
న్యూఢిల్లీ: మహమ్మారి కోవిడ్–19 సమయంలో భారత్‌లోని దాదాపు 70 శాతం మంది సీనియర్ సిటిజన్లకు సరైన ఆరోగ్య సంరక్షణ సదుపాయాలు అందుబాటులో లేవని మ్యాక్స్ గ్రూప్ సంస్థ.. అంటారా సర్వే వెల్లడించింది. దాదాపు 57 శాతం మంది ఈ సమయంలో మానసిక ఆరోగ్య సమస్యలను ఎదుర్కొన్నట్లు కూడా సర్వే తెలిపింది. సర్వే ముఖ్యాంశాలను పరిశీలిస్తే..
► 60 సంవత్సరాలు పైబడిన 2,100 మంది వృద్ధుల అభిప్రాయాలతో సర్వే వెలువడింది.
► సర్వే ప్రకారం, మహమ్మారి వృద్ధుల జీవన విధానాలను, ప్రాధాన్యతలను మార్చింది. అలాగే సాంకేతికత వినియోగంలో గణనీయమైన మార్పులను తీసుకువచ్చింది.
► వ్యాధి సోకుతుందనే భయం 65 శాతాన్ని వెంటాడింది. 58 శాతం మంది సీనియర్ సిటిజన్లు కఠినమైన మార్గదర్శకాల ఫలితంగా సామాజిక ఒంటరితనంపై ఆందోళన చెందారు.
► తీవ్ర అనారోగ్య సమస్యల బారి పడకుండా ఎలా తప్పించుకోవాలి, ఎటువంటి ఆహారాన్ని తీసుకోవాలి అనే అంశాలపై వృద్ధులు దృష్టి పెట్టారు. దాదాపు 72 శాతం మంది వృద్ధులు స్వీయ పర్యవేక్షణ, సమతుల్య ఆహారాన్ని ఎంచుకున్నారు. 55 శాతం మంది బయటి వైద్య సహాయం కోరే బదులు ఇంటి ఆరోగ్య సంరక్షణా విధానాలపై మొగ్గు చూపారు.
► వృద్ధాప్య జనాభా, పెరుగుతున్న మధ్యతరగతి, మెరుగైన ఆయుర్దాయం వంటి అంశాలు భారతదేశంలో అనుబంధ ఆరోగ్య సంరక్షణ సేవలకు డిమాండ్‌ను పెంచుతుందని భావిస్తున్నట్లు అంటారా పేర్కొంది.