సాక్షి, బెంగళూరు: ఆల్మట్టి డ్యామ్ ఎత్తును పెంచనున్నట్లు కర్ణాటక ప్రభుత్వం ప్రకటించింది. కృష్ణా నదిపై బాగల్‌కోట జిల్లాలో నిర్మించిన ఆల్మట్టి డ్యామ్ ప్రస్తుతమున్న ఎత్తును 519.60 మీటర్ల నుంచి 524.256 మీటర్లకు పెంచనున్నట్లు వెల్లడించింది.
దీనిపై త్వరలో కేంద్ర ప్రభుత్వం నుంచి అధికారిక ప్రకటన వెలువడనుందని కర్ణాటక భారీ నీటి పారుదల మంత్రి పాటిల్ బుధవారం శాసనసభలో ప్రకటించారు. చిన్న అడ్డంకులు ఉన్నా ఆల్మట్టి డ్యామ్ ఎత్తు పెంచే విషయంలో ఎలాంటి ఇబ్బందులు ఉండబోవని వ్యాఖ్యానించారు. ఆల్మట్టి జలాశయానికి సంబంధించి కర్ణాటకకు కేటాయించిన 173 టీఎంసీల నీటిని తమ ప్రభుత్వం పూర్తిస్థాయిలో వినియోగించుకుంటూ 6.19 లక్షల హెక్టార్లకు సాగునీటి వసతిని కల్పిస్తోందని మంత్రి వివరించారు.