
ప్రధాన చికిత్సలు ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే!
- ఆరోగ్యశ్రీపై సర్కారు యోచన
- కాలేయ మార్పిడి నుంచి కాక్లియర్ ఇంప్లాంట్ వరకూ
- ప్రభుత్వ ఆసుపత్రులకు అధిక నిధులు దక్కేలా చర్యలు
- రానురాను ప్రైవేటు నుంచి పక్కకు తప్పించే ప్రయత్నాలు
- వారంలోగా అధికారిక ప్రకటన
సాక్షి, హైదరాబాద్: ఆరోగ్యశ్రీలోని ప్రధాన వ్యాధులు నిర్ణీత ప్యాకేజీకి మించి ఖర్చయ్యే వాటికి ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే శస్త్రచికిత్సలు జరిగేలా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. మొన్న కాలేయ మార్పిడి చికిత్సను ఉస్మానియా ఆసుపత్రిలో నిర్వహించారు. కార్పొరేట్ ఆసుపత్రుల్లో నిర్వహించే ధరలో పావు శాతానికే అక్కడ విజయవంతంగా చేశారు. తాజాగా కాక్లియర్ ఇంప్లాంట్ (వినికిడి లోపం ఉన్న వారికి ఆపరేషన్ ద్వారా ఏర్పాటు చేసే పరికరం) శస్త్రచికిత్సనూ ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే నిర్వహించేలా ఆరోగ్యశ్రీ ట్రస్టు కసరత్తు చేస్తోంది. ఈ మేరకు మంగళవారం ఉన్నతస్థాయి సమావేశంలో నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. వారంలోగా దీనిపై అధికారిక ప్రకటన చేసే అవకాశం ఉంది.
కార్పొరేట్ నుంచి పక్కకు వెళ్లాలని...
ఆరోగ్యశ్రీ పరిధిలో 938 వ్యాధులకు పేదలు, ప్రభుత్వ ఉద్యోగులకు కవరేజీ ఇస్తున్నారు. ప్రతీ ఏడాది రూ. 350 కోట్ల వరకు ప్రభుత్వం ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రులకు చెల్లిస్తుందని అంచనా. అందులో 80 శాతం సొమ్ము కార్పొరేట్, ప్రైవేటు ఆసుపత్రులకే వెళ్తుంది. ఇప్పుడు ఉద్యోగుల ఆరోగ్యకార్డుల ద్వారా నిర్వహించే వైద్య చికిత్సలనూ ఆరోగ్యశ్రీనే నిర్వహిస్తున్నందున అంతకు రెట్టింపు చెల్లించాల్సి ఉంటుందని అంటున్నారు. ఈ నేపథ్యంలో కార్పొరేట్లలో చికిత్సలను తగ్గించాలని సర్కారు యోచిస్తోంది.
అందులో భాగంగా మొదటగా భారీగా ఖర్చయ్యే వ్యాధులకు ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే శస్త్రచికిత్స చేసేలా చర్యలు ప్రారంభించింది. ఉదాహరణకు ఉస్మానియా ఆసుపత్రిలో ఇటీవల నిర్వహించిన కాలేయ మార్పిడి శస్త్రచికిత్స ఆరోగ్యశ్రీలో ఉన్నా ప్యాకేజీ సొమ్ముకు చేయడం అసాధ్యం. అయితే ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా వాటిని నిర్వహిస్తున్నారు. కార్పొరేట్ ఆసుపత్రుల్లో కాలేయ మార్పిడి శస్త్రచికిత్సకు రూ. 40 లక్షల వరకు అవుతుంది. దానినే ఉస్మానియా వైద్యులు రూ.10.50 లక్షలకే నిర్వహించారు.
కాక్లియర్ ఇంప్లాంటుకు కార్పొరేట్ ఆసుపత్రుల్లో రూ.6.40 లక్షలవుతుంది. వీటినీ ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే నిర్వహించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ శస్త్రచికిత్సలు రాష్ట్రంలో ఏడాదికి 300 వరకు జరుగుతున్నాయి. కాక్లియర్ ఇంప్లాంట్లకు ఎక్కువ ఖర్చు పెడుతున్నామన్న ఆలోచన సర్కారును తొలచివేస్తోంది. ప్రస్తుతం కోఠిలోని ఈఎన్‌టీ ఆసుపత్రిలో మాత్రమే ప్రభుత్వపరంగా కాక్లియర్ ఇంప్లాంటు చేస్తున్నారు. ఇక నుంచి హైదరాబాద్‌లోని గాంధీ, వరంగల్ ఎంజీఎంలోనూ నిర్వహించాలని నిర్ణయించారు. శస్త్రచికిత్స అయిపోయాక జరిగే థెరపీలను కొత్తగా కరీంనగర్, మహబూబ్‌నగర్ జిల్లాల్లో చేయాలని ఆరోగ్యశ్రీ నిర్ణయించింది.
ఓపీ సేవలూ సర్కారు దవాఖానాలకే ?
కార్పొరేట్ ఆసుపత్రుల్లో ఉద్యోగులకు వైద్య సేవలు అందించే విషయంలో ప్రతిష్టంభన కొనసాగుతోంది. ప్యాకేజీపై 25 నుంచి 40 శాతం వరకు పెంచాలని ఆసుపత్రులు కోరుతుండగా, ఎంతో కొంత పెంచేందుకు సర్కారు సన్నద్ధమైంది. కానీ ఔట్‌పేషెంట్ (ఓపీ)కు సంబంధించే ప్రధాన ప్రతిష్టంభన. అయితే ప్రభుత్వం మాత్రం ఓపీ సేవలను పూర్తిగా కార్పొరేట్లకే అప్పగిస్తే రూ. 300 కోట్లు అదనంగా ఖర్చు అవుతుందని భయపడుతోంది.
ఈ నేపథ్యంలో నిమ్స్ తరహా ఓపీ ఫీజుకు అంగీకరించాలని అనుకుంది. కానీ నిర్ణయం తీసుకోలేదు. ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే ఉద్యోగులకు ఓపీ సౌకర్యం కల్పించి వారికోసం అక్కడ ప్రత్యేక సమయం కేటాయించాలని యోచిస్తోంది. అలా ఓపీకి ఇచ్చే సొమ్ము కార్పొరేట్లకు వెళ్లకుండా.. ప్రభుత్వ ఆసుపత్రులకే వెళ్లేలా చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఓపీ సేవలు కార్పొరేట్ ఆసుపత్రుల్లోనూ ఉండాలని ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు.