కదిలే పంట పొలం | Local Roots brings TerraFarms | Sakshi
Sakshi News home page

కదిలే పంట పొలం

Published Thu, Jul 13 2017 3:42 AM | Last Updated on Tue, Sep 5 2017 3:52 PM

కదిలే పంట పొలం

కదిలే పంట పొలం

అమెరికాలోని కాలిఫోర్నియాలో ‘లోకల్‌ రూట్స్‌’ అని ఓ కంపెనీ ఉంది. ఆ కంపెనీ వాళ్లు.. టెర్రాఫామ్స్‌ పేరుతో అభివృద్ధి చేసిన పంటల పెట్టె ఇది. మట్టి అవసరం లేకుండా... వాతావరణంతో సంబంధం లేకుండా ఏడాది పొడవునా.. అతితక్కువ నీటిని వాడుకుంటూ బోలెడంత పంట పండిస్తుంది ఈ పెట్టె.

ఎంత పండిస్తుందో కచ్చితంగా చెప్పాలా? ఒకే. దాదాపు 40 అడుగుల పొడవుండే ఈ షిప్పింగ్‌ కంటెయినర్‌లో హైడ్రోపోనిక్స్‌ టెక్నాలజీని ఉపయోగించి పండించే పంటలు ఐదెకరాల సాధారణ పంటకు సమానమని అంటున్నారు కంపెనీ ప్రతినిధులు. ఎల్‌ఈడీ బల్బుల ద్వారా పంటలు ఏపుగా పండేందుకు అనువైన కాంతిని మాత్రమే ప్రసారం చేయడంతో పంటలు వేగంగా పెరగడమే కాకుండా.. దిగుబడులూ ఎక్కువగా ఉంటాయి అంటున్నారు కంపెనీ సీఈవో ఎరిక్‌ ఎల్లెస్టాడ్‌. మొక్కలకు కావల్సిన నీళ్లు, పోషకాలు, వాతావరణ పరిస్థితులన్నింటినీ సెన్సర్లు ఎప్పటికప్పుడు గుర్తిస్తూ అవసరాలకు అనుగుణంగా వాటిని సరఫరా చేస్తూంటాయి. అందువల్లనే ఒక్కో కంటెయినర్‌లోని పంటలకు రోజుకు 20 నుంచి 80 లీటర్ల నీళ్లు మాత్రమే ఖర్చవుతాయి.

పైగా అనారోగ్యం తెచ్చిపెట్టే రసాయనిక కీటక నాశినులు, ఎరువుల  వాడకం కూడా ఉండదు. అవసరాన్ని బట్టి బోలెడన్ని కంటెయినర్లను ఒకదానిపై ఒకటి పేర్చేసుకుని అన్నింటినీ కనెక్ట్‌ చేసుకోవచ్చు కూడా. అమెరికాలోని లాస్‌ ఏంజెలిస్, మేరీల్యాండ్‌ తదితర ప్రాంతాల్లో ఇప్పటికే టెర్రాఫామ్స్‌ వాడుకలో ఉన్నాయి. షిప్పింగ్‌ కంటెయినర్లలో వ్యవసాయం చేయడం కొత్త కానప్పటికీ.. టెర్రాఫామ్స్‌ స్థాయిలో దిగుబడి సాధించడం ఇతరులెవరికీ సాధ్యం కాదని, భవిష్యత్తులో ఇదే టెక్నాలజీతో అంతరిక్షంలో పంటలు పండించినా ఆశ్చర్యం లేదని అంటున్నారు ఎరిక్‌. అన్నీ బాగానే ఉన్నాయి గానీ.. ఏమేం పంటలు పండుతాయి దీంట్లో? ప్రస్తుతం ఏడాది పొడవునా లెట్యూస్, (క్యాబేజీ లాంటిది), కేల్‌ (ఒకరకమైన ఆకుకూర), స్ట్రాబెర్రీలు పండుతున్నాయి.
– సాక్షి నాలెడ్జ్‌ సెంటర్‌

Advertisement
Advertisement