ఇక 6 లక్షల ఆదాయం ఉంటేనే కార్ లోన్
ఇక 6 లక్షల ఆదాయం ఉంటేనే కార్ లోన్
Published Thu, Sep 12 2013 1:08 AM | Last Updated on Fri, Sep 1 2017 10:37 PM
న్యూఢిల్లీ: వార్షిక ఆదాయం ఆరు లక్షల రూపాయలకన్నా తక్కువవుండే వారు ఇకపై స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) నుంచి కారు రుణాన్ని పొందలేరు. ఈ మేరకు కారు రుణాల మంజూరీ అర్హత నిబంధనలను బ్యాంక్ కఠినతరం చేసింది. వేతనజీవులకు ఇప్పటివరకూ రూ.2.5 లక్షలుగా ఉన్న వార్షిక ఆదాయ పరిమితిని రూ.6 లక్షలకు పెంచింది. ఇందుకు సంబంధించి ఇప్పటికే బ్యాంక్ ఒక సర్క్యులర్ జారీ చేసింది. డిఫాల్ట్ అవకాశాలను తగ్గించుకునే ఉద్దేశంతో ఇందుకు సంబంధించిన నిబంధనలను కఠినతరం చేసినట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. రుణం కోసం ప్రత్యేకంగా తెరిచే అకౌంట్ విషయంలో వార్షిక ఆదాయ పరిమితి రూ.6 లక్షలయితే, అప్పటికే ఎస్‌బీఐ అకౌంట్ హోల్డర్ అయితే వార్షిక ఆదాయ పరిమితి రూ.4.5 లక్షలు. 10.45 శాతం వడ్డీరేటుకు ఎస్‌బీఐ ప్రస్తుతం కారు రుణాలను ఆఫర్ చేస్తోందని బ్యాంక్ వెబ్‌సైట్ తెలిపింది.
క్లిష్ట ఆర్థిక పరిస్థితులే కారణం...
ప్రస్తుత ఆర్థిక వ్యవస్థ క్లిష్ట పరిస్థితుల నేపథ్యంలో ‘ఎగవేతల’ అవకాశాన్ని కనీస స్థాయికి తగ్గించాలన్న లక్ష్యంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఒక సీనియర్ అధికారి వెల్లడించారు. బ్యాంక్ ఆటో రుణ పోర్ట్‌ఫోలియో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికం ముగిసే నాటికి 2012-13 ఇదే కాలంతో పోల్చితే 38.71 శాతం పెరిగి రూ.26,411 కోట్లుగా ఉంది. బ్యాంక్ మార్కెట్ వాటా ఈ విషయంలో 2.44 శాతం నుంచి 2.91 శాతానికి పెరిగింది. కాగా స్థూల మొండి బకాయిల (ఎన్‌పీఏ) పరిమాణం ఇదే కాలంతో 4.99 శాతం నుంచి 5.56 శాతానికి చేరింది. ఇక నికర మొండి బకాయిల పరిమాణం 2.22 శాతం నుంచి 2.83 శాతానికి ఎగసింది.
Advertisement
Advertisement