ఆల్మట్టి దిగువన నిండుగా కృష్ణా నదీ ప్రవాహం
సాక్షి, హైదరాబాద్: ఎగువన కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతోంది. భారీగా కురుస్తున్న వర్షాలతో ప్రాజెక్టుల్లోకి వరద పోటెత్తుతోంది. ఆల్మట్టి నిండుకుండగా మారడంతో మంగళవారం ఉదయం గేట్లెత్తారు. ఈ నీరంతా దిగువన ఉన్న నారాయణపూర్‌కు వస్తోంది. బుధవారం అక్కడ కూడా గేట్లు ఎత్తే అవకాశాలు ఉండటంతో.. తెలంగాణ వైపు మరో రెండు మూడ్రోజుల్లో కృష్ణమ్మ పరవళ్లు మొదలు కానున్నాయి. మరోవైపు తుంగభద్ర కూడా నిండేందుకు సిద్ధమైంది. వర్షాలు స్థిరంగా కొనసాగుతుండటం, ప్రాజెక్టుల్లోకి భారీ ప్రవాహాలు ఉండటంతో జూరాల, శ్రీశైలం ప్రాజెక్టుల కింద ఆయకట్టుపై ఆశలు చిగురిస్తున్నాయి.
జూరాలలోకి వచ్చే నీటితో 4.50 లక్షల ఎకరాలకు, శ్రీశైలానికి వచ్చే నీటితో మరో 3.50 లక్షల ఎకరాలకు నీరిచ్చేలా నీటిపారుదల శాఖ పంపులు, మోటార్లు సిద్ధం చేసింది. జూరాలలో ప్రస్తుతం నిల్వ ఉన్న 5.6 టీఎంసీల నుంచి 2.5 టీఎంసీల నీటిని భీమా, నెట్టెంపాడు ఆయకట్టుకు తీసుకోవాలని సీఎం కేసీఆర్ సూచించారు. దీంతో మంగళవారం రాత్రి భీమా, నెట్టెంపాడులో ఒక్కో పంపును ప్రారంభించి నీటిని విడుదల చేస్తున్నారు.
10 రోజుల్లోనే 95 టీఎంసీలు
ఆల్మట్టి ప్రాజెక్టులోకి గత పదిరోజుల్లోనే సుమారు 95 టీఎంసీల నీరు వచ్చి చేరింది. మంగళవారం సాయంత్రం సైతం 1.55 లక్షల క్యూసెక్కుల వరద వస్తోంది. ఈ ప్రాజెక్టు గరిష్ట నీటిమట్టం 1,705 అడుగులు కాగా ప్రస్తుతం 1701.87 అడుగులకు నీరు చేరింది. 129.7 టీఎంసీలకుగానూ 113.07 టీఎంసీల నీటి లభ్యత ఉంది. మంగళవారం రాత్రికి నీటిమట్టం మరో నాలుగైదు టీఎంసీలకు పెరిగినట్లు కర్ణాటక నీటి పారుదల వర్గాలు తెలంగాణ అధికారులకు సమాచారం ఇచ్చాయి. ప్రస్తుతం 18 గేట్లు ఎత్తి ఆల్మట్టి నుంచి దిగువన నారాయణపూర్‌కు స్పిల్‌వే, పవర్‌హౌజ్ ద్వారా నీటిని విడుదల చేస్తున్నారు.
ప్రస్తుతం నారాయణపూర్‌కు 37,906 క్యూసెక్కుల నీరు వస్తోంది. నారాయణపూర్ 37.64 టీఎంసీల సామర్థ్యానికి గానూ 29.80 టీఎంసీల నీటి లభ్యత ఉంది. ఎగువ నుంచి ప్రవాహాలు వస్తున్నందున బుధవారం సాయంత్రం ప్రాజెక్టు గేట్లు ఎత్తే అవకాశం ఉంది. అదే జరిగితే జూరాలకు శుక్రవారం ఉదయానికి కృష్ణా ప్రవాహాలు నమోదవుతాయని నీటిపారుదల శాఖ అంచనా వేస్తోంది. ప్రస్తుతం జూరాలలో 9.6 టీఎంసీల సామర్థ్యానికిగానూ 5.76 టీఎంసీల నిల్వ ఉంది. మరోవైపు తుంగభద్ర కూడా నిండేందుకు సిద్ధంగా ఉంది. ఈ ప్రాజెక్టులో 100 టీఎంసీలకు గానూ ఇప్పటికే 86.45 టీఎంసీల నిల్వలున్నాయి. 82 వేల క్యూసెక్కుల ప్రవాహాలు కొనసాగుతున్నాయి. బుధవారం తుంగభద్ర గేట్లు కూడా ఎత్తే అవకాశం ఉంది. గేట్లు ఎత్తితే దిగువ శ్రీశైలానికి శుక్రవారం నాటికి ప్రవాహాలు రానున్నాయి.
8 లక్షల ఎకరాలకు సాగునీరు
ఆల్మట్టి, నారాయణపూర్, తుంగభద్ర డ్యామ్‌ల నుంచి రెండుమూడ్రోజుల్లో దిగువకు నీరు వచ్చే అవకాశం ఉన్నందున ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో జూరాల, శ్రీశైలంపై ఆధారపడిన ఆయకట్టుకు నీటిని అందించేందుకు నీటి పారుదల శాఖ సిద్ధమవుతోంది. జూరాల కింద లక్ష ఎకరాలకు నీటిని అందించడంతోపాటు భీమాలో రెండు ఫేజ్‌ల్లోని 6 మోటార్ల ద్వారా 1.70 లక్షల ఎకరాలు, నెట్టెంపాడులో రెండు స్టేజీల్లో 6 మోటార్ల ద్వారా 1.5 లక్షలు, కోయిల్‌సాగర్‌లో రెండు మోటార్ల ద్వారా 50 వేల ఎకరాలకు నీరివ్వడంతోపాటు 250 చెరువులను నింపాలని మంత్రి హరీశ్‌రావు ఇటీవల అధికారులను ఆదేశించారు.
ఇక శ్రీశైలంపై ఆధారపడ్డ కల్వకుర్తిలో 5 మోటార్ల ద్వారా 3.50 లక్షల ఎకరాలకు నీరిచ్చి 400 చెరువులు నింపేలా ప్రణాళిక సిద్ధం చేశారు. తుంగభద్ర జలాలతో తుమ్మిళ్ల ఎత్తిపోతల పూర్తయితే ఈ ఖరీఫ్‌లోనే ఆర్డీఎస్ కింద 86 వేల ఎకరాలకు సాగునీరు అందనుంది. జూలై నుంచే ఎగువ నుంచి దిగువకు ప్రవాహాలు మొదలవుతున్నందున ఖరీఫ్ ఆయకట్టుకు నీటి విడుదలలో ఢోకా ఉండదని నీటిపారుదల వర్గాలు చెబుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment