narayanpur project
-
‘శ్రీశైలం’లోకి బిరబిరా కృష్ణమ్మ
సాక్షి, హైదరాబాద్ : శ్రీశైలం జలాశయంలోకి వరద ప్రవాహం నిలకడగా కొనసాగుతోంది. శనివారం సాయంత్రం ఆరుగంటలకు 89,731 క్యూసెక్కులు వస్తుండటంతో నీటిమట్టం 838.8 అడుగులకు, నిల్వ 60.10 టీఎంసీలకు చేరుకుంది. శ్రీశైలం గరిష్ఠ నీటిమట్టం 885 అడుగులు, నిల్వ సామర్థ్యం 215.807 టీఎంసీలు. ►పశ్చిమ కనుమల్లో కురుస్తున్న వర్షాల వల్ల ఎగువన కృష్ణా నదిలో వరద ప్రవాహం నిలకడగా కొనసాగుతోంది. ►ఆల్మట్టి డ్యాంలోకి 36,186 క్యూసెక్కులు చేరుతుండగా, విద్యుత్కేంద్రం ద్వారా 45 వేల క్యూసెక్కులను దిగువకు విడుదల చేస్తున్నారు. ►నారాయణపూర్ డ్యాంలోకి 43, 570 క్యూసెక్కులు చేరుతుండగా.. స్పిల్‌వే, విద్యుత్కేం ద్రం ద్వారా 45 వేల క్యూ.లను దిగువకు వదులుతున్నారు. ►జూరాల ప్రాజెక్టులోకి 86,280 క్యూసెక్కులు చేరతుండగా.. స్పిల్ వే ఏడు గేట్లు, విద్యుత్కేంద్రం ద్వారా 84 వేల క్యూసెక్కులను దిగువకు వదులుతున్నారు. ►జూరాల నుంచి వస్తున్న జలాలకు హంద్రీ, తుంగభద్ర జలాలు జతకలవడంతో శ్రీశైలం ప్రాజెక్టులోకి 89,731 క్యూసెక్కులు చేరుతున్నాయి. ►పులిచింతలకు దిగువన కృష్ణా నదిలో వరద ప్రవాహం స్థిరంగా కొనసాగుతోంది. ప్రకాశం బ్యారేజీలోకి 17,409 క్యూసెక్కులు చేరుతుండగా కృష్ణా డెల్టా కాలువలకు 4,502 క్యూసెక్కులు, సముద్రంలోకి 12,907 క్యూసెక్కులను వదులుతున్నారు. -
బిరబిరా కృష్ణమ్మ
సాక్షి, హైదరాబాద్: ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా వాసుల దాహార్తిని తీర్చేందుకు సీఎం కేసీఆర్ తీసుకున్న చొరవ కార్యరూపం దాల్చింది. ఎగువన ఉన్న నారాయణపూర్ నుంచి దిగువన ఉన్న జూరాలకు కర్ణాటక జల వనరుల శాఖ అధికారులు నీటిని విడుదల చేశారు. నారాయణపూర్ డ్యామ్‌లో సరి పడినంత నీటి లభ్యత లేకపోవడంతో ఆల్మట్టి నుంచి శుక్రవారం అర్ధరాత్రి నారాయణపూర్‌కు నీరు విడుదల చేశారు. ఆల్మట్టి నుంచి విడుదలైన నీరు ఆదివారం నారాయణపూర్‌కు చేరిన తర్వాత.. అక్కడి నుంచి జూరాలకు నీటి విడుదల ప్రక్రియ కొనసాగనుంది. మహబూబ్‌నగర్ జిల్లా ప్రజల మంచినీటి అవసరాలు తీర్చడం కోసం నారాయణపూర్ రిజర్వాయర్ నుంచి జూరాలకు రెండున్నర టీఎంసీల నీటిని విడుదల చేయాలని సీఎం కోరడం, దానికి కర్ణాటక ప్రభుత్వం అంగీకరించిన విషయం తెలిసిందే. అయితే నారాయణపూర్ సామర్థ్యం 37.64టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 18.08 టీఎంసీల నీరుమాత్రమే ఉంది. నీటి నిల్వలు డెడ్ స్టోరేజీకి చేరడంతో దిగువకు నీటి విడుదల సాధ్యం కాదు. దీంతో ఎగువన ఉన్న ఆల్మట్టి నుంచి నారాయణపూర్‌కు నీటి విడుదల తప్పనిసరయింది. ఆల్మట్టిలోనూ 129.72 టీఎంసీల నిల్వలకు గానూ 30.38 టీఎంసీల నిల్వలున్నాయి. ఇక్కడ డెడ్‌స్టోరేజీకి ఎగువన కేవలం 12 టీఎంసీల నిల్వలే ఉన్నప్పటికీ తెలంగాణ అవసరాల దృష్ట్యా శుక్రవారం అర్ధరాత్రి డ్యామ్ స్పిల్‌వే ద్వారా 5,161 క్యూసెక్కులు, పవర్‌హౌజ్ ద్వారా మరో 700 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. ఈ నీరు ఆదివారం ఉదయం నారాయణపూర్‌కు చేరే అవకాశం ఉంది. నారాయణపూర్‌లో కొద్దిగా నిల్వలు పెరిగిన వెంటనే స్పిల్‌వే ద్వారా జూరాలకు నీటిని విడుదల చేసే అవకాశం ఉంది. నారాయణపూర్ నుంచి జూరాలకు 180 కిలోమీటర్ల దూరం ఉండగా, మధ్యలో కర్ణాటకలోని గూగల్, గిరిజాపూర్ అనే చిన్నపాటి రిజర్వాయర్లను దాటుకొని నీరు జూరాలకు చేరాల్సి ఉంటుంది. ఇలా జూరాలకు నీరు చేరేందుకు వారం రోజులు పట్టనుండగా, కనీసం ఒక టీఎంసీ నీరు జూరాలకు చేరే అవకాశం ఉంటుందని నీటి పారుదల వర్గాలు చెబుతున్నాయి. ఈ నీటితో జూన్ రెండో వారం వరకు ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో మిషన్ భగీరథ కింద తాగునీటి అవసరాలకు సర్దుబాటు చేయవచ్చని నీటి పారుదల వర్గాలు చెబుతున్నాయి. -
జూరాలకు 2.5 టీఎంసీలు
సాక్షి, హైదరాబాద్: ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా ప్రజలు ఈ వేసవిలో ఎదుర్కొంటున్న మంచినీటి సమస్యను అధిగమించడానికి సీఎం కె.చంద్రశేఖర్‌రావు కర్ణాటక ప్రభుత్వంతో నడిపిన దౌత్యం ఫలించింది. మహబూబ్‌నగర్ జిల్లా ప్రజల మంచినీటి అవసరాలు తీర్చడం కోసం నారాయణపూర్ రిజర్వాయర్ నుంచి జూరాలకు రెండున్నర టీఎంసీల నీటిని విడుదల చేయాలని కర్ణాటక ప్రభుత్వం నిర్ణయించింది. మహబూబ్‌నగర్ జిల్లా పరిధిలోని రిజర్వాయర్లలో నీటిమట్టం పూర్తిగా తగ్గిపోవడంతో నీటిని విడుదల చేయాల్సిందిగా కర్ణాటక సీఎం కుమారస్వామికి కేసీఆర్ శుక్రవారం ఫోన్ చేసి కోరారు. కేసీఆర్ అభ్యర్థనపై అక్కడి అధికారులతో చర్చించిన కుమార స్వామి తెలంగాణకు నీరు ఇవ్వాలని నిర్ణయించారు. ఈ విషయాన్ని కుమారస్వామి స్వయంగా ఫోన్ చేసి కేసీఆర్‌కు తెలిపారు. ఇది మహబూబ్ నగర్ జిల్లా ప్రజలకు శుభవార్త అని కేసీఆర్ అన్నారు. ఆ జిల్లా ప్రజల తరఫున కుమారస్వామికి కేసీఆర్ కృతజ్ఞతలు తెలిపారు. రెండు రాష్ట్రాల మధ్య సుహృద్భావ, స్నేహ సంబంధాలు ఇలాగే కొనసాగాలని ఇద్దరు సీఎంలు అభిప్రాయపడ్డారు. వారం రోజుల్లో జూరాలకు... నిజానికి జూరాల వాస్తవ నీటి నిల్వ సామర్ధ్యం 9.66 టీఎంసీ కాగా ప్రస్తుతం అందులో కేవలం 1.93 టీఎంసీల నీటి నిల్వే ఉంది. పూర్తిగా డెడ్‌స్టోరేజీకి నిల్వలు చేరడంతో ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో మిషన్ భగీరథ కింద తాగునీటి అవసరాలు తీరడం కష్టంగా మారింది. ఈ నేపథ్యంలో కర్ణాటక నుంచి నీటి విడుదల అవస్యం కావడంతో కేసీఆర్.. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రితో మాట్లాడి నీటి విడుదలకు ఒప్పించారు. ప్రస్తుతం ఎగువ నారాయణపూర్‌లో 37.64 టీఎంసీలకు గానూ 18.64 టీఎంసీల నిల్వలున్నాయి. అయితే ఇక్కడ ఎండీడీఎల్ పరిధిలోనే నీరుండటంతో ఆల్మట్టిలో లభ్యతగా ఉన్న 31.58 టీఎంసీల నిల్వల నుంచి కర్ణాటక నారాయణపూర్‌కు నీటి విడుదల చేసి, అటు నుంచి జూరాలకు నీటిని విడుదల చేసే అవకాశం ఉందని నీటి పారుదల వర్గాలు తెలిపాయి. శుక్రవారం అర్ధరాత్రి లేక శనివారం నీటి విడుదల మొదలు పెట్టినా, వారం రోజుల్లో నీరు జూరాలకు చేరుతుందన్నారు. ఒక టీఎంసీ నీరు జూరాలను చేరినా జూన్ మొదటి వారం వరకు మహబూబ్‌గనర్ జిల్లా తాగునీటి అవసరాలు తీరినట్టేనని పేర్కొంటున్నారు. -
రావమ్మా కృష్ణమ్మా
సాక్షి ప్రత్యేక ప్రతినిధి–హైదరాబాద్ కృష్ణమ్మ ఉరకలెత్తుతోంది. రోజురోజుకూ వరద ఉధృతి పెరుగుతోంది. కర్ణాటక నుంచి నాలుగైదు రోజుల్లో బిరబిరమంటూ రాష్ట్రంలోకి అడుగుపెట్టనుంది. ఎగువన కురుస్తున్న భారీ వర్షాలతో కర్ణాటకలోని ఆల్మట్టికి వరద పోటెత్తుతోంది. ఈ ప్రాజెక్టు నిల్వ సామర్థ్యం 129.72 టీఎంసీలు కాగా ప్రస్తుతం 103.13 టీఎంసీలకు చేరింది. ప్రస్తుత వరద మరో రెండ్రోజులు ఇలాగే కొనసాగితే ప్రాజెక్టు గేట్లు ఎత్తి దిగువన నారాయణపూర్‌కు నీటిని వదలనున్నారు. ఆల్మట్టి వద్ద ఆదివారం ఉదయం లక్ష క్యూసెక్కులతో మొదలైన ప్రవాహం సోమవారం ఉదయానికి 1.11 లక్షల క్యూసెక్కులకు పెరిగింది. గడచిన 24 గంటల్లో మహాబలేశ్వరం సహా పశ్చిమ కనుమల్లో 30 సెం.మీ. వర్షపాతం నమోదైంది. సోమవారం నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయని, కృష్ణా నదికి వరద మరింత పెరుగుతుందని కేంద్ర జల సంఘం హెచ్చరికలు జారీ చేసింది. భారీ నుంచి అతి భారీ వర్షాలు ఈ నెల 22 దాకా కొనసాగుతాయని భారత వాతావరణ విభాగం ప్రకటించింది. నారాయణపూర్ నిండగానే దిగువకు.. వాస్తవానికి కృష్ణా నదికి వరద ప్రవాహం మొదలై 15 రోజులు దాటింది. కానీ ప్రాజెక్టులకు వచ్చి