
'మా రక్తం తీసుకోండి.. హోదా ఇవ్వండి'
డాబాగార్డెన్స్(విశాఖ): 'మా రక్తాన్ని తీసుకోండి.. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వండి' అని ప్రధాని నరేంద్ర మోదీని కోరనున్నట్లు ప్రత్యేక హోదా, విభజన హామీల సాధన సమితి రాష్ట్ర అధ్యక్షుడు చలసాని శ్రీనివాస్ తెలిపారు. ప్రత్యేక హోదా విషయంలో కేంద్ర ప్రభుత్వ నిర్లిప్త వైఖరికి నిరసనగా ఈ నెల 30న విజయవాడలో విద్యార్థులు, మేధావులు, యువకులు.. అన్ని వర్గాల ప్రజలతో రక్తదాన శిబిరం నిర్వహించి బ్లడ్‌బ్యాంకుల ద్వారా దాన్ని ప్రధాని మోదీకి పంపి నిరసన తెలపనున్నామన్నారు. విశాఖపట్నంలో శనివారం విలేకరులతో మాట్లాడిన ఆయన.. హోదా కోసం వివిధ రూపాల్లో అలుపెరగని పోరాటం చేస్తున్నా చంద్రబాబు, నరేంద్ర మోదీ ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదని, అందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. హోదా ఇవ్వమని మాటిమాటికీ ఢిల్లీకి వచ్చి అడుక్కోలేమని, తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని కించపరచొద్దని కోరారు.
విభజన సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయాలని కోరుతున్నామే తప్ప.. కేంద్రం వేసే భిక్ష మాకక్కర్లేదని చలసాని అన్నారు. తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత తన రాష్ట్రంలో కూర్చునే దర్జాగా కేంద్రం నుంచి అన్నీ సాధించుకుంటుంటే.. కేంద్ర ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న తెలుగుదేశం పార్టీ ఏ ఒక్క హామీ సాధించలేకపోతోందని ఎద్దేవా చేశారు. రెండేళ్లపాటు చంద్రబాబు మాట విన్నామని, కానీ బాబు మాటలకు అర్థం లేకుండా పోయిందని, ఇక నుంచైనా ప్రత్యేక హోదా కోసం కేంద్రంపై ఒత్తిడి తేవాలన్నారు. కేంద్రంలో ఉన్న టీడీపీ మంత్రులు, ఎంపీలను బయటకు తెచ్చి మరింత ఒత్తిడి తెస్తేనే బాగుంటుందని సూచించారు. తెలంగాణ వారు కూడా ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా సాధనకు మద్దతు తెలిపారన్నారు. సినిమా నటులందరూ ప్రత్యేక హోదా కోసం ఉద్యమించాలని విజ్ఞప్తి చేశారు.
ప్రొఫెసర్ అప్పలనాయుడు మాట్లాడుతూ మోదీ సాయం చేస్తారనుకుంటే భిక్షం వేసినట్లు నిధులు కేటాయిస్తున్నారని మండిపడ్డారు. అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసి ప్రత్యేక హోదా, వెనుకబడిన జిల్లాలకు ప్రత్యేక ప్యాకేజీ, విశాఖ కేంద్రంగా రైల్వేజోన్, కడపలో స్టీల్‌ప్లాంట్, విశాఖ-చెన్నై కారిడార్‌కు ప్రత్యేక నిధులు కేటాయించాలన్నారు. ప్రత్యేక హోదా ఉద్యమం చచ్చిపోలేదని, మరింత ఉధృతం చేస్తామని స్పష్టం చేశారు. సమావేశంలో సమితి విశాఖ జిల్లా కన్వీనర్ ఏజే స్టాలిన్, ప్రభుత్వ వైద్యుల సంఘం ప్రతినిధి శ్యాంసుందర్, దేవరకొండ మార్కండేయలు, సురేష్, గోపి పాల్గొన్నారు.