
పైపులతో ఉన్న పాప - మానవత్వంతో స్పందించినవారు పంపిన పాప ఫొటో
అందరిలానే అతడూ తన జీవిత గమనాన్ని మార్చే, తండ్రిగా ఒక కొత్త జీవితాన్ని మొదలుపెట్టే అవకాశం కోసం తన కలల ప్రపంచానికి ఒక ఊహా రూపాన్నిస్తూ.. ఎన్నో కలలతో, ఉద్విగ్నంతో, ఉత్తేజంతో తన కలల దారి వెంట పరుగులు తీశాడు. కానీ ఆ కలల దారిలో మొదటి అడుగే కుదుపు అయింది. ఆరు వారాల పాటు ఆ కుదుపులో ఏమాత్రం మార్పు లేదు. అన్ని రోజుల ఆ భయంకర కుదుపు తర్వాత ఇక ఆ దారి పూర్తిగా మూసుకుపోయింది. కన్న కలలన్నీ కళ్లముందే చిధ్రమైపోయాయి. 'కలలో కూడా ఎవ్వరికీ ఆ బాధ రాకుడద'నే పరిస్థితిలో ఉన్న అతడు అడిగిన ఒకే ఒక్క సహాయానికి కొన్ని వేల హృదయాలు స్పందించాయి.
ఓహియోకు చెందిన నాదన్ స్టెఫెల్‌కు మే 30న కూతురు జన్మించింది. అయితే తండ్రయిన ఆనందం మాత్రం అతడు పొందలేకపోయాడు. పుట్టుకతోనే కాలేయ వ్యాధితో బాధపడుతూన్న ఆ పాప బాగు కోసం ఎన్నో ప్రయత్నాలు చేశారు. ఆరు వారాల పాటు మృత్యువుతో పోరాడిన ఆ పాప, చివరికి జూలై 10న చనిపోయింది. ఆ తండ్రి మాత్రం పాప ఆలోచనల నుండి బయటకు రాలేకపోయాడు. కనీసం పాప ముఖాన్ని గుర్తు తెచ్చుకున్నా పైపులతో ఉన్న పాప ముఖమే తప్ప, అవేవీ లేకుండా స్వేచ్చగా ఉండే పాప ముఖాన్ని మాత్రం చూడలేకపోయాడు.
తన బాధనిలా వ్యక్తం చేశాడు. "ఆరు వారాల పాటు మృత్యువుతో నా కూతురు చేసిన పోరాటం విషాదాంతమయింది. తన జీవితకాలం మొత్తం ఆసుపత్రిలోనే ఉండడం వల్ల ఎప్పుడూ ఆక్సీజన్ పైపులు లేకుండా ఉన్న పాప ఫోటోలు చూడలేదు. ఆ ట్యూబుల్లేకుండా, స్వచ్చమైన తన ముఖాన్ని చూడాలనుంది. దయచేసి ఎవరైనా ఆ ట్యూబుల్లేకుండా తన ఫోటోను తయారుచేయగలరా?" అంటూ రెడ్డిట్.కాంలో పంచుకున్నాడు. ఆ ప్రకటనను చూసిన వెంటనే కొన్ని వేల హృదయాలు స్పందించాయి. ఫోటోషాప్ సాయంతో పూర్తిగా ట్యూబుల్లేకుండా తయారు చేసిన కొన్ని వందల ఫోటోలను అప్‌లోడ్ చేసి అతడి కోరికను నెరవేర్చారు.
వారందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ, "నేనడిగింది కేవలం నా కూతురు ఫోటో మాత్రమే. మీరు మాత్రం ప్రేమను, అభిమానాన్నీ పంచి మానవత్వాన్ని చాటుకున్నారు" అన్నాడు. అతడి కలలు చిధ్రమైనా కనీసం కలల్లోనైనా ఆ పాప బ్రతికే ఉంటుంది.