చింటు సార్‌.. టెర్రర్‌ బాస్‌! | nayeem used code names for settlements | Sakshi
Sakshi News home page

చింటు సార్‌.. టెర్రర్‌ బాస్‌!

Published Tue, Aug 16 2016 2:07 AM | Last Updated on Tue, Oct 16 2018 9:08 PM

చింటు సార్‌.. టెర్రర్‌ బాస్‌! - Sakshi

చింటు సార్‌.. టెర్రర్‌ బాస్‌!

నయీమ్‌ డైరీలో వెలుగు చూసిన ‘కోడ్‌’ పేర్లు ఇవీ..
వీరితోనే అతడికి సన్నిహిత సంబంధాలు
  పోలీసు అధికారులుగా అనుమానాలు
లోతుగా ఆరా తీస్తున్న సిట్‌
నాటి నేరాల్లో ‘లొంగుబాట్ల’పైనా సమీక్ష

సాక్షి, హైదరాబాద్‌
కరడుగట్టిన నేరగాడు నయీమ్‌ కేసు దర్యాప్తులో భాగంగా అతడి డెన్స్‌ నుంచి స్వాధీనం చేసుకున్న డైరీలు, పుస్తకాలను పోలీసు వర్గాలు విశ్లేషిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే కోడ్‌ రూపంలో అనేక పదాలు, పేర్లు బయటకు వస్తుండడంతో వాటిని డీ–కోడ్‌ చేయడంపై దృష్టి కేంద్రీకరించాయి. పోలీసు–రాజకీయ–వ్యాపార ప్రముఖులతో సంబంధాలు కొనసాగించిన నయీమ్‌ ప్రతి ఒక్కరికీ ఒక్కో మారుపేరు (కోడ్‌ నేమ్‌) పెట్టుకున్నాడు. వారందరికీ తాను ఎలా ఉపయోగపడింది, వారిని తాను ఎలా వాడుకుంది అన్న అంశాలను డైరీల్లో రాసుకున్నాడు. నయీమ్, అతడి అనుచరుల స్థావరాలపై దాడులు చేస్తున్న పోలీసు, సిట్‌ అధికారులు వీటిని స్వాధీనం చేసుకొని విశ్లేషిస్తున్నారు. పుప్పాలగూడ అల్కాపురి టౌన్‌షిప్‌లోని నయీమ్‌ ఇంట్లో బెడ్‌రూమ్‌ను తనిఖీ చేసిన పోలీసులు ఓ కీలకమైన డైరీతో పాటు ఆల్బమ్‌ను స్వాధీనం చేసుకున్న సంగతి తెలిసిందే.

ఎవరా ఇద్దరు..?
నయీమ్‌ ఇంటి నుంచి స్వాధీనం చేసుకున్న డైరీలో ఇద్దరి పేర్ల ప్రస్తావన ఎక్కువగా ఉంది. అనేక సందర్భాలను వివరిస్తూ ‘చింటు సార్‌’, ‘టెర్రర్‌ బాస్‌’ అని పేర్కొన్నాడు. వీరిద్దరితోనే నయీమ్‌ అత్యంత సన్నిహితంగా మెలిగినట్లు అధికారులు అనుమానిస్తున్నారు. డైరీలో ఉన్న వివరాల ఆధారంగా వారిద్దరూ పోలీసు అధికారులే అయి ఉంటారని భావిస్తు న్నారు. ఈ ఇద్దరిలో ‘టెర్రర్‌ బాస్‌’ కంటే ‘చింటు సార్‌’తోనే నయీమ్‌ అత్యంత దగ్గరగా మెలిగాడని, ఆయనకే ‘విలువైన గిఫ్ట్‌’లు ఇచ్చాడని డైరీలో ఉన్న వివరాలను బట్టి తెలుస్తోందని అధికారులు చెబుతున్నారు.

‘వడపోతల‘పై అధికారుల దృష్టి
నయీమ్‌తో అంటకాగిన, అతడి అక్రమాలకు సహకరిస్తూ లబ్ధి పొందిన పోలీసుల్ని గుర్తించడం కోసం అధికారులు వడపోత ప్రక్రియ చేపట్టారు. ఈ ఘరానా నేరగాడు ఉద్యమం నుంచి బయటకు వచ్చిన తర్వాత మావోయిస్టులకు వ్యతిరేకంగా పనిచేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే పోలీసు, నిఘా వర్గాలకు దగ్గరై సుదీర్ఘకాలం ఇన్‌ఫార్మర్‌గా పని చేశాడు. ఈ క్రమంలో కొందరు అధికారులు అతడితో సంబంధాలు కొనసాగించి, కొన్ని రకాలైన సహాయాలు చేసే అవకాశం ఉంది. ఇదంతా పోలీసింగ్‌లో భాగమే అంటున్న అధికారులు మరో కోణంపై దృష్టి పెట్టారు. ఇన్‌ఫార్మర్‌ నుంచి గ్యాంగ్‌స్టర్‌గా మారుతున్న సందర్భంలో.. అతడికి సహకరించడం, అతడి ద్వారా లబ్ధి పొందడం, అరాచకాలను చూసీచూడనట్లు వదిలేయడం మాత్రం నేరమేనని స్పష్టం చేస్తున్నారు. నయీమ్‌ డైరీలో అలాంటి అధికారులు ఎవరున్నారు? ఎలా వ్యవహరించాన్న అంశంపై పోలీసులు దృష్టి సారించారు.

ఆ లొంగుబాట్ల వెనుకా పోలీసులు?
నల్లగొండ జిల్లాల్లో హత్యకు గురైన సాంబశివుడు, రాములుతోపాటు హైదరాబాద్‌లో పట్టపగలు నడిరోడ్డుపై హత్యకు గురైన పటోళ్ల గోవర్ధన్‌రెడ్డి వరకు దాదాపు ప్రతి కేసులో నయీమ్‌ పాత్ర ప్రత్యక్షంగానో, పరోక్షంగానే ఉంది. అలాగే ఇతడు చేయించిన దారుణాల తర్వాత నిందితులు నేరుగా పోలీసుల వద్దకు వచ్చి లొంగిపోవడం పరిపాటి. నేరాలు చేసేది ఒకరైతే... వారిని కాపాడటం కోసం వాటిని తమపై వేసుకుని లొంగిపోయేది వేరొకరని ఎప్పట్నుంచో వినిపిస్తోంది. ప్రస్తుతం నయీమ్‌ వెనుక ఉన్న ‘షాడోలను’ గుర్తించేందుకు పోలీసు విభాగం.. ఇలాంటి లొంగుబాట్లపై దృష్టిపెట్టింది. ఆయా నేరాలు ఎక్కడ జరిగాయి? కేసులు ఎక్కడ నమోదయ్యాయి? నిందితులు ఎక్కడ లొంగిపోయారు? ఎవరి ద్వారా పోలీసుల ఎదుటకు వచ్చారు? తదితర అంశాలను విశ్లేషించాలని నిర్ణయించారు. దీని ద్వారా నయీమ్‌కు సహకరించిన వారిని గుర్తించే ఆస్కారం ఏర్పడుతుందని అధికారులు చెబుతున్నారు. దీంతో పాటు నయీమ్‌ నుంచి స్వాధీనం చేసుకున్న ఆల్బమ్స్‌లో ఉన్న ఫొటోల్లోని వ్యక్తులు/అధికారులను గుర్తిస్తున్నారు. ఆ ఫొటో దిగిన సందర్భం, వారితో నయీమ్‌కు ఉన్న సంబంధాలపై స్పష్టత వచ్చాక తదుపరి చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement