మళ్లీ తెరపైకి రిలయన్స్ టవర్స్
- ప్రతిష్టాత్మక ప్రాజెక్టుపై నేడు సమీక్షించనున్న కేటీఆర్
- వైఎస్సార్ హయాంలో ‘రిలయన్స్ టవర్స్’కు ఒప్పందాలు
- రూ.7 వేల కోట్లతో వంద అంతస్తుల వాణిజ్య భవనం నిర్మాణానికి ప్రతిపాదనలు
- ఆర్థిక మాంద్యం, రాష్ట్ర విభజనతో నిలిచిపోయిన ప్రాజెక్టు
సాక్షి, హైదరాబాద్: బుర్జ్ దుబాయ్, పెట్రొనాస్ టవర్‌ల తరహాలో రాష్ట్రంలో నిర్మించతలపెట్టిన వంద అంతస్తుల ఆకాశహర్మ్యం ‘రిలయన్స్ టవర్స్’ ప్రాజెక్టు మళ్లీ తెరపైకి వచ్చింది. ప్రపంచ ఆర్థిక మాంద్యం, రాష్ట్ర విభజన నేపథ్యంలో నిలిచిపోయిన ఈ ప్రాజెక్టును తిరిగి చేపట్టడంపై పరిశ్రమలు, ఐటీ శాఖల మంత్రి కె.తారక రామారావు శనివారం కీలక సమీక్ష నిర్వహించనున్నారు. ఈ ప్రాజెక్టును తిరిగి గాడిన పెట్టేందుకు కాంట్రాక్టు సంస్థ రిలయన్స్ ఇన్‌ఫ్రా కోరుతున్న పలు ‘మాఫీల’పై అందులో చర్చించనున్నారు.
వైఎస్ హయాంలో ప్రతిపాదన
2007లో వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ప్రభుత్వం రూ.7 వేల కోట్ల అంచనాతో ఈ ప్రాజెక్టు నిర్మాణ బాధ్యతను రిలయన్స్ ఇన్‌ఫ్రాకు అప్పగించింది. వంద అంతస్తుల్లో, 20 మిలియన్ చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించే వాణిజ్య భవనం కోసం రంగారెడ్డి జిల్లా మంచిరేవులలో 76.2 ఎకరాలను కేటాయించింది. ప్రాజెక్టులో పర్యవేక్షణ సంస్థ టీఎస్‌ఐఐసీకి 11 శాతం, రిలయన్స్ ఇన్‌ఫ్రాకు 66 శాతం, సాంకేతిక భాగస్వామి శోభా డెవలపర్స్‌కు 23 శాతం వాటాలున్నాయి. తన వంతు వాటాగా రిలయన్స్ ఇన్‌ఫ్రా రూ.527 కోట్ల పెట్టుబడికి అంగీకరించగా.. డిబెంచర్లు, నగదు రూపంలో సుమారు సగం మొత్తాన్ని చెల్లించింది కూడా.
అయితే ఆర్థిక మాంద్యం, రాష్ట్ర విభజన తదితర పరిణామాలతో ప్రతిపాదిత ప్రాజెక్టు నిలిచిపోయింది. ప్రస్తుతం బ్రాండ్ హైదరాబాద్‌ను దృష్టిలో పెట్టుకుని ప్రాజెక్టును తిరిగి చేపట్టేందుకు రిలయన్స్ ఇన్‌ఫ్రా ఆసక్తి చూపుతోంది. అయితే తన వంతు వాటాలో కొంత పెట్టుబడితో పాటు, పెనాల్టీ మాఫీ చేయాలని ఆ సంస్థ ఇన్‌ఫ్రా కోరుతోంది. మరోవైపు కన్సల్టెన్నీ సంస్థ ఎర్నెస్ట్ యంగ్ ఇచ్చిన ప్రాజెక్టు రీస్ట్రక్చరింగ్ ప్రణాళికను రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో శనివారం కేటీఆర్ నిర్వహిస్తున్న సమీక్ష కీలకం కానుంది.
ఓఆర్‌ఆర్ వెలుపలకు పరిశ్రమలు
హైదరాబాద్ నగరం లోపలా, శివార్లలో ఉన్న పరిశ్రమలను ఔటర్ రింగు రోడ్డు వెలుపలకు తరలించే అంశంపైనా శనివారం భేటీలో కేటీఆర్ సమీక్షించనున్నారు. హైదరాబాద్‌లోని 14 పారిశ్రామికవాడల్లో సుమారు పదివేలకుపైగా చిన్నా, పెద్దా పరిశ్రమలున్నాయి. వాటి చుట్టూ ప్రస్తుతం జనావాసాలు పెరిగిపోయాయి. ఈ నేపథ్యంలో కాలుష్య కారక పరిశ్రమలను ఔటర్ రింగ్ రోడ్డు వెలుపలకు తరలించాలని నిర్ణయించారు. దీనిపై శ నివారం జరిగే సమావేశంలో కాల పరిమితిని విధించనున్నట్లు సమాచారం.