నెలకు ఐదు లీటర్ల పెట్రోల్ ఫ్రీ..!
ప్రామాణిక డ్రైవింగ్ లైసెన్స్ ఉన్న ప్రతి విద్యార్థికి నెలకు ఐదు లీటర్ల పెట్రోల్ ఉచితంగా ఇస్తాం.. కాంగ్రెస్ పార్టీ
రాష్ట్రమంతటా ఉచితంగా వై-ఫై సేవలు అందిస్తాం.. ఆమ్ ఆద్మీ పార్టీ
రాష్ట్రమంతటా నిరంతర విద్యుత్ సదుపాయాన్ని కల్పిస్తాం. హైస్పీడ్ బ్రాడ్‌బ్యాండ్ ఇంటర్నెట్ సేవలు అందిస్తాం.. బీజేపీ..
ఈ రోజు ఎన్నికలు జరుగుతున్న గోవాలో ప్రజలను ఆకట్టుకునేందుకు ప్రధాన రాజకీయ పార్టీలు ఇచ్చిన ఉచిత హామీలు ఇవి. పదిలక్షలకుపైగా ఓటర్లు, 40 అసెంబ్లీ స్థానాలు ఉన్న గోవాలో అధికార బీజేపీకి మరోసారి పట్టం కట్టాలా? లేక మార్పును స్వాగతించాలా? అన్నది శనివారం ఓటర్లు తేల్చబోతున్నారు. దేశంలో అత్యంత సంపన్న రాష్ట్రం (2014-15 తలసరి ఆదాయపరంగా), దేశంలో అక్షరాస్యతలో నాలుగో స్థానంలో ఉన్న రాష్ట్రం గోవా.
గోవాలోని విద్యావంతులైన ఓటర్లను ఆకట్టుకునేందుకు ప్రధాన రాజకీయ పార్టీలు తమ మ్యానిఫెస్టోల ద్వారా చాలా గట్టిగానే ప్రయత్నించాయి. సోషల్ మీడియాలో వీడియోల ద్వారా ప్రచారం చేస్తున్న బీజేపీ.. రాష్ట్రంలో రవాణా సదుపాయాలు పెంపొందిస్తామని, నార్త్ గోవాలోని మోపాలో కొత్త అంతర్జాతీయ విమానాశ్రయం కట్టడం ద్వారా నిరుద్యోగాన్ని రూపుమాపుతామని ప్రకటించింది. అటు ప్రధాన ప్రత్యర్థులుగా బరిలోకి దిగిన ఆప్, కాంగ్రెస్ పార్టీలు కూడా ఓటర్లను ఆకట్టుకునేందుకు పెద్ద ఎత్తున హామీలను గుప్పించాయి. స్థానిక గిరిజనులను మోసం చేసి మోపాలో భూసేకరణ చేపట్టారని ఈ రెండు పార్టీలు ఆరోపిస్తున్నాయి. తాను అధికారంలో వస్తే మోపాలో భూసేకరణను నిలిపేసి తదుపరి విచారణ చేపడతామని ఒక అడుగు ముందుకేసి ఆప్ ప్రకటించింది.