చేరుతున్న నీటిని కర్ణాటక ప్రభుత్వం.. చిన్న, మధ్య తరహా సాగునీటి ప్రాజెక్టులకు తరలించింది. దాదాపుగా ఆల్మట్టి పరిధిలోని అన్ని చెరువులను నింపింది. దీంతో ప్రస్తుతం వస్తున్న నీటిని దిగువకు వదలాలని నిర్ణయించింది. ప్రాజెక్టు 115 టీఎంసీలకు చేరగానే, ఎగువ నుంచి వస్తున్న ప్రవాహాన్ని దృష్టిలో ఉంచుకుని నారాయణపూర్‌కు నీటిని వదలాలని కేంద్ర జలసంఘం కర్ణాటక ప్రభుత్వానికి సూచించింది. ప్రస్తుతం వస్తున్న వరద ప్రవాహం కొనసాగితే బుధవారం మధ్యాహ్నానికి ఆల్మట్టిలో నీరు దాదాపు 120 టీఎంసీలకు చేరుతుంది. వాతావరణ విభాగం చెపుతున్నట్లు భారీ వర్షాలు కొనసాగితే వరద దాదాపు 15 రోజుల పాటు ఉంటుందని నీటిపారుదల నిపుణులు చెబుతున్నారు. భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిస్తే వరద ప్రవాహం 1.50 క్యూసెక్కుల నుంచి 2 లక్షల క్యూసెక్కుల దాకా ఉండొచ్చని పేర్కొంటున్నారు. అదే నిజమైతే నారాయణపూర్ నుంచి నాలుగు రోజుల్లోనే జూరాలకు నీటి ప్రవాహం మొదలవుతుంది. ప్రస్తుతం నారాయణపూర్‌లో 37.64 టీఎంసీల గరిష్ట నిల్వకు గాను 23.85 టీఎంసీల నీరు ఉంది. భారీగా వరద వస్తే రెండ్రోజుల్లోనే నారాయణపూర్ నిండుతుంది. తుంగభద్రకూ భారీగానే.. తుంగభద్రలోకి కూడా భారీగా వరద వస్తోంది. ఈ ప్రాజెక్టు గరిష్ట నిల్వ సామర్థ్యం 100 టీఎంసీలు కాగా.. ఇప్పటికే 77.99 టీఎంసీల నీరు వచ్చి చేరింది. ఆల్మట్టి మాదిరే కర్ణాటక తుంగభద్ర నుంచి ఎత్తిపోతల పథకాలకు నీటిని అక్రమంగా తరలించింది. దీంతో ఎప్పుడో గరిష్ట నీటిమట్టానికి చేరుకోనున్న తుంగభద్ర ఇంకా 78 టీఎంసీల వద్దే ఉంది. ప్రస్తుతం వస్తున్న 69 వేల క్యూసెక్కుల ప్రవాహం కొనసాగితే ఐదు రోజుల్లో గరిష్ట నీటిమట్టానికి చేరుకుంటుంది. ఈ లోగా వరద ప్రవాహం పెరిగితే శ్రీశైలానికి ఐదారు రోజుల్లో వరద మొదలవుతుందని సాగునీటి శాఖ నిపుణులు ఆంచనా వేస్తున్నారు. జూన్ నుంచే వర్షాలు కురుస్తున్నా.. మహాబళేశ్వర్ ప్రాంతంలో జూన్ మొదటి వారం నుంచి ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. జూన్ 15 నాటికి ఆల్మట్టికి వరద ప్రవాహం మొదలైంది. ప్రారంభంలో తక్కువ వచ్చినా ప్రతి చుక్కను కర్ణాటక దారి మళ్లించింది. దిగువన తెలంగాణ, ఏపీలోని ప్రాజెక్టుల్లో నిల్వలు అడుగంటినా పట్టించుకోకుండా ఆ నీటితో చిన్న, మధ్య తరహా ప్రాజెక్టులు నింపింది. అయినా ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు కిమ్మనకపోవడం గమనార్హం. -
కృష్ణమ్మ పరవళ్లు!
