
సవరణలకు పట్టుపడతాం
తెలంగాణ బిల్లుపై వెంకయ్యనాయుడు వెల్లడి
రాష్ట్ర విభజనకు కట్టుబడి ఉన్నాం.. అయితే సీమాంధ్రకు న్యాయం జరగాలి
సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్ర విభజన కోసం కేంద్ర ప్రభుత్వం రూపొందించిన ఆంధ్రప్రదేశ్ పునర్‌వ్యవస్థీకరణ బిల్లు అసమగ్రంగా ఉందని బీజేపీ మండిపడింది. బిల్లుకు రూపకల్పన చేసే సమయంలో కేంద్రం అవకాశవాదం, అపరిపక్వత, అజ్ఞానంతో వ్యవహరించిందని దుయ్యబట్టింది. విభజనపై లోతుగా అధ్యయనం చేయలేదని, ప్రజలను, పార్టీలను, చివరికి సొంత పార్టీ సీఎం, ఎంపీలు, మంత్రులు, ఎమ్మెల్యేలను కూడా విశ్వాసంలోకి తీసుకోలేదని విమర్శించింది. తాము రాష్ట్ర విభజనకు కట్టుబడి ఉన్నామని, అదే సమయంలో సీమాంధ్ర ప్రజలకు న్యాయం చేసేలా బిల్లులో మార్పుచేర్పులు చేయాలని, పార్లమెంట్ ముందుకు బిల్లు వచ్చినప్పుడు సవరణలకు పట్టుపడతామని స్పష్టంచేసింది. విభజన బిల్లులో సీమాంధ్రకు న్యాయం చేసేలా బిల్లులో సవరణలు చేయాలని డిమాండ్ చేస్తూ ఆ ప్రాంత బీజేపీ నేతలు సోమవారం ఢిల్లీలో నిర్వహించిన ధర్నాలో పార్టీ జాతీయ నాయకుడు ఎం.వెంకయ్య నాయుడు ఈ మేరకు వెల్లడించారు.
‘‘రాష్ట్రాన్ని విభజించాలన్న బీజేపీ వైఖరి మారలేదు. విభజన సున్నితమైన సమస్య. దీన్ని ఎన్నికలతో ముడిపెట్టవద్దు. సీమాంధ్ర అభివృద్ధికి సంబంధించి బీజేపీ చేసే సూచనల్లో మంచిని, సాధ్యాసాధ్యాలను పరిగణనలోకి తీసుకొని కేంద్రం బిల్లులో మార్పులు తేవాలి. పార్లమెంటులో బిల్లు వచ్చినప్పుడు సవరణలకు గట్టిగా పట్టుపడతాం’’ అని ఆయన అన్నారు. విభజన విషయంలో కేంద్రం శాంతియుత పరిష్కారం కనుక్కోవాలని, కేంద్రం ఒక అడుగు ముందుకు వెళ్లి సీమాంధ్రలో రాజధాని ఎక్కడ ఏర్పాటు చేయాలన్నది బిల్లులో పొందుపరచాలని సూచించారు. బీజేపీ సీమాంధ్ర నేత హరిబాబు మాట్లాడుతూ.. తెలంగాణ బిల్లులో సీమాంధ్రకు నష్టం చేసే అంశాలను సవరించాలని డిమాండ్ చేస్తున్నట్లు తెలిపారు. నేతలు, కార్యకర్తలు తొలుత ఏపీభవన్ నుంచి ర్యాలీగా జంతర్ మంతర్‌కు చేరుకున్నారు. ఈ కార్యక్రమంలో సీమాంధ్ర నేతలు సోము వీర్రాజు, శాంతారెడ్డి, పార్థసారధి, విష్ణువర్ధన్‌రెడ్డి, శ్యాంకిషోర్ తదితరులు పాల్గొన్నారు.
వెంకయ్యనాయుడు ఏమన్నారో క్లుప్తంగా...
తెలంగాణ ఏర్పాటుపై కాంగ్రెస్‌కు చిత్తశుద్ధి లేదు. పాలనా సౌలభ్యం కోసం రాష్ట్రాన్ని విభజించకుండా, మనుషులను విభజిస్తోంది.
తెలంగాణపై హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన వారు 2004 నుంచి 14 వరకు పదేళ్ల పాటు ఏం చేస్తున్నట్టు?
విభజనలో సీమాంధ్రులకు అన్యాయం చేయకూడదు. వారి అపోహలు, భయాలను నివృత్తి చేయాల్సిన బాధ్యత కేంద్రంపైనే ఉంది. తెలంగాణలోని సీమాంధ్ర ప్రజలకు భద్రత కల్పించాలి. బిల్లులోని కొన్ని అంశాలను తెలంగాణ వారు కూడా వ్యతిరేకిస్తున్నారు.
ఉద్దేశాలను బిల్లులో పెడితే ప్రజలకు విశ్వాసం కలుగదు. సీమాంధ్రలో కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలను ఏర్పాటు చేయాలి. ఐఐటీ, కేంద్రీయ విద్యా సంస్థలు, వ్యవసాయ, ఉద్యాన వర్సిటీలు, పలు కేంద్ర సంస్థలను సీమాంధ్రలో ఏర్పాటు చేస్తామని బిల్లులో స్పష్టంగా పేర్కొనాలి.
విజయవాడ, విశాఖపట్నం విమానాశ్రయాలకు అంతర్జాతీయ గుర్తింపు కల్పించాలి. సీమాంధ్రలో ఇండస్ట్రియల్ కారిడార్ ఏర్పాటు చేయాలి. తెలంగాణలో వెనుబడిన ప్రాంతాల్లో కూడా ఈ కారిడార్ ఏర్పాటు చేయాలి. పరిశ్రమలు పెట్టే వారిని ప్రోత్సహించేందుకు పదేళ్లపాటు టాక్స్ హాలిడే ప్రకటించాలి.
పోరులు అనుసంధానం చేయాలి. పోలవరంకు చిక్కులు ఏర్పడకుండా భూసేకరణ చేయాలి.
రాజ్‌నాథ్‌ను కలసిన జీవిత, రాజశేఖర్
సినీనటులు జీవిత, రాజశేఖర్ సోమవారం సీనియర్ నేత బండారు దత్తాత్రేయ సమక్షంలో ఢిల్లీలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు రాజ్‌నాథ్ సింగ్‌ను కలిశారు. అనంతరం జీవిత, రాజశేఖర్ మీడియాతో మాట్లాడుతూ తామింకా పార్టీలో చేరలేదని చెప్పారు. భవిష్యత్‌లో చేరతామన్నారు. కాంగ్రెస్ మాజీ ఎంపీ గడ్డం ఆత్మచరణ్ రెడ్డి, కెప్టెన్ కరుణాకర్‌రెడ్డిలు రాజ్‌నాథ్ సింగ్‌ను కలిశారు.