లండన్/న్యూఢిల్లీ/ఛండీగఢ్: పంజాబ్‌లోని అమృత్‌సర్ స్వర్ణ దేవాలయంలో తిష్టవేసిన ఖలిస్థాన్ తీవ్రవాదుల్ని ఏరివేసేందుకు ఇందిరాగాంధీ హయాంలో 1984లో నిర్వహించిన ‘ఆపరేషన్ బ్లూస్టార్’ వ్యవహారంలో కొత్త కోణాలు వెలుగు చూశాయి. ఈ విషయంలో నాటి భారత ప్రధాని ఇందిరాగాంధీకి సలహా ఇచ్చేందుకు బ్రిటన్‌కు చెందిన స్పెషల్ ఎయిర్ సర్వీస్(ఎస్‌ఏఎస్) అధికారి ఒకరిని పంపేందుకు నాటి బ్రిటన్ ప్రధానమంత్రి మార్గరేట్ థాచర్ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్టు వెలువడిన వార్తలు రెండు దేశాల్లోనూ కలకలం సృష్టించాయి. దీంతో బ్రిటన్ ప్రధాని డేవిడ్ కామెరాన్ అత్యవసర దర్యాప్తునకు బుధవారం ఆదేశించారు. ఇందులో బ్రిటన్ జోక్యానికి సంబంధించి ఇంకా సాక్ష్యాలేవీ లభించకున్నా, ఈ ఉదంతంపై, అత్యంత సున్నితమైన ప్రభుత్వ పత్రాల విడుదలపై దర్యాప్తునకు ఆదేశించారు.
ఇదీ విషయం..: స్వర్ణదేవాలయంలో తిష్టవేసిన ఖలిస్థాన్ తీవ్రవాదులను ఏరివేసేందుకు 1984లో ఇందిరాగాంధీ చేపట్టిన ఆపరేషన్ బ్లూస్టార్ సందర్భంగా సైన్యం జరిపిన దాడిలో వెయ్యి మందికిపైగా ప్రాణాలు కోల్పోవడం, చివరికది ఇందిర హత్యకు దారి తీయడం తెలిసిందే. తీవ్రవాదుల ఏరివేతకు సలహా ఇవ్వాలని నాటి థాచర్ ప్రభుత్వాన్ని ఇందిర నాలుగు నెలల ముందే కోరినట్టు లండన్‌లోని నేషనల్ ఆర్కైవ్స్ విడుదల చేసిన పత్రాలు స్పష్టం చేశాయి. ‘ఎస్‌ఏఎస్ అధికారిని భారత్‌కు పంపగా ఆయన దాడి ప్రణాళికను రూపొందించారు. దాన్ని ఇందిర ఆమోదించారు’ అని వాటి ద్వారా వెల్లడైంది. దీనిపై అకాలీదళ్, బీజేపీ తీవ్రంగా స్పందించాయి. అకాలీదళ్ నేత నరేష్ గుజ్రాల్ బుధవారం ఛండీగఢ్‌లో మాట్లాడుతూ.. సిక్కులకు వ్యతిరేకంగా జరిగిన కుట్రను ఈ వ్యవహారం బహిర్గతం చేస్తోందన్నారు. దేశ అంతర్గత వ్యవహారాల్లో విదేశీ జోక్యాన్ని ఇది స్పష్టం చేస్తోందన్నారు. వాస్తవాలను వెల్లడించేందుకు ప్రభుత్వం ముందుకు రావాలని బీజేపీ నేత అరుణ్ జైట్లీ ఢిల్లీలో కోరారు.
‘ఆపరేషన్ బ్లూస్టార్’లో కొత్త కోణాలు!
Published Thu, Jan 16 2014 5:26 AM | Last Updated on Sat, Sep 2 2017 2:40 AM
Advertisement
Advertisement