రాజధాని ప్రణాళికలో మార్పులు | The capital plan In Changes | Sakshi
Sakshi News home page

రాజధాని ప్రణాళికలో మార్పులు

Published Wed, Sep 16 2015 2:39 AM | Last Updated on Tue, May 29 2018 11:47 AM

రాజధాని ప్రణాళికలో మార్పులు - Sakshi

రాజధాని ప్రణాళికలో మార్పులు

సీఆర్‌డీఏ సమావేశంలో చంద్రబాబు ఆదేశం
* రాజధాని రీజియన్‌లో 8 జోన్లు
* కొత్తగా అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీలు
సాక్షి, విజయవాడ బ్యూరో: అర్బన్ ప్లానింగ్ నిపుణుల సూచనల మేరకు సింగపూర్ ప్రభుత్వం ఇచ్చిన రాజధాని మాస్టర్‌ప్లాన్‌లో మార్పులు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు సీఆర్‌డీఏ అధికారులను ఆదేశించారు. మంగళవారం తన క్యాంపు కార్యాలయంలో సీఆర్‌డీఏ అధికారులతో రాజధాని వ్యవహారాలపై ఆయన సమీక్ష నిర్వహించారు.

అనంతరం ఆ వివరాలను మంత్రి నారాయణ మీడియాకు వెల్లడించారు. మార్పుల తర్వాత రెండు నెలల్లో రాజధాని తుది ముసాయిదా ప్రణాళిక నోటిఫికేషన్‌ను విడుదల చేస్తామన్నారు. రాజధాని రీజియన్‌లో 8 జోన్లు ఏర్పాటు చేసి ఒక్కో దాన్ని ఒక్కోరకంగా అభివృద్ధి చేయనున్నట్లు తెలిపారు. శాటిలైట్ మ్యాప్‌ల ఆధారంగా మాస్టర్‌ప్లాన్ 7,420 చదరపు కిలోమీటర్లలో విస్తరించి ఉందని, దీన్ని సర్వే నెంబర్లతో సరిపోల్చితే 7,317.15 చదరపు కిలోమీటర్లు వచ్చిందని తెలిపారు.

రాజధాని రీజియన్‌లో 55.05 లక్షల జనాభా ఉన్నారని రాబోయే రోజుల్లో ఇది ఇంకా పెరగనున్న దృష్ట్యా వసతులు మెరుగుపరచాలని సూచించారు. కొత్తగా ఉభయగోదావరి జిల్లాలను కలిపి గోదావరి, కర్నూలు, అనంతపురం అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీల ఏర్పాటు చేయడానికి సీఎం అంగీకరించారు.
 
మూడు మొబైల్ కంపెనీలతో ఎంఓయూ
చిత్తూరు జిల్లా రేణిగుంటలో మొబైల్ ఫోన్ల తయారీ యూనిట్లు ఏర్పాటు చేసేందుకు సెల్‌కాన్, కార్బన్, మైక్రోమ్యాక్స్ కంపెనీలతో మం గళవారం ప్రభుత్వం ఎంఓయూ కుదుర్చుకుం ది. ప్రభుత్వం తరఫున సీఎం సమక్షంలో పరిశ్రమల శాఖ కమిషనర్ కార్తికేయ మిశ్రా, ఆయా కంపెనీలతో ఒప్పం దాలపై సంతకాలు చేశారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ ఈ మూడు కంపెనీల వల్ల ఏడువేల మందికి ఉద్యోగాలు వస్తాయని చెప్పారు.

రేణిగుంటలోని ఈ మొబైల్ ఫోన్ల తయారీ యూనిట్ల క్లస్టర్ విమానాశ్రయానికి ఎదురుగానే ఉంటుందని దీనివల్ల చాలా ఉపయోగాలుంటాయన్నారు. త్వరలో ఏపీ హార్డ్‌వేర్ హబ్‌గా మారుతుందన్నారు. హార్డ్‌వేర్ తయారీ యూనిట్ల ఏర్పాటుకు ఎటువంటి వాతావరణం ఉండాలనే దానిపై అధ్యయనం చేసి నివేదిక ఇచ్చేందుకు ప్రభుత్వ, ప్రైవేటు వ్యక్తులతో ఒక కమిటీని నియమిస్తున్నట్లు తెలిపారు.  
 
ఇంజనీర్లు సృజనాత్మకంగా ఆలోచించాలి
‘ఇంజనీర్లు సృజనాత్మకంగా ఆలోచించాలి. కొత్త టెక్నాలజీని అందిపుచ్చుకోవాలి. జల వనరులను సక్రమంగా సద్వినియోగం చేసుకునేందుకు సరికొత్త ఆలోచనలు చేయాలి’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు సూచించారు. విజయవాడలో మంగళవారం ఇంజినీర్ల దినోత్సవం జరిగింది. ముఖ్య అతిథిగా హాజరైన ముఖ్యమంత్రి రాష్ట్రం నలుమూలల నుంచి విచ్చేసిన ఇంజనీర్లనుద్దేశించి ప్రసంగించారు. వచ్చే ఏడాది కృష్ణానదికి 100 నుంచి 120 టీఎంసీల గోదావరి నీటిని తీసుకురానున్నామని సీఎం చెప్పారు.

బుధవారం పట్టిసీమ మొదటి పంపును ప్రారంభించి గోదావరి నీటిని కృష్ణాలో కలిపే పవిత్ర సంగమ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నామని సీఎం తెలిపారు. కృష్ణా-గోదావరి నదుల అనుసంధానంపై మిగతా రాష్ట్రాల్లో చర్చ మొదలైందనీ, కేవలం 5 నెలల 15 రోజుల్లో రెండు నదుల అనుసంధానం జరగడం విశేషమన్నారు.
 
పొగాకు కొనుగోళ్లకు చర్యలు: సీఎం
పొగాకు రైతుల సమస్యలపై ఈ నెల 18న కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌తో మాట్లాడి కొనుగోళ్లకు చర్యలు తీసుకుంటామని చంద్రబాబు హామీ ఇచ్చారు. విజయవాడలోని క్యాంపు కార్యాలయంలో మంగళవారం పొగాకు రైతులు సీఎంను కలిశారు. కేంద్రం ఒక పక్క పొగాకు ద్వారా క్యాన్సర్ వస్తుందని భయపెడుతూ మరోవైపు టొబాకో బోర్డు ద్వారా పంట సాగును ప్రోత్సహిస్తున్నామంటోందని రైతులు సీఎం దృష్టికి తెచ్చారు. రైతులు ధైర్యం కోల్పోవద్దని, పొగాకు రైతుల కుటుంబాలను పరామర్శించేందుకు వస్తున్న కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌తో ఈ విషయమై చర్చిద్దామని చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement