ఎగువన కళకళ.. దిగువన వెలవెల
జూరాల (మహబూబ్‌నగర్): కృష్ణానదికి ఎగువ ప్రాంతంలోని నారాయణపూర్ ప్రాజెక్టు ఆయకట్టు పచ్చని పైర్లతో కళకళలాడుతుంటే.. దిగువన ఉన్న జూరాల ప్రాజెక్టు కింద నీటిచుక్క లేక పొలాలన్నీ బీళ్లుగా మారాయి. ప్రాజెక్టుల్లో పూర్తిస్థాయి నీటినిల్వ చేరే వరకు దిగువ ప్రాజెక్టులకు క్రస్టుగేట్ల ద్వారా నీటిని విడుదల చేసే అంశంపై స్పష్టమైన నిబంధనలు లేకపోవడంతో పై రాష్ట్రాలు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నాయి. దీంతో పై ప్రాజెక్టులలో నిండుగా నీళ్లున్నా దిగువన ఉన్న మన రాష్ట్రానికి నీళ్లురాని పరిస్థితి ఏర్పడింది.
పూర్తిస్థాయికి చేరుకున్న నారాయణపూర్...
కృష్ణానదిపై మొదటి ప్రాజెక్టుగా కర్ణాటకలో ఉన్న ఆల్మట్టి ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటినిల్వ 129 టీఎంసీలు. ప్రస్తుతం రిజర్వాయర్‌లో 74.33 టీఎంసీల నిల్వకు చేరింది. ఆల్మట్టి ప్రాజెక్టు దిగువన కర్ణాటకలోనే ఉన్న నారాయణపూర్ ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటినిల్వ సామర్థ్యం 37.64 టీంఎసీలు కాగా ప్రస్తుతం దాదాపు పూర్తిస్థాయి నీటినిల్వకు చేరేలా 31.00 టీఎంసీలకు చేరింది. నారాయణపూర్ ప్రాజెక్టు కుడి, ఎడమ ప్రధాన కాలువల ద్వారా 1168 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు.
గతనెల 21వ తేదీ నుంచి నారాయణపూర్ ఆయకట్టుకు నీటి విడుదల ప్రారంభమైంది. దీంతో ఆయకట్టులో రైతులు వరినాట్లు పూర్తి చేసుకోగా, గుల్బర్గా, రాయిచూర్ జిల్లాల్లోని దిగువ ప్రాంత రైతులు వరి మడులు సిద్ధం చేసుకుంటున్నారు. ప్రాజెక్టులోకి భారీగా నీళ్లు చేరినా క్రస్టుగేట్లను కర్ణాటక తెరవడం లేదు. పై నుంచి నారాయణపూర్ రిజర్వాయర్‌కు ఇన్‌ఫ్లో 11,627 క్యూసెక్కులు వస్తున్నందున ఆ నీటిని ఆయకట్టుకు మళ్లించడం మినహా దిగువ ప్రాంత ప్రాజెక్టుల రైతులకు నీళ్లందించాలన్న ఆలోచన చేయడం లేదు. వాస్తవానికి ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి నిల్వ చేరే వరకు కాకుండా దిగువ ప్రాజెక్టుల అవసరం మేరకు దామాషా పద్ధతి అవలంబించి నీటిని క్రస్టుగేట్ల ద్వారా విడుదల చేయాలన్న దిగువ రాష్ట్రాల డిమాండ్‌కు అధికారిక హక్కులు లేకపోవడమే ఇందుకు కారణం.
జూరాల ప్రాజెక్టులో అడుగంటిన రిజర్వాయర్
నారాయణపూర్ ప్రాజె క్టుకు దిగువన మన రాష్ట్రంలో ఉన్న జూరాల ప్రాజెక్టు రిజర్వాయర్ పూర్తిస్థాయి నీటినిల్వ సామర్థ్యం 11.94 టీఎంసీలు. అయితే, ఈ వర్షాకాలంలో వరదనీరు రాకపోవడంతో నీటినిల్వ పూర్తిగా అడుగంటిపోయింది. డెడ్‌స్టోరేజీ 5 టీఎంసీలు కాగా ప్రస్తుతం ఇది కూడా తాగునీటి అవసరాల కోసం ఎక్కువగా వాడుకోవడంతో డెడ్‌స్టోరేజీని దాటి మరింతగా అడుగంటింది.
దీంతో జూరాల ప్రాజెక్టు ఆయకట్టులో ఖరీఫ్ సాగుకోసం నారును సిద్ధం చేసుకున్న రైతులకు నీళ్లు ఎప్పుడొస్తాయో తెలియని పరిస్థితి ఏర్పడింది. దీంతో నారును కాపాడుకునేందుకు నీళ్లు పెట్టుకోలేక రైతులు ఇబ్బందులు పడుతున్నారు. కొందరు రైతులు నారును కాపాడుకోలేక వదలివేశారు. రైతులు వదలివేసిన నారు ఇప్పటికే ఎండిపోతుంది. ఇలా పై ప్రాజెక్టులో సాగు కళకళలాడుతుంటే దిగువన ఉన్న జూరాలలో నారు ఎండిపోయి రైతులు తీవ్ర ఇక్కట్లలో ఉన్నారు.