సాక్షి, హైదరాబాద్/జూరాల: కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతోంది. కొద్దిరోజులుగా ఎగువన కురుస్తున్న వర్షాలకు తోడు స్థానిక ప్రవాహాలు తోడవ్వడంతో ప్రాజెక్టుల్లో నీటి ఉధృతి కొనసాగుతోంది. కృష్ణమ్మకు తుంగభద్ర కూడా తోడవ్వడంతో శ్రీశైలం ప్రాజెక్టులోకి భారీగా నీరు వచ్చి చేరుతోంది. మూడు రోజుల్లోనే శ్రీశైలానికి సుమారు 11 టీఎంసీల నీరు రాగా, 57 వేల క్యూసెక్కులకు పైగా ప్రవాహాలు కొనసాగుతున్నాయి. ఇక ఎగువ కర్ణాటకలోని నారాయణపూర్, రాష్ట్రంలోని జూరాల ప్రాజెక్టులు దాదాపు నిండుకున్నాయి. నారాయణ్‌పూర్ ప్రాజెక్టు వద్ద రెండు గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. మరోవైపు జూరాల నుంచి నేడో, రేపో గేట్లను ఎత్తే అవకాశాలున్నాయని నీటిపారుదల శాఖ అధికారులు వెల్లడిస్తున్నారు. శ్రీశైలంలోకి 11 టీఎంసీల నీరు.. నాలుగు రోజులుగా తుంగభద్ర నదిలో కొనసాగుతున్న వరద ఉధృతి కారణంగా సుంకేశుల ప్రాజెక్టు పూర్తిగా నిండింది. దీంతో ఏడు గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేయడంతో శ్రీశైలంలోకి భారీగా ప్రవాహాలు వస్తున్నాయి. తుంగభద్ర నది ఉధృతికి కృష్ణా బేసిన్లో కురుస్తున్న వర్షాలు కూడా తోడవ్వడంతో శ్రీశైలంలో ప్రవాహాలు మరింత పెరిగాయి. గురువారం 31 వేల క్యూసెక్కుల మేర ప్రవాహాలు ఉండగా శుక్రవారం నాటికిఇది 57 వేల క్యూసెక్కులకు చేరింది. గురువారం 31.98 టీఎంసీలు ఉన్న నీటి నిల్వ శుక్రవారం ఉదయానికి 35.68 టీఎంసీలకు.. సాయంత్రానికి 37.65 టీఎంసీలకు పెరిగింది. దీంతో నాలుగు రోజుల్లో ప్రాజెక్టులోకి 11 టీఎంసీల మేర నీరు చేరిన ట్లైంది. ప్రాజెక్టు పరీవాహకంలో వర్షాలు కొనసాగుతుండటం, ఎగువ నుంచి ప్రవాహాలు పెరిగే అవకాశం ఉండటంతో నీటి నిల్వ మరింత పెరగవచ్చని అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం ప్రాజెక్టులో 885 అడుగుల నీటి మట్టానికిగానూ 815.5 అడుగుల వద్ద నీరు ఉంది. మరో 20 టీఎంసీల నీరు ప్రాజెక్టులోకి చేరితే విద్యుదుత్పత్తికి అవకాశం ఉంటుందని అధికారులు స్పష్టం చేస్తున్నారు. నిండుగా జూరాల, నారాయణపూర్.. ఎగువ కృష్ణా బేసిన్లో విసృ్తతంగా కురుస్తున్న వర్షాలకు నారాయణపూర్, జూరాలకు ప్రవాహాలు పెరుగుతున్నాయి. నారాయణపూర్ ప్రాజెక్టు పూర్తి నీటి నిల్వ సామర్థ్యం 37.64 టీఎంసీలు కాగా ప్రస్తుతం 37.12 టీఎంసీల నీటి నిల్వ ఉంది. ప్రాజెక్టులోకి 18,363 క్యూసెక్కుల మేర ప్రవాహాలు ఉండటంతో ప్రాజెక్టు దాదాపు నిండింది. శనివారంతో పూర్తిగా నిండే అవకాశాలున్నాయి. ఇప్పటికే ప్రాజెక్టు నుంచి దిగువకు 13,445 క్యూసెక్కుల నీటి ప్రవాహాలున్నాయి. ఇవన్నీ జూరాలలో వచ్చి చేరడంతో ఆ ప్రాజెక్టు సైతం శనివారంతో పూర్తిగా నిండనుంది. ప్రస్తుతం జూరాలలో 11.94 టీఎంసీల నీటి నిల్వకుగానూ 11.79 టీఎంసీల నిల్వ ఉంది. జూరాల రిజర్వాయర్‌కు పరీవాహక ప్రాంతం నుంచి 34,150 క్యూసెక్కుల వరద నీరు వస్తుండడంతో విద్యుదుత్పత్తికి 32 వేల క్యూసెక్కులను వినియోగిస్తున్నారు. నాలుగు టర్బైన్ల సాయంతో 156 మెగావాట్ల విద్యుదుత్పత్తి చేస్తున్నారు. నారాయణపూర్ నిండటంతో ఇప్పటికే జూరాల నిండేందుకు సిద్ధంగా ఉండటంతో అక్కడి నుంచి నీటి విడుదలకు పూనుకున్నా ఆ నీరంతా శ్రీశైలానికి చేరే అవకాశం ఉంటుంది. ప్రస్తుత తుంగభద్ర నుంచి వస్తున్న ప్రవాహాలకు ఎగువ కృష్ణా ప్రవాహాలు తోడైతే శ్రీశైలంలో భారీగా నీరు చేరే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. 20 నుంచి దిగువ జూరాలలో విద్యుదుత్పత్తి ఆత్మకూర్: మహబూబ్‌నగర్ జిల్లాలో ఉన్న దిగువ జూరాల జల విద్యుత్ ఉత్పత్తి కేంద్రం ద్వారా ఈ నెల 20 నుంచి విద్యుదుత్పత్తి చేయనున్నట్టు జెన్కో డెరైక్టర్ వెంకటరాజం చెప్పారు. శుక్రవారం మహబూబ్‌నగర్ జిల్లా ఆత్మకూర్ మండల పరిధిలోని జూరాల, మూలమళ్ల గ్రామాల శివారులో దిగువ జూరాల జలవిద్యుత్ ఉత్పత్తి కేంద్రం నిర్మాణాల్ని ఆయన పరిశీలించారు. -
ఎగువన కళకళ.. దిగువన వెలవెల
జూరాల (మహబూబ్‌నగర్): కృష్ణానదికి ఎగువ ప్రాంతంలోని నారాయణపూర్ ప్రాజెక్టు ఆయకట్టు పచ్చని పైర్లతో కళకళలాడుతుంటే.. దిగువన ఉన్న జూరాల ప్రాజెక్టు కింద నీటిచుక్క లేక పొలాలన్నీ బీళ్లుగా మారాయి. ప్రాజెక్టుల్లో పూర్తిస్థాయి నీటినిల్వ చేరే వరకు దిగువ ప్రాజెక్టులకు క్రస్టుగేట్ల ద్వారా నీటిని విడుదల చేసే అంశంపై స్పష్టమైన నిబంధనలు లేకపోవడంతో పై రాష్ట్రాలు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నాయి. దీంతో పై ప్రాజెక్టులలో నిండుగా నీళ్లున్నా దిగువన ఉన్న మన రాష్ట్రానికి నీళ్లురాని పరిస్థితి ఏర్పడింది. పూర్తిస్థాయికి చేరుకున్న నారాయణపూర్... కృష్ణానదిపై మొదటి ప్రాజెక్టుగా కర్ణాటకలో ఉన్న ఆల్మట్టి ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటినిల్వ 129 టీఎంసీలు. ప్రస్తుతం రిజర్వాయర్‌లో 74.33 టీఎంసీల నిల్వకు చేరింది. ఆల్మట్టి ప్రాజెక్టు దిగువన కర్ణాటకలోనే ఉన్న నారాయణపూర్ ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటినిల్వ సామర్థ్యం 37.64 టీంఎసీలు కాగా ప్రస్తుతం దాదాపు పూర్తిస్థాయి నీటినిల్వకు చేరేలా 31.00 టీఎంసీలకు చేరింది. నారాయణపూర్ ప్రాజెక్టు కుడి, ఎడమ ప్రధాన కాలువల ద్వారా 1168 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. గతనెల 21వ తేదీ నుంచి నారాయణపూర్ ఆయకట్టుకు నీటి విడుదల ప్రారంభమైంది. దీంతో ఆయకట్టులో రైతులు వరినాట్లు పూర్తి చేసుకోగా, గుల్బర్గా, రాయిచూర్ జిల్లాల్లోని దిగువ ప్రాంత రైతులు వరి మడులు సిద్ధం చేసుకుంటున్నారు. ప్రాజెక్టులోకి భారీగా నీళ్లు చేరినా క్రస్టుగేట్లను కర్ణాటక తెరవడం లేదు. పై నుంచి నారాయణపూర్ రిజర్వాయర్‌కు ఇన్‌ఫ్లో 11,627 క్యూసెక్కులు వస్తున్నందున ఆ నీటిని ఆయకట్టుకు మళ్లించడం మినహా దిగువ ప్రాంత ప్రాజెక్టుల రైతులకు నీళ్లందించాలన్న ఆలోచన చేయడం లేదు. వాస్తవానికి ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి నిల్వ చేరే వరకు కాకుండా దిగువ ప్రాజెక్టుల అవసరం మేరకు దామాషా పద్ధతి అవలంబించి నీటిని క్రస్టుగేట్ల ద్వారా విడుదల చేయాలన్న దిగువ రాష్ట్రాల డిమాండ్‌కు అధికారిక హక్కులు లేకపోవడమే ఇందుకు కారణం. జూరాల ప్రాజెక్టులో అడుగంటిన రిజర్వాయర్ నారాయణపూర్ ప్రాజె క్టుకు దిగువన మన రాష్ట్రంలో ఉన్న జూరాల ప్రాజెక్టు రిజర్వాయర్ పూర్తిస్థాయి నీటినిల్వ సామర్థ్యం 11.94 టీఎంసీలు. అయితే, ఈ వర్షాకాలంలో వరదనీరు రాకపోవడంతో నీటినిల్వ పూర్తిగా అడుగంటిపోయింది. డెడ్‌స్టోరేజీ 5 టీఎంసీలు కాగా ప్రస్తుతం ఇది కూడా తాగునీటి అవసరాల కోసం ఎక్కువగా వాడుకోవడంతో డెడ్‌స్టోరేజీని దాటి మరింతగా అడుగంటింది. దీంతో జూరాల ప్రాజెక్టు ఆయకట్టులో ఖరీఫ్ సాగుకోసం నారును సిద్ధం చేసుకున్న రైతులకు నీళ్లు ఎప్పుడొస్తాయో తెలియని పరిస్థితి ఏర్పడింది. దీంతో నారును కాపాడుకునేందుకు నీళ్లు పెట్టుకోలేక రైతులు ఇబ్బందులు పడుతున్నారు. కొందరు రైతులు నారును కాపాడుకోలేక వదలివేశారు. రైతులు వదలివేసిన నారు ఇప్పటికే ఎండిపోతుంది. ఇలా పై ప్రాజెక్టులో సాగు కళకళలాడుతుంటే దిగువన ఉన్న జూరాలలో నారు ఎండిపోయి రైతులు తీవ్ర ఇక్కట్లలో ఉన్నారు.