
ఆన్‌లైన్‌లో వీడియో కలకలం
అహ్మదాబాద్: క్రికెట్ బెట్టింగ్ మాఫియా తనను చంపేస్తామని బెదిరిస్తోందని, సాయం చేయాలని దీపక్ ధాననీ అనే వ్యక్తి ప్రధాని మోదీని, రాజ్‌కోట్ పోలీసులను అర్ధిస్తున్న వీడియో ఆన్‌లైన్‌లో కలకలం రేపుతోంది. ఈ వీడియోను దీపక్ తన సెల్‌ఫోన్‌లో రికార్డు చేసిన అనంతరం అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు.
‘రాజ్‌కోట్‌లోని బుకీలు, నేరస్తులు నన్ను, నాకుటుంబాన్ని హతమారుస్తామని బెదిరిస్తున్నారు. నేను తీవ్రమైన తప్పు చేశాను. క్రికెట్‌లో బెట్టింగ్‌కోసం నా ఇంటిని సైతం అమ్మేశాను. ఇప్పుడు నాదగ్గర ఏమీ లేదు’ అని దీపక్ వాపోయాడు. సదరు బుకీ పేరును వీడియోలో వెల్లడించిన దీపక్ తాను ఇప్పటికే రూ.7 కోట్లు చెల్లించానని, ఇంకా రూ.1.7 కోట్లు బాకీ ఉన్నట్లు తెలిపాడు.
ఈ వీడియో వైరల్ కావడంతో రాజ్‌కోట్ పోలీసులు దీపక్ ఇంటికి రక్షణ కల్పించారు. ఇన్‌స్పెక్టర్ ఆర్‌ఆర్ సోలంకీ ఈ ఘటనపై మాట్లాడుతూ దీపక్ క్రికెట్ బుకీగా పనిచేస్తున్నాడని, గతంలోనూ చాలా కేసుల్లో అరెస్టయ్యాడని తెలిపారు.