
భార్యపై కోపంతో పీఎస్‌కు వెళ్లి.. ఏసీపీకి పంచ్!
'గయ్యాళీ' భార్య నుంచి తప్పించుకోవడానికి ఎవరైనా ఎంత దూరం వెళుతారు?..
జైపూర్: 'గయ్యాళి' భార్య నుంచి తప్పించుకోవడానికి ఎవరైనా ఎంత దూరం వెళుతారు?.. జైపూర్‌లో ఓ వ్యక్తి ఏకంగా పోలీసు స్టేషన్‌కు వెళ్లాడు. వెళ్లి తనను జైలులో పెట్టాలని ప్రాథేయపడ్డాడు. అందుకు పోలీసులు ఒప్పుకోలేదు. అంతే అతనికి కోపం వచ్చేసింది. ఏకంగా ఏసీపీకే గట్టి పంచ్ ఇచ్చాడు. దెబ్బకు మనోడు జైల్లో పడ్డాడు. కోరిక నెరవేరి ఆనందంగా కటకటాలు లెక్కిస్తున్నాడు. భార్యకు దూరంగా ఉన్నందుకు ఉబ్బితబ్బిబ్బవుతున్నాడు. ఈ ఘటన జైపూర్‌లో జరిగింది.
30 ఏళ్ల యోగేశ్ గోల్యా అనే వ్యక్తి గురువారం షిప్పాపాత్ పోలీసు స్టేషన్‌కు వెళ్లాడు. 'నేను జైలుకు వెళ్లాలనుకుంటున్నా. నా భార్యను కొట్టాను. దయచేసి నన్ను జైల్లో పెట్టండి' అని పోలీసులను వేడుకున్నాడు. దీంతో బిత్తరపోవడం పోలీసుల వంతైంది. కాసేపటికే అతని భార్య కూడా పోలీసు స్టేషన్‌కు వచ్చింది. తనను కొట్టాడని భర్తపై కేసు పెట్టాలని కోరింది. ఇది కుటుంబ గొడవగా భావించిన పోలీసులు సామరస్యంగా పరిష్కరించాలని భావించారు. మాన్‌సరోవర్ ఏసీపీ దేశ్‌రాజ్ యాదవ్ ఇద్దరిని కూచోబెట్టి సద్దిచెప్పేందుకు ప్రయత్నించారు.
ఇంతలో ఆయన తన చేతిని యోగేశ్ భుజంపై వేసారు. అనూహ్యంగా యోగేశ్ ఎదురుతిరిగి ఏసీపీకి ముఖం మీద ఒక గట్టి పిడిగుద్దు విసిరారు. అంతే.. ఏసీపీ పెదవి చిట్లి రక్తం వచ్చింది. ఈ అనూహ్య ఘటనకు ఏసీపీతోపాటు పోలీసులు బిత్తరపోయి వెంటనే అతన్ని అరెస్టు చేశారు. భార్యాభర్తలిద్దరూ ఒకరిమీద ఒకరు కేసు పెట్టుకోవడానికి పోలీసు స్టేషన్‌కు వచ్చారని పోలీసులు తెలిపారు. ఈ సమయంలో రాజీ కోసం ఏసీపీ ప్రయత్నిస్తుండగా.. ఆయన ముఖంపై పంచ్ విసిరిన యోగేశ్.. 'ఇప్పటికైనా నేను జైలుకు వెళుతాను. నా భార్య నన్ను ఎంతో ఇబ్బంది పెడుతోంది' అని పదేపదే పేర్కొన్నట్టు వివరించారు.