సౌదీలో మూకుమ్మడి అరెస్టులు
ముగిసిన క్షమాభిక్ష గడువు.. ఆందోళనలో కల్లివిల్లి కార్మికులు
మోర్తాడ్: సౌదీ అరేబియాలో అక్రమంగా ఉంటున్న కార్మికులను అక్కడి పోలీసులు అరెస్టు చేస్తున్నారు. ఇప్పటికే వివిధ దేశాలకు చెందిన దాదాపు 3 వేల మంది కార్మికులను అరెస్టు చేసినట్లు సమాచారం. తెలంగాణకు చెందిన సుమారు 350 మంది కార్మికులు పట్టుబడ్డట్లు కొందరు కార్మికులు ‘సాక్షి’కి ఫోన్‌లో చెప్పారు. సౌదీకి వర్క్ వీసాపై వెళ్లిన కార్మికులు కొన్ని కారణాల వల్ల కంపెనీ నుంచి బయటకు వచ్చి కల్లివిల్లిగా పని చేస్తున్నారు. మరి కొందరు విజిట్ వీసాపై వెళ్లి వీసా గడువు ముగిసిపోయినా అక్కడే ఉండి బయట ఏదో ఒక పని చేస్తున్నారు. సౌదీలో పనిచేసే వారిలో తెలంగాణ జిల్లాలకు చెందినవారు లక్ష మంది ఉన్నారు.
వీరిలో సుమారు 30వేల మంది చట్ట విరుద్ధంగా ఉంటున్నట్లు తెలుస్తోంది. నతాఖా చట్టం ప్రకారం సౌదీలో అక్రమంగా ఉంటున్న వారు స్వచ్ఛందంగా లొంగిపోతే వారికి ఔట్ పాస్‌ను జారీ చేసి వారి దేశాలకు పంపిస్తారు. అలాకాకుండా ఉంటే తనిఖీల్లో పట్టుబడితే ప్రభుత్వం అరెస్టు చేస్తుంది. ఈ క్రమంలో సౌదీ ప్రభుత్వం మరోసారి క్షమాభిక్షను అమలులోకి తీసుకొచ్చింది. గడువు కూడా ముగియడంతో వారంరోజులుగా సౌదీ పోలీసులు దాడులు చేస్తున్నారు. దీంతో కల్లివిల్లి కార్మికులు ఆందోళనకు గురైతున్నారు.