తెలంగాణ చరిత్రకే పెద్దపీట
చరిత్రపై పట్టుతోనే విజయం సాధ్యం
- ఉద్యమంలో ఉన్నవారే సిలబస్ కమిటీ మెంబర్లు
- గ్రూప్స్‌పై అవగాహన సదస్సులో ప్రముఖ విద్యావేత్త చుక్కారామయ్య
- ‘సాక్షి’ కృషి అభినందనీయం
సిద్దిపేట రూరల్/ సిద్దిపేట టౌన్/ సిద్దిపేట జోన్: సిలబస్ ఎంపికలో తెలంగాణ చరిత్రపైన రాష్ట్ర ప్రభుత్వం ఎక్కువగా దృష్టి పెట్టిందని, పోటీ పరీక్షల్లో తెలంగాణ చరిత్రకు ప్రాముఖ్యత ఉంటుందని ప్రముఖ విద్యావేత్త చుక్కారామయ్య స్పష్టం చేశారు. తెలంగాణ ఉద్యమంలో భాగస్వామ్యులైన 32మంది మేధావులతో కమిటీ వేసి, తెలంగాణ చరిత్ర సిలబస్‌ను మదింపు చేసినట్లు ఆయన తెలిపారు. రాబోయే గ్రూప్స్ పరీక్షలలో విశ్లేషణాత్మక విషయాలపై ప్రశ్నలు రావచ్చని రామయ్య వివరించారు. మంగళవారం మెదక్‌జిల్లా సిద్దిపేటలో ‘సాక్షి’ భవిత అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు.
కొన్నేళ్లుగా ఎలాంటి నోటిఫికేషన్లు లేకపోవడంతో నిరుద్యోగులు ఉద్యోగాల కోసం ఎంతో ఆశతో ఎదురు చూస్తున్నారని పేర్కొన్నారు. ఉద్యోగం సాధించాలంటే ఎన్నో అవరోధాలు అధిగమించాల్సి ఉంటుందని చెప్పారు. ప్రభుత్వ యంత్రాగం ద్వారా ప్రజలకు సేవ చేయడం అదృష్టమన్నారు. ఉద్యోగాన్ని సాధించాలంటే పట్టుదల ఎంతో ముఖ్యమని చెప్పారు. గ్రూప్స్‌లో విజయం సాధించాలంటే తెలంగాణ చరిత్రను ఔపోసన పట్టాలన్నారు. గ్రూప్స్ కోసం సిద్ధం అయ్యే అభ్యర్థులు ముందుగా తమ నడవడికను సరిచేసుకోవాలని సూచించారు. ఉద్యోగాలకు ఎంపికైన వారు నా రాష్ట్రం, నా ఊరు అనే పద్ధతిలో పని చేయాలన్నారు.
ఎలాంటి ఉద్యోగం అయినా అవకాశం అందిపుచ్చుకోవడమే ముఖ్యమన్నారు. పరీక్ష సిలబస్‌లో ఎక్కువ మార్పులు చేయొద్దని తమ కమిటీ ప్రభుత్వానికి సూచిందన్నారు. ప్రస్తుత టెక్నాలజీకి అనుగుణంగా రాబోయే రోజుల్లో దరఖాస్తులు పట్టుకుని కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం ఉండదన్నారు. సెల్‌ఫోన్‌లో సమస్య చెబితే స్పందించే కొత్త తరం రూపుదిద్దుకోవాలని ఆకాంక్షించారు. అమెరికా లాంటి దేశాలల్లో జరుగుతున్న పని విధానాన్ని ఇక్కడ అవలంబిస్తే తిరుగులేని ఫలితాలు పొందుతామన్నారు. ఇదంతా టెక్నాలజీని అందిపుచ్చుకుంటేనే సాధ్యమవుతుందని వివరించారు. విద్యార్థుల భవిష్యత్ కోసం సాక్షి చేస్తున్న ప్రయత్నం అభినందనీయమన్నారు.
తెలంగాణకు తీరని అన్యాయం జరిగింది
సైమైక్య రాష్ట్రంలో తెలంగాణకు తీరని అన్యాయం జరిగిందని రాజకీయ విశ్లేషకులు వి. ప్రకాష్ అన్నారు. ఎన్నో కలలతో పోరాడి సాధించుకున్న తెలంగాణను అభివృద్ధి చేసుకోవాల్సిన బాధ్యత మన అందరిపై ఉందన్నారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత జరగబోయే మొట్టమొదటి గ్రూప్ పరీక్షపై యావత్ తెలంగాణ సమాజం దృష్టి సారించిందన్నారు. పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యే అభ్యర్థులు ప్రణాళికాబద్ధంగా చదువుతూ ముందుకు సాగాలన్నారు. తెలంగాణ చరిత్రను పూర్తిగా అవగాహన చేసుకుని గ్రూప్స్ పరీక్షలకు సిద్ధం కావాలన్నారు. సమైక్య రాష్ట్రంలో జరిగిన పరీక్షలకు నేడు జరగనున్న పరీక్షలకు వ్యత్యాసం ఉంటుందని చెప్పారు. కేవలం తెలంగాణ చరిత్రను అవగాహన చేసుకున్న వారికి మాత్రమే విజయం సులువవుతుందని ప్రకాష్ తెలిపారు.
వాటిపై పట్టు సాధిస్తేనే..
గ్రూప్స్ పరీక్షల్లో కరెంట్ ఎఫైర్స్ సబ్జెక్ట్ ఎంతో కీలకమైందని దాన్ని నేర్చుకోవాలనే తపన అభ్యర్థుల్లో ఉండాలని కరెంట్ ఎఫైర్స్ నిఫుణులు కుమార్ అన్నారు. పరీక్షకు సన్నద్ధం అయ్యే దశలో ఒక్కో అంశంపై లోతుగా పరిశీలన చేసినప్పుడు విజయం సాధ్యమన్నారు. అలాగే ప్రతి సబ్జెక్ట్‌పై విశ్లేషణ చేసుకోవాలన్నారు. నిరంతరం జరుగుతున్న పరిణామాలను ఎప్పటికప్పుడు ప్రచార సాధనాల ద్వారా గమనించాలన్నారు. పరీక్షలో వచ్చే ప్రశ్నలు విభిన్న రకాలుగా ఉంటాయని వాటిని జాగ్రత్తగా పరిశీలించి సమాధానం ఇవ్వాలన్నారు. అంతర్జాతీయ, జాతీయ, రాష్ట్రీయ అనే అంశాలపై పట్టు సాధిస్తే అరవై శాతం విజయం సాధించినట్లేనని చెప్పారు. కార్యక్రమంలో సాక్షి ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ దిలీప్‌రెడ్డి, సాక్షి రెసిడెంట్ ఎడిటర్ ధనుంజయ్‌రెడ్డి తదితరులు మాట్లాడారు.