స్టార్టప్స్ కోసం ఇన్ఫోసిస్ భారీ ఫండ్...
న్యూఢిల్లీ: స్టార్టప్ సంస్థలకు ఆర్థిక తోడ్పాటు అందించేందుకు 250 మిలియన్ డాలర్లతో(సుమారు రూ. 1,550 కోట్లు) సాఫ్ట్‌వేర్ దిగ్గజం ఇన్ఫోసిస్ ‘ఇన్నోవేట్ ఇన్ ఇండియా’ ఫండ్ ఏర్పాటు చేసింది. ప్రధాని నరేంద్ర మోదీతో బుధవారం భేటీ అయిన అనంతరం ఇన్ఫోసిస్ సీఈవో విశాల్ సిక్కా ఈ విషయం తెలిపారు. కొత్త తరం టెక్నాలజీలు, నూతన ఆవిష్కరణలపై పనిచేసే చిన్న సంస్థలను ప్రోత్సహించేందుకు ఈ ఫండ్‌ను ఉద్దేశించినట్లు ఆయన వివరించారు. ప్రధాని ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన డిజిటల్ ఇండియా కార్యక్రమానికి తమ వంతు తోడ్పాటు అందిస్తామన్నారు.
మరోవైపు, స్మార్ట్ సిటీల నిర్మాణానికి అవసరమైన సహకారం కూడా పట్టణాభివృద్ధి శాఖకు అందిస్తామని సిక్కా చెప్పారు. తమ మైసూర్ క్యాంపస్‌ను మోడల్ స్మార్ట్ సిటీగా తీర్చిదిద్దుతామని ఆయన వివరించారు. 350 ఎకరాల్లో విస్తరించిన క్యాంపస్‌ను ఏప్రిల్‌కల్లా స్మార్ట్‌గా మార్చి.. పట్టణాభివృద్ధిలో కొత్త పోకడలను ఆవిష్కరిస్తామన్నారు. నిర్మాణాల్లో అత్యాధునిక టెక్నాలజీని, ఐటీని ఉపయోగించడం ద్వారా విద్యుత్, ఇతర వనరుల వినియోగాన్ని, వ్యర్థాలను తగ్గించాలన్నది స్మార్ట్ సిటీల ఏర్పాటు ప్రధానోద్దేశమని సిక్కా పేర్కొన్నారు.