
బీజేపీ, కాంగ్రెస్ రహస్య మంతనాలు
న్యూఢిల్లీ: పార్లమెంట్ లో తెలంగాణ బిల్లు ఆమోదం పొందేందుకు వీలుగా బీజేపీ మద్దతు కూడగట్టేందుకోసం కాంగ్రెస్ చర్చలు కొనసాగిస్తోంది. బీజేపీ నాయకుడు వెంకయ్య నాయుడితో కాంగ్రెస్ నాయకులు శుక్రవారం రహస్య మంతనాలు సాగించారు. ఈ భేటీలో అహ్మద్ పటేల్, దిగ్విజయ్ సింగ్ పాల్గొన్నట్టు సమాచారం.
హైదరాబాద్ సహా పలు అంశాలపై వీరు చర్చించినట్టు రాజకీయ వర్గాలు వెల్లడించాయి. సీమాంధ్రుల సమస్యలను పరిష్కరించకుండా రాష్ట్ర విభజనపై కాంగ్రెస్ వ్యవహరిస్తున్న తీరును బీజేపీ అగ్రనాయకులు విమర్శిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో వీరు భేటీ కావడం ప్రాధాన్యం సంతరించుకుంది. హైదరాబాద్ రెవెన్యూ సహా సీమాంధ్రకు కొత్త రాజధాని, ప్యాకేజీ తదితర విషయాలపై వెంకయ్యతో కాంగ్రెస్ నేతలు చర్చించినట్టు సమాచారం.