అరుదైన రింగ్ కు అదిరే ధర!
15 శతాబ్దానికి చెందిన అరుదైన ఉంగరాన్ని ఉత్తర యార్క్ షైర్ కు చెందిన లీ రోస్సిటెర్ అనే వ్యక్తి ఐదంకెల ధరకు అమ్మేశాడు. ఈబే ఈ కామర్స్ సైట్ ద్వారా కొనుగోలు చేసిన ఓ మెటల్ డిటెక్టర్ తో అరుదైన ట్యూడర్ ఉంగరాన్ని కనుగొన్నట్లు చెప్పాడు. 80శాతం బంగారంతో తయారుచేసిన ఈ ఉంగరంలో రూబీ, ఎమరాల్డ్ రాళ్లు ఉన్నాయని తెలిపాడు.
యార్క్ షైర్ లోని గ్రీన్ హామ్మర్ టన్ మెటల్ డిటెక్టర్ క్లబ్ లో ప్రాచీన కాలపు వస్తువుల కోసం వెతుకుతున్న సమయంలో ఈ ఉంగరం లభ్యమైనట్లు వివరించాడు. ఉంగరాన్ని స్నేహితులకు చూపిస్తే ఇది బంగారం కాదని పారేయమని చెప్పారని తెలిపాడు. కానీ ఉంగరం బరువు ఉండటంతో నిపుణుడిని సంప్రదిస్తే మంచిదని భావించినట్లు చెప్పాడు.
బ్రిటిష్ మ్యూజియంలో చేయించిన పరీక్షల్లో ఉంగరంలో 80శాతం బంగారం ఉన్నట్లు తేలిందని, అంతేకాకుండా ప్రాచీన కాలానికి చెందిన అత్యంత విలువైన ఉంగరమని చెప్పారని తెలిపాడు. ఆ కాలంలో కేవలం రాజుల కుటుంబాలకు చెందిన వారు మాత్రమే బంగారు ఉంగరాలను ధరించేవారని వెల్లడించాడు.