ఆలుగడ్డలు బహుఖతర్నాక్
ఆలుగడ్డలతో ఆటలాడొద్దు. అవి బహు ఖతర్నాక్. ఆలుగడ్డలు ఇంగ్లండ్ లోని యార్క్ షైర్ లోని ఓ బిజీ రోడ్డును అయిదు గంటల పాటు పూర్తిగా ఆపేశాయి.
శనివారం యార్క్ షైర్ లో ఉడకబెట్టి, చిదిమి ప్యాక్ చేసిన ఆలూ పేస్ట్ ను తీసుకెళ్తున్న ఒక లారీ బోల్తాపడింది. అందులోని ఉడకబెట్టిన ఆలూ పేస్ట్ రోడ్డంతా పడిపోయింది. వాతావరణంలో తేమ, మంచు ల వల్ల ఆ పేస్ట్ నెమ్మదిగా రోడ్డు రోడ్డంతా విస్తరించింది.
ఆ తరువాత ఇంకేముంది? ఈ పేస్టులో వాహనాలు స్కిడ్ అయ్యాయి. కార్లు బోల్తాపడ్డాయి. ఇక పాదచారుల పరిస్థితి చెప్పనే అక్కర్లేదు. ఒళ్లంతా పేస్టు పులుముకుపోయింది. కాస్త ఉప్పు, కాసింత కారం వేస్తే కూరగా మారిపోయే పరిస్థితి!
చివరికి మంచును తొలగించే పారలు, యంత్రాలు తెచ్చి అయిదు గంటల పాటు శ్రమిస్తే కానీ అలూ పేస్టు వదలలేదు. ఇంగ్లండ్ లో గతంలోనూ ఇలా బంగాళాదుంపలు రహదారుల దుంపతెంచాయి.