
సైన్యంలోని ద్రోహులను ఏరిపారేస్తున్నాం!
అంకరా: తన ప్రభుత్వం కూల్చేందుకు సైన్యం తిరుగుబాటుకు ప్రయత్నించడంపై టర్కీ అధ్యక్షుడు తయ్యిప్ ఎర్డోగాన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సైనిక తిరుగుబాటులో పాలుపంచుకున్న ప్రతి ఒక్కరినీ కఠినంగా శిక్షిస్తామని ఆయన హెచ్చరించారు.
టర్కీ సైన్యంలోని దేశద్రోహ శక్తులను సమూలంగా ఏరిపారేసే మిషన్ ప్రారంభమైందని ఎర్డోగాన్ తెలిపారు. శనివారం ఉదయం ఇస్తాంబుల్‌లోని అటాటర్క్ విమానాశ్రయం వద్ద మద్దతుదారులను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. ఆయనను ఓ విమానం ఎయిర్‌పోర్ట్ వద్ద దిగబెట్టిందని జిన్హుహా వార్తాసంస్థ తెలిపింది.
సైనిక తిరుగుబాటుపై టర్కీ ప్రధానమంత్రి బినాలీ యిల్దిరిమ్ కూడా స్పందించారు. ప్రస్తుతం రాజధాని అంకరాలో పరిస్థితి అదుపులోనే ఉందని, తిరుగుబాటుకు దిగిన 120మందిని అదుపులోకి తీసుకున్నామని ప్రధాని తెలిపారు. ప్రధాని ప్రకటన వెలువడిన 15 నిమిషాలకే టర్కీ పార్లమెంటు భవనం బాంబు దాడులతో దద్దరిల్లింది. ఈ దాడుల్లో పలువురు గాయపడ్డట్టు స్థానిక మీడియా తెలిపింది. అంతేకాకుండా అంకరాలో విమానాల రాకపోకలను నిలిపేస్తూ ’నో ప్లై జోన్’ ప్రకటించారు. ఎర్గోగాన్ ప్రభుత్వాన్ని కూల్చేందుకు సైన్యం తిరుగుబాటుకు దిగడంతో ఇప్పటికే 42 మంది ప్రాణాలు కోల్పోయారు.