శరణార్థి శిబిరాల్లోని పిల్లలపై ఐసిస్ వల
లండన్: లెబనాన్, జోర్డాన్ దేశాల్లోని శరణార్థి శిబిరాల్లో ఉంటున్న ఒంటరి పిల్లలు, యువతను ఐసిస్ ఉగ్రవాదం వైపు ఆకర్షిస్తోందని ఒక బ్రిటన్ నివేదిక పేర్కొంది. ఉగ్రవాద వ్యతిరేక కార్యకలాపాల గురించి విశ్లేషణలు చేసే ‘క్విల్లియం’ అనే మేధో సంస్థ ఈ నివేదికను రూపొందించింది. పిల్లలను రిక్రూట్ చేసుకునేందుకు ఒక్కొక్కరికి రెండు వేల డాలర్ల దాకా ఐసిస్ ఆశ చూపుతున్నట్లు నివేదిక వెల్లడించింది. ఈవిధంగా రిక్రూట్ చేసుకున్న పిల్లలను విదేశాలకు పంపి దాడులు చేయించాలని ఐసిస్ వ్యూహరచన చేస్తోందని తెలిపింది.
శరణార్థి శిబిరాల్లోని బాలికలను కూడా ఉగ్రవాదంపైపు మళ్లించేందుకు, కొత్త తరం ఉగ్రవాదులుగా తయారు చేసేందుకు ఇస్లామిక్ స్టేట్ ప్రయత్నిస్తోందని వివరించింది. డబ్బు, ఆహారం ఎరగా వేసి పిల్లలను వలలో వేసుకుంటోందని వెల్లడించింది.