, పౌర విమానయాన మంత్రిత్వ శాఖలు అలాగే చమురు– గ్యాస్ మంత్రిత్వ శాఖ లక్ష్యం నెరవేరే అవకాశం లేదు. ► రైల్వేల లక్ష్యం రూ.30,000 కోట్లయితే, ఇప్పటికి ఒనగూరింది రూ.1,829 కోట్లు. ► విద్యుత్ మంత్రిత్వశాఖ విషయంలో లక్ష్యం రూ.15,000 కోట్లయితే, ఇప్పటికి లక్ష్యంలో రూ.2,000 కోట్లకు చేరుకోవడం జరిగింది. ► బొగ్గు మంత్రిత్వశాఖ లక్ష్యం రూ.30,000 కోట్లయితే, ఇప్పటికి రూ.17,000 కోట్ల విలువైన మానిటైజేషన్ జరిగింది. రోడ్డు, ట్రాన్స్‌పోర్స్, హైవేల శాఖ లక్ష్యం రూ.32,855 కోట్లయితే, ఇప్పటికి రూ.4,100 కోట్ల సమీకరణ జరిగింది. ► మోనిటేజేషన్ లక్ష్యాల సాధనకు ఆస్తులను గుర్తించవలసినదిగా వివిధ మంత్రిత్వశాఖలను ఆర్థికశాఖ కోరింది. ► వివిధ రంగాల్లో మౌలిక ఆస్తుల విలువలను గుర్తించడం, తద్వారా నాలుగేళ్ల కాలంలో ఈ ఆస్తుల ద్వారా రూ. 6 లక్షల కోట్ల సమీకరణ లక్ష్యంగా 2021 ఆగస్టులో ఆర్థికమంత్రి సీతారామన్ ఎన్ఎంపీ స్కీమ్‌ను ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా నీతి ఆయోగ్ వివిధ మంత్రిత్వశాఖలతో నిరంతరం సంప్రతింపులు జరుపుతోంది. -
నీతి ఆయోగ్ సీఈఓగా పరమేశ్వర్ అయ్యర్ బాధ్యతలు!
న్యూఢిల్లీ: నీతి ఆయోగ్ సీఈఓగా పరమేశ్వరన్ అయ్యర్ సోమవారం బాధ్యతలు స్వీకరించారు. జూన్ 30న పదవీ విరమణ చేసిన అమితాబ్ కాంత్ స్థానంలో అయ్యర్ తాజా బాధ్యతలు చేపట్టారు. రెండేళ్లు లేదా తదుపరి ఆదేశాలు వచ్చే వరకూ అయ్యర్ తాజా బాధ్యతల్లో కొనసాగుతారు. కాంత్‌కు వర్తించిన నియామక, బాధ్యతల విధివిధానాలే అయ్యర్‌కూ వర్తిస్తాయని అధికారిక ప్రకటన పేర్కొంది. కేంద్రం ప్రతిష్టాత్మకంగా పరిగణించిన 20 బిలియన్ డాలర్ల స్వచ్ఛ భారత్ మిషన్ అమలుకు అయ్యర్ గతంలో నాయకత్వం వహించారు. ఉత్తరప్రదేశ్ కేడర్‌కు చెందిన 1981 బ్యాచ్ ఐఏఎస్ అధికారి అయిన ఆయన ప్రభుత్వ, ప్రైవేట్ రంగాలలో పని చేశారు. 2016–20 మధ్య కాలంలో తాగునీరు, పారిశుద్ధ్య మంత్రిత్వ శాఖలో కార్యదర్శిగా పనిచేశారు. -
తాగునీటి సమస్యకు త్వరలో విముక్తి
► నిర్ణీత సమయంలో ‘భగీరథ’ పూర్తి చేస్తాం ► రాష్ట్రంలోని ప్రతి పల్లెకు మంచి నీరు ఇస్తాం: కేసీఆర్ ► ఇంటింటికీ ఇంటర్నెట్ సేవలు అందించనున్నాం ► సీఎంతో కేంద్ర బృందం భేటీ ► ‘భగీరథ’ అద్భుత పథకమన్న కేంద్ర బృందం సాక్షి, హైదరాబాద్: పంచాయతీరాజ్ వ్యవస్థలోని అన్ని అంచెలను పటిష్టంగా అమలుచేస్తే గ్రామీణ వ్యవస్థ అభివృద్ధిలో పురోగమిస్తుందని ముఖ్యమం త్రి కె.చంద్రశేఖర్‌రావు పేర్కొన్నారు. తెలంగాణ పల్లెలను తాగునీటి సమస్య నుంచి విముక్తి చేస్తామని..ఇందుకోసం మిషన్ భగీరథ పథకాన్ని ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తోందన్నారు. ‘భగీరథ’ పైపులతోపాటు ఇంటర్నెట్ కేబుల్ వేసి, ఇంటింటికీ ఇంటర్నెట్ను అందించనున్నామని తెలి పారు. మిషన్ భగీరథతో పాటు రాష్ట్రంలో స్వచ్ఛ భారత్ కార్యక్రమాల పనితీరును పరిశీలిం చేందుకు కేంద్ర తాగునీటి సరఫరా, గ్రామీణ స్వచ్ఛ భారత్ మిషన్ కార్యదర్శి పరమేశ్వరన్ అయ్యర్ ఆధ్వ ర్యంలోని బృందం రాష్ట్రానికి వచ్చింది. గురువారం ప్రగతిభవన్‌లో సీఎం కేసీఆర్‌తో మర్యాద పూర్వకం గా భేటీ అయింది. ఈ భేటీలో తాగునీటి సరఫరాకు సంబంధించి పలు అంశాలపై చర్చించారు. దేశంలోనే ఇది అద్భుతం: మిషన్ భగీరథ పథకం దేశంలోనే అద్భుతమైన పథకమని, ఇది దేశానికే ఆదర్శంగా నిలుస్తోందని పరమేశ్వరన్ అయ్యర్ పేర్కొన్నారు. ఈ పథకాన్ని ప్రారంభించి వచ్చిన అనంతరం ప్రధాని మోదీ స్వయంగా తమకు ఈ విషయాన్ని చెప్పారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న గ్రామీణ నీటి సరఫరా కార్యాచరణను పరిశీలించడానికి తాము వచ్చామన్నారు. మిషన్ భగీరథ నిర్మాణ పనులతో పాటు పారిశుద్ధ్య కార్యక్రమాల అమలు తీరుపై జిల్లా కలెక్టర్లతో పరమేశ్వరన్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి తెలుసుకున్నారు. పనులు పూర్తయి పథకం అమల్లోకి వస్తే..తాగునీటిని అందించడంలో తెలంగాణ దేశానికే ఆదర్శంగా నిలుస్తుందన్నారు. రాష్ట్రంలోని 1,041 ఫ్లోరైడ్ బాధిత గ్రామాలకు మిషన్ భగీరథ ద్వారా నీటిని అందిస్తున్నందుకు కేంద్రం ఇవ్వా ల్సిన రూ.800 కోట్ల నిధులను త్వర లో విడుదల చేస్తామన్నారు. పనులు పూర్తయిన తర్వాత ఇన్సెంటీవ్గా మరిన్ని నిధులను అందిస్తామన్నారు. వివిధ దేశాల్లో తాగునీటి సరఫరా కోసం అక్కడి ప్రభుత్వాలు చేపడుతున్న కార్య క్రమాలను సీఎంకు వివరించిన అయ్యర్... చైనా, వియత్నాం, కెనడా వంటి దేశాలు కూడా ఇంత పకడ్బందీగా అమలు పర్చలేకపోయాయన్నారు. కార్యక్రమంలో మంత్రులు జూపల్లి, జగదీశ్ రెడ్డి, మిషన్ భగీరథ వైస్ చైర్మన్ వేముల ప్రశాంత్ రెడ్డి, ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్ శర్మ, ప్రభుత్వ సీఎస్ ఎస్పీ సింగ్, పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.