సోమవారం నిండుకుండలా తొణికిసలాడుతున్న కర్ణాటకలోని ఆల్మట్టి రిజర్వాయర్
సాక్షి ప్రత్యేక ప్రతినిధి–హైదరాబాద్
కృష్ణమ్మ ఉరకలెత్తుతోంది. రోజురోజుకూ వరద ఉధృతి పెరుగుతోంది. కర్ణాటక నుంచి నాలుగైదు రోజుల్లో బిరబిరమంటూ రాష్ట్రంలోకి అడుగుపెట్టనుంది. ఎగువన కురుస్తున్న భారీ వర్షాలతో కర్ణాటకలోని ఆల్మట్టికి వరద పోటెత్తుతోంది. ఈ ప్రాజెక్టు నిల్వ సామర్థ్యం 129.72 టీఎంసీలు కాగా ప్రస్తుతం 103.13 టీఎంసీలకు చేరింది. ప్రస్తుత వరద మరో రెండ్రోజులు ఇలాగే కొనసాగితే ప్రాజెక్టు గేట్లు ఎత్తి దిగువన నారాయణపూర్‌కు నీటిని వదలనున్నారు.
ఆల్మట్టి వద్ద ఆదివారం ఉదయం లక్ష క్యూసెక్కులతో మొదలైన ప్రవాహం సోమవారం ఉదయానికి 1.11 లక్షల క్యూసెక్కులకు పెరిగింది. గడచిన 24 గంటల్లో మహాబలేశ్వరం సహా పశ్చిమ కనుమల్లో 30 సెం.మీ. వర్షపాతం నమోదైంది. సోమవారం నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయని, కృష్ణా నదికి వరద మరింత పెరుగుతుందని కేంద్ర జల సంఘం హెచ్చరికలు జారీ చేసింది. భారీ నుంచి అతి భారీ వర్షాలు ఈ నెల 22 దాకా కొనసాగుతాయని భారత వాతావరణ విభాగం ప్రకటించింది.
నారాయణపూర్ నిండగానే దిగువకు..
వాస్తవానికి కృష్ణా నదికి వరద ప్రవాహం మొదలై 15 రోజులు దాటింది. కానీ ప్రాజెక్టులకు వచ్చి చేరుతున్న నీటిని కర్ణాటక ప్రభుత్వం.. చిన్న, మధ్య తరహా సాగునీటి ప్రాజెక్టులకు తరలించింది. దాదాపుగా ఆల్మట్టి పరిధిలోని అన్ని చెరువులను నింపింది. దీంతో ప్రస్తుతం వస్తున్న నీటిని దిగువకు వదలాలని నిర్ణయించింది. ప్రాజెక్టు 115 టీఎంసీలకు చేరగానే, ఎగువ నుంచి వస్తున్న ప్రవాహాన్ని దృష్టిలో ఉంచుకుని నారాయణపూర్‌కు నీటిని వదలాలని కేంద్ర జలసంఘం కర్ణాటక ప్రభుత్వానికి సూచించింది.
ప్రస్తుతం వస్తున్న వరద ప్రవాహం కొనసాగితే బుధవారం మధ్యాహ్నానికి ఆల్మట్టిలో నీరు దాదాపు 120 టీఎంసీలకు చేరుతుంది. వాతావరణ విభాగం చెపుతున్నట్లు భారీ వర్షాలు కొనసాగితే వరద దాదాపు 15 రోజుల పాటు ఉంటుందని నీటిపారుదల నిపుణులు చెబుతున్నారు. భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిస్తే వరద ప్రవాహం 1.50 క్యూసెక్కుల నుంచి 2 లక్షల క్యూసెక్కుల దాకా ఉండొచ్చని పేర్కొంటున్నారు. అదే నిజమైతే నారాయణపూర్ నుంచి నాలుగు రోజుల్లోనే జూరాలకు నీటి ప్రవాహం మొదలవుతుంది. ప్రస్తుతం నారాయణపూర్‌లో 37.64 టీఎంసీల గరిష్ట నిల్వకు గాను 23.85 టీఎంసీల నీరు ఉంది. భారీగా వరద వస్తే రెండ్రోజుల్లోనే నారాయణపూర్ నిండుతుంది.
తుంగభద్రకూ భారీగానే..
తుంగభద్రలోకి కూడా భారీగా వరద వస్తోంది. ఈ ప్రాజెక్టు గరిష్ట నిల్వ సామర్థ్యం 100 టీఎంసీలు కాగా.. ఇప్పటికే 77.99 టీఎంసీల నీరు వచ్చి చేరింది. ఆల్మట్టి మాదిరే కర్ణాటక తుంగభద్ర నుంచి ఎత్తిపోతల పథకాలకు నీటిని అక్రమంగా తరలించింది. దీంతో ఎప్పుడో గరిష్ట నీటిమట్టానికి చేరుకోనున్న తుంగభద్ర ఇంకా 78 టీఎంసీల వద్దే ఉంది. ప్రస్తుతం వస్తున్న 69 వేల క్యూసెక్కుల ప్రవాహం కొనసాగితే ఐదు రోజుల్లో గరిష్ట నీటిమట్టానికి చేరుకుంటుంది. ఈ లోగా వరద ప్రవాహం పెరిగితే శ్రీశైలానికి ఐదారు రోజుల్లో వరద మొదలవుతుందని సాగునీటి శాఖ నిపుణులు ఆంచనా వేస్తున్నారు.
జూన్ నుంచే వర్షాలు కురుస్తున్నా..
మహాబళేశ్వర్ ప్రాంతంలో జూన్ మొదటి వారం నుంచి ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. జూన్ 15 నాటికి ఆల్మట్టికి వరద ప్రవాహం మొదలైంది. ప్రారంభంలో తక్కువ వచ్చినా ప్రతి చుక్కను కర్ణాటక దారి మళ్లించింది. దిగువన తెలంగాణ, ఏపీలోని ప్రాజెక్టుల్లో నిల్వలు అడుగంటినా పట్టించుకోకుండా ఆ నీటితో చిన్న, మధ్య తరహా ప్రాజెక్టులు నింపింది. అయినా ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు కిమ్మనకపోవడం